పార్టీల ఎన్నికల వ్యయంలో వైఎస్సార్‌సీపీ చివరి స్థానం
ఎలక్ట్రానిక్ మీడియా ఖర్చులో టీడీపీ అగ్రస్థానం
ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ విశ్లేషణ
న్యూఢిల్లీ: ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశంలోనే అత్యధికంగా ఖర్చు(సగటు) చేసిన రాజకీయ పార్టీగా శిరోమణి అకాలీదళ్ అగ్రస్థానంలో ఉండగా... అతి తక్కువ వ్యయం చేసిన పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ చివరన నిలిచింది. శిరోమణి అకాలీదళ్ వ్యయం రూ.50.32 లక్షలు కాగా, వైఎస్సార్‌సీపీ వ్యయం రూ.21.75 లక్షలుగా ఉన్నట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్), ఎన్నికల నిఘా జాతీయ సంస్థ(ఎన్‌ఈడబ్ల్యూ) సంయుక్తంగా వెల్లడించాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీల వ్యయంపై కేంద్ర ఎన్నికల సంఘం సమాచారాన్ని విశ్లేషించి ఆ వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించాయి. టీఆర్‌ఎస్ రూ.31.69 లక్షలు వ్యయం చేయగా, టీడీపీ వ్యయం రూ.31.03 లక్షలుగా ఉంది. ఇక శివసేన(రూ.46.94 లక్షలు), సీపీఎం(రూ.43.15 లక్షలు), బీజేపీ(రూ.41.81లక్షలు), కాంగ్రెస్(రూ.41. 63లక్షలు), ఆమ్ ఆద్మీ(రూ.28.24 లక్షలు) వ్యయం చేశాయి. ఎంపీల వారీగా చూస్తే అత్యధికంగా గౌరవ్ గొగోయ్ (కాంగ్రెస్, కాలియబోర్ నియోజకవర్గం, అసోం) రూ.82.40 లక్షలు... అతి తక్కువగా శ్యామాచరణ్ గుప్తా (బీజేపీ, అలహాబాద్ నియోజకవర్గం) రూ.39,369లు, అశోక్‌గజపతి రాజు (టీడీపీ, విజయనగరం నియోజకవర్గం) రూ.4.10లక్షలు వ్యయం చేసినట్లు తెలిపాయి.
టీడీపీ టాప్: లోక్‌సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం కోసం సగటున వ్యయం చేసిన పార్టీల్లో టీడీపీ అగ్రస్థానంలో నిలిచింది. టీడీపీ రూ.8.55 లక్షలు, టీఆర్‌ఎస్ రూ.6.69 లక్షలు, లోక్‌జనశక్తి రూ.4.88 లక్షలు, వైఎస్సార్‌సీపీ రూ.4.39 లక్షలు, సమాజ్‌వాదీ రూ.4.14 లక్షలు, బీజేపీ రూ.2.94 లక్షలు, కాంగ్రెస్ రూ.2.9 లక్షలు ఖర్చు చేశాయి. అతి తక్కువగా ఆమ్‌ఆద్మీ రూ.58 వేలు, సీపీఎం రూ.43 వేలు వ్యయం చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో దేశంలో రూ.299 కోట్ల నగదును జప్తు చేసినట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి 8,04,433 కేసులు నమోదు అయ్యాయని ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ తెలిపాయి.
ఎన్నికల వ్యయంలో ‘శిరోమణి’ టాప్
Published Sat, Aug 2 2014 1:22 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement
Advertisement