గంపెడాశలు
ముగ్గురు మంత్రులకు కీలక శాఖలు
డెల్టా ఆధునీకరణ కోసం రైతుల ఎదురుచూపులు
సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తారా..
బెల్టుషాపులపై కొరడా ఝుళిపించేనా
జిలా అభివృద్ధిపై దృష్టిపెట్టాలంటున్న ప్రజలు
మంత్రివర్గం కూర్పులో జిల్లాకు పెద్దపీట వేసి ముగ్గురికి అవకాశమిచ్చిన చంద్రబాబు.. వారికి శాఖల కేటాయింపులోనూ ప్రాధాన్యత కల్పించారు. దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రలతోపాటు మిత్రపక్షం బీజేపీ నుంచి డాక్టర్ కామినేని శ్రీనివాస్‌కు కీలక మంత్రిత్వ శాఖలు అప్పగించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోసిన ఆయా నేతల చేతికి ఇప్పుడు అధికార దండం లభించింది. మన మంత్రులు జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళతారని అందరూ గంపెడాశలు పెట్టుకున్నారు.
విజయవాడ :
మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా డెల్టా రైతుల కలలను నెరవేర్చేందుకు నడుం బిగించారు. ఎవరూ ఊహించని విధంగా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి తన హయాంలో మూడొంతుల పని పూర్తిచేశారు. గత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించినప్పటికీ ఇంకా రైతులకు నీరిచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం భారీ నీటిపారుదల శాఖ మంత్రి పదవి పొందిన దేవినేని ఉమామహేశ్వరరావు ఈ ప్రాజెక్టు విషయంలో పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆయనే ఈ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి ఖరీఫ్‌లో నీరందేలా కృషిచేయాలని రైతులు కోరుతున్నారు. కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులకు వైఎస్ శ్రీకారం చుట్టగా.. ఆయన తర్వాత వచ్చిన పాలకులు సరిగ్గా దృష్టిపెట్టకపోవడంతో ఆ పనులు కొలిక్కిరాలేదు. ఉమ తన పదవీకాలం పూర్తయేలోగా ఆధునీకరణ పనులు పూర్తిచేసి కృష్ణాడెల్టా రైతుల్ని ఆదుకోవాల్సి ఉంది.
కార్పొ‘రేట్’కు కళ్లెం పడేనా?
విద్య, వైద్యానికి గుర్తింపు పొందిన విజయవాడలో ఈ రెండూ కార్పొ‘రేట్’ కబంధహస్తాల్లో చిక్కుకున్నాయి. కార్పొరేట్ హాస్పిటళ్లు, మెడికల్ కాలేజీల్లోకి అడుగుపెట్టాలంటే వేలు, లక్షల రూపాయలు చేతిలో ఉండాలనేది నిష్ఠుర సత్యం. వైద్య విద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా డాక్టర్ కామినేని శ్రీనివాస్ బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో కార్పొరేట్ ఆస్పత్రులను నియంత్రించడంతోపాటు పేదల కోసం ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. వైఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు నిధులు మంజూరు చేసినా ఇప్పటివరకు స్థలాన్వేషణే జరగలేదు. అధికారుల అలసత్వానికి వైద్యశాఖ మంత్రి చికిత్స చేసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకోవాల్సి ఉంది. మరోవైపు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి స్థలాన్ని కేటాయించి చక్కటి భవనాలను నిర్మించాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
‘బెల్టు’ తీస్తారా?
మరో మంత్రి కొల్లు రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ, ఎక్సైజ్ శాఖలు లభిం చాయి. చంద్రబాబు పెట్టిన ఐదు సంతకాల్లో బెల్టు షాపుల రద్దు ఒకటి. మంత్రి సొంత జిల్లాలో ఈ హామీ సమర్థంగా అమలు జరుగుతుందా.. అని మహిళలు ఎదురుచూస్తున్నారు. మరోపక్క జిల్లాలోని లిక్కర్ సిండికేట్లు ప్రభుత్వాలనే శాసించే స్థాయిలో ఉన్నారు. వీరు తొలిసారి మంత్రి పదవి లభించిన రవీంద్రకు కొరుకుడుపడతారా.. లేక వీరి కనుసన్నలోకే మంత్రి వెళతారా.. అనేది వేచిచూడాల్సి ఉంది.