విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రి వర్గంపై కసరత్తులు కొనసాగుతున్నవేళ.. ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పదవే కావాలని పట్టుబడుతున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు, హోం శాఖ కావాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్‌కు హోం శాఖ ఖరారైందన్న ప్రచారం ఆ అనుమానాల్ని బలపరుస్తోంది.
చంద్రబాబు గతంలో కాపు డిప్యూటీ సీఎంకు హోంమంత్రి పదవి ఇచ్చారు. దీంతో ఇప్పుడూ అదే ఫార్ములా అమలు చేయాలంటు జనసేన పట్టుబడుతోంది. మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూడా కాపులకి అవకాశం దక్కని అంశాన్ని ప్రస్తావిస్తూ.. పవన్‌కు హోం శాఖ ఇచ్చి ఆ గ్యాప్‌ను బ్యాలెన్స్ చేయాలని డిమాండ్ జనసేన చేస్తోంది.
ఇంకోవైపు హోం మంత్రి పదవి టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకే అనే ప్రచారం ముందు నుంచి నడుస్తోంది. అదే సమయంలో రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రి పదవి దక్కడం, ఇప్పుడు జనసేన డిమాండ్‌తో అచ్చెన్నాయుడు మంత్రి పదవిపై సందిగ్థత నెలకొంది. దీంతో ఆయన టీడీపీ అధ్యక్ష పదవిలోనే కొనసాగుతారా? అనే చర్చ నడుస్తోంది.
కూటమిలో ఉన్న బీజేపీ డిమాండ్లపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ పార్టీ కూడా కేబినెట్‌లో కీలక పోస్టులను కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదీ చదవండి: మంత్రి పదవులెవరికో?.. ఏపీలో కొనసాగుతున్న ఉత్కంఠ
మరోవైపు.. కేంద్ర మంత్రివర్గంలో రాష్ట్రం నుంచి ముగ్గురు చేరారు. ఇది ఎమ్మెల్యేల్లో కొందరి అవకాశాల్ని దెబ్బతీసే పరిస్థితి కనిపిస్తోంది. యువత కూడా అధిక సంఖ్యలోనే గెలుపొందారు. ఆ మేరకు వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం పెరిగే వీలుంది. మంచి ఇమేజ్ ఉన్నవారికి, రాబోయే 10-15 ఏళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యమున్న వారికి ఈసారి అధిక అవకాశాలు లభిస్తాయన్న భావన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం కొందరు సీనియర్ల అవకాశాలకు గండి కొట్టొచ్చు.
ఇక స్పీకర్ పదవి కోసం సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కళా వెంకట్రావ్, అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ ముగ్గురూ ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలే కావడం గమనార్హం. అయితే గతంలో తన సామాజిక వర్గానికే స్పీకర్‌పదవి ఇచ్చుకున్న చంద్రబాబు.. ఈసారైనా బీసీ, ఎస్సీలకు ఇస్తారా? లేదంటే మళ్లీ తన సామాజిక వర్గానికే ఇప్పించుకుంటారా?అనే సస్పెన్స్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment