- కీలక శాఖలు జిల్లాకు దక్కేనా..
- పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ
సాక్షి, విజయవాడ : చంద్రబాబు క్యాబినెట్‌లో జిల్లా నుంచి చోటు సంపాదించిన ముగ్గురు అమాత్యులకు ఏ శాఖలు లభిస్తాయనే అంశంపై తెలుగుదేశం పార్టీలో ఊహాగానాలు జోరందుకున్నాయి. మిగిలిన జిల్లాల కంటే కృష్ణాకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ముగ్గురికి మంత్రి పదవులిచ్చినట్లే.. కీలక శాఖలను కూడా ఈ జిల్లాకే కట్టబెడతారా.. లేక చిన్నాచితకా శాఖలను అంటగడతారా.. అని తర్జనభర్జన పడుతున్నారు.
ముగ్గురులోనూ దేవినేని ఉమానే కీలక వ్యక్తి కావడంతో ఆయనకు ఏ శాఖ ఇస్తారని పలువురు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కృష్ణాజిల్లా విషయంలో కొన్ని శాఖలకు కొన్ని సెంటిమెంట్లు ఉన్నాయి. అలాంటి శాఖలు దక్కకుండా ఉంటే బాగుండునని అభిప్రాయపడుతున్నారు.
ఉమకు ఈ శాఖలంటే ఇష్టం..
జిల్లాలో వ్యవసాయం, గతంలో తాను చేసిన పోరాటాలను దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్, వ్యవసాయ శాఖలను అడుగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయనకు ఇవికాకుండా భూగర్భ జలవనరుల శాఖ లభించినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని తెలుగుతమ్ముళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన ఉమ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో కీలక శాఖే లభిస్తుందని అంటున్నారు.
మామ శాఖే దక్కుతుందా..
మాజీ మంత్రి నడకుదిటి నరసింహారావు తరహాలోనే ఆయన అల్లుడు కొల్లు రవీంద్ర తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి అలంకరించారు. గతంలో చంద్రబాబు.. నరసింహారావుకు మత్స్య, బీసీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఇప్పుడు రవీంద్రకూ అదే దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనాలు వేస్తున్నారు. బీసీ నేతలు ఎవరైనా ఈ శాఖలు కోరితే రవీంద్రకు మరో శాఖ దక్కవచ్చు.
డాక్టర్ కామినేనికి వైద్యం, ఆరోగ్యం
బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కీలక శాఖే లభించే అవకాశం కనపడుతోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు డాక్టర్ కామినేని అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు వైద్య, ఆరోగ్య విభాగాలపై పూర్తి అవగాహన ఉండడంతో ఆయనకు కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ లభించవచ్చని అనుకుంటున్నారు.
సెంటిమెంట్ శాఖలు ఇవీ..
కొన్ని శాఖలను తీసుకోవాలంటే మంత్రులే భయపడతారు. గతంలో ఆ శాఖలు తీసుకున్న మంత్రులు తరువాతి కాలంలో రాజకీయంగా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎం.కె.బేగ్, దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)లు సాంకేతిక విద్యాశాఖ మంత్రులుగా పనిచేశారు. ఆ తరువాతి కాలంలో వారు తిరిగి మంత్రులుగా పనిచేసే అవకాశం రాలేదు. ఇప్పటికీ ఈ శాఖను జిల్లా మంత్రులు అచ్చిరానిది భావిస్తారు. అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా చేసినవారు అనేక రాజకీయ ఇబ్బందులు ఎదుర్కోవడంతోపాటు కనీసం ఎమ్మెల్యేగా గెలవకపోవడం వంటి సందర్భాలున్నాయి. ఈ శాఖను తీసుకోవడానికి మంత్రులు అంతగా ఆసక్తి చూపరు. మరి ఈ శాఖలకు మన మంత్రులు దూరంగా ఉంటారా.. లేదా..అని చర్చ జరుగుతోంది.