మంత్రి పదవులపై మొదలైన చర్చ | tdp leaders Hops on Cabinet post | Sakshi
Sakshi News home page

మంత్రి పదవులపై మొదలైన చర్చ

Published Thu, Jun 6 2024 8:45 AM | Last Updated on Thu, Jun 6 2024 1:05 PM

tdp leaders Hops on Cabinet post

సీనియర్‌ రేసులో కింజరాపు అచ్చెన్నాయుడు

తానేమి తక్కుద కాదనే స్థాయిలో కూన రవికుమార్‌

వెలమ, కాళింగ సామాజిక వర్గాలకు తప్పక ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి

జిల్లాలో ఒకరికే మంత్రి పదవిస్తే వీరిలో ఎవరికి?

కేంద్ర క్యాబినెట్‌ బెర్త్‌పై ఆశతో ఉన్న ఎంపీ రామ్మోహన్‌నాయుడు  

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 80 రోజుల ప్రహసనం పూర్తయ్యి ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడంతా ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్‌ కొలువు దీరడమే మిగిలి ఉంది. దీంతో అందరి దృష్టి జిల్లాలో ఎవరెవరికీ మంత్రి యోగం దక్కుతుందో అన్నదానిపైనే పడింది. కొత్తగా ఏర్పాటవుతున్న చంద్రబాబు క్యాబినెట్‌లో బెర్త్‌ కోసం ఎవరికి వారే ఆశలు పెట్టుకుంటున్నారు. వారిలో ప్రధానంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ పేర్లే చర్చకు వస్తున్నాయి. ఇక, ఎన్డీఏ భాగస్వామ్యం కావడం వల్ల కేంద్ర క్యాబినెట్‌లో కూడా టీడీపీలో కొందరికీ మంత్రి పదవులు దక్కుతాయి. ఆ అవకాశం హ్యాట్రిక్‌ విక్టరీ సాధించిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి వస్తుందన్న ఆశలు భారీగానే ఉన్నాయి.  

సార్వత్రిక ఎన్నికలకు మార్చి 15వ తేదీన ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ వచ్చింది. మే 13న పోలింగ్‌ జరిగింది. ఈ నెల 4వ తేదీన లెక్కింపు పూర్తయ్యింది. ఈ ఎన్నికల్లో కూట మి విజయబావుటా ఎగురవేసింది. ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వం, దాని విధి వి«ధానాల మేరకు పనిచేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడందరి దృష్టి మంత్రులెవరు అవుతారన్న దానిపైనే పడింది. జిల్లాలో హ్యాట్రిక్‌ విక్టరీతో ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా కింజరాపు అచ్చెన్నాయుడు, వరుసగా మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా బెందాళం అశోక్, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి ఉన్నారు.    

కాళింగ కోటాలో కూనకు దక్కే అవకాశం  
జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే టీడీపీ రాజకీయం రసవత్తరం కానుంది. కీలకమైన వెలమ సామాజిక వర్గానికివ్వాలా? కాళింగ సామాజిక వర్గానికా? అన్న చిక్కుముడి తప్పక ఉంటుంది. వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి వస్తే అచ్చెన్నాయుడికే దాదాపు ఇచ్చే అవకాశం ఉంది. కాళింగ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే రెండు సార్లు గెలిచి, గతంలో పార్టీ విప్‌గా పనిచేసి, ఇటీవల ఎన్నికల వరకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన కూన రవికుమార్‌కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. మూడు సార్లు గెలిచారని పరిగణనలోకి తీసుకుంటే ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌పై ఆలోచన చేసే అవకాశం ఉంది. 

కానీ, టీడీపీ రాజకీయాలు శాసిస్తున్న వారిగా చూస్తే కూన రవికుమార్‌కే అగ్రతాంబూలం ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్త సమీకరణాల నేపథ్యంలో జిల్లాలో ఒకరికే మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే మాత్రం సామాజిక వర్గ చిచ్చు రేగక తప్పదు. వెలమ సామాజిక వర్గానికిస్తే కాళింగులకు అనాయ్యం చేశారని, కాళింగులకు ఇస్తే వెలమలకు ముఖ్యంగా సీనియరైన కింజరాపు అచ్చెన్నాయుడికి మొండి చేయి చూపారని, అన్యాయం చేశారని ఆ సామాజిక వర్గం అనుకోక తప్పదు. జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులిస్తేనే ఆ రెండు సామాజిక వర్గాలకు న్యాయం చేసినట్టు అవుతుంది. 

లేదంటే ఒకరికి మంత్రి పదవి, మరొకరికి గతంలో మాదిరిగా విప్‌ ఇచ్చి సర్దుబాటైనా చేసి చేతులు దులుపుకోవచ్చు. ఈ సమయంలో అటు కాపుల నుంచి, ఇటు గౌతు ఫ్యామిలీ నుంచి గాని మంత్రి పదవి ఆశించే అవకాశం ఉండదు. జిల్లాలో ఎక్కువగా కాపులున్నప్పటికీ ఇతర జిల్లాల సమీకరణాల నేపథ్యంలో ఈ జిల్లా నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం వచ్చే ఛాన్స్‌ లేదు. ఇక, గౌతు ఫ్యామిలీని తీసుకుంటే తొలిసారిగా ఎన్నికైన ఎమ్మెల్యేగా శిరీషకు నచ్చ చెప్పి సమర్థించుకోవడానికి అవకాశం ఉంది. ’

రాష్ట్రంలో కొత్త మంత్రవర్గ ఏర్పాటుపై సస్పెన్స్

అచ్చెన్నకే పెద్దపీట..  
సామాజిక వర్గాల వారీగా చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికి, కాళింగ సామాజిక వర్గం నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. అదే స్థాయిలో జిల్లాలో ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక, సీనియర్ల కోటాలో ఎమ్మెల్యేగా ఉన్న ప్రతి సారి మంత్రి పదవి ఆశించి భంగపడ్డ గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ కుమార్తె శిరీషను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన తొలుత వెలమ సామాజిక వర్గాన్నే తీసుకుంటే ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కింజరాపు అచ్చెన్నాయుడిది. గతంలో మంత్రిగా పనిచేయగా, ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 

ఇక, రెండో పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికైన బగ్గు రమణమూర్తికి మంత్రి పదవి ఇచ్చేంత ప్రాధాన్యత లేదని పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. ఇక తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన గొండు శంకర్‌కు అదే గొప్ప పదవిగా భావించాలే తప్ప మంత్రి పదవి ఆశించేంత పరిస్థితి లేదని చెప్పుకోవాలి. ఈ లెక్కన చూస్తే వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడికే పెద్ద పీట వేయాల్సి ఉంటుంది. అధిష్టానం వైఖరిలో మార్పు ఉంటే తప్ప ఆయనకు దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.  

ఎంపీ రామ్మోహన్‌ తెరపైకి వస్తే...
ఎన్‌డీఏలో టీడీపీ భాగస్వామ్యం కావడం, ఆ పార్టీ నుంచి గెలిచిన హ్యాట్రిక్‌ ఎంపీగా కింజరాపు రామ్మోహన్‌నాయుడు నిలవడం, చంద్రబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో కేంద్ర కేబినెట్‌లో చోటు కలి్పస్తారేమోనన్న చర్చ జోరుగా నడుస్తోంది. దివంగత కింజరాపు ఎర్రంనాయుడు వారసుడిగా రాజకీయ ప్రవేశం చేసిన రామ్మోహన్‌నాయుడు వరుసగా విజయం సాధించడమే కాకుండా కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రామ్మోహన్‌నాయుడికి కేంద్ర మంత్రి పదవి ఇస్తే అప్పుడు జిల్లా సమీకరణాలపై ప్రభావం చూపుతుంది. 

ఇటు రాష్ట్రమంత్రిగా బాబాయ్‌ అచ్చెన్నాయుడికి, అటు కేంద్రమంత్రిగా అబ్బాయ్‌ రామ్మోహన్‌నాయుడికి చోటు కల్పిస్తే ఒకే సామాజిక వర్గం నుంచి ఇద్దరికీ అగ్రతాంబూలం ఇస్తారా? అన్న సామాజిక వివాదం చోటు చేసుకునే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వెలమ సామాజిక వర్గం నుంచి ఒకరికే ఇవ్వాలనుకుంటే రాష్ట్ర కేబినెట్‌లో అచ్చెన్నాయుడికి ఇవ్వాలి. కాదనుకుంటే కేంద్ర కేబినెట్‌లో రామ్మోహన్‌కు చోటు కలి్పంచాలి. ఈ సమయంలో బాబాయ్, అబ్బాయ్‌లో ఒకరికి మొండి చేయి తప్పదు. ఈ సమీకరణాల నేపథ్యంలో ఏమవుతుందో, ఎవరికి యోగం దక్కుతుందో చూడాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement