బందరు ఎంపీగా కొనకళ్ల
- రెండో పర్యాయం గెలుపు
- కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్
- 81వేల ఓట్లకు పైగా ఆధిక్యం
సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొనకళ్ల నారాయణరావు విజయం సాధించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిపై కొనకళ్ల సుమారు 81వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీకరణలు ఆయనకు లాభించడంతో రెండో పర్యాయం ఎంపీగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా జరిగిన క్రాస్ ఓంటింగ్ కొనకళ్లకు బాగా లాభించింది.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే నెగ్గిన గుడివాడలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అతి తక్కువ మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పామర్రులో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకే మెజార్టీ ఓట్లు వచ్చాయి. అవనిగడ్డ, బందరు, పెడన, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోను భారీగా క్రాస్ ఓటింగ్ ఎంపీకి మెజార్టీని పెంచింది. మాజీ మంత్రిగా కొలుసు పార్థసారథి ప్రాతినిథ్యం వహించిన పెనమలూరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ ఫలించి ఆయనకు భారీ మెజార్టీ తెచ్చిపెట్టేలా దోహదం చేసింది. రౌండ్ రౌండ్‌కు కొనకళ్లకు ఆధిక్యత పెరిగింది.
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ రెండు చోట్ల వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా ఐదు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అన్నింటా కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ అనుకూలించిన తీరు ఇలా ఉంది. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి బోడే ప్రసాద్‌కు 31,448ఓట్లు మెజార్టీ వచ్చింది. బోడే కంటే కొనకళ్లకు తక్కువ ఓట్లు పోలవడంతో మెజార్టీ సుమారు వెయ్యి తగ్గింది.
వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం అంత కలిసిరాలేదు. పెనమలూరు నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ కారణంగా సారథి కంటే కొనకళ్లకు మెజార్టీ తెచ్చిపెట్టింది. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనకళ్లకు మొత్తం 1,05,105ఓట్లు రాగా, సారథికి 74,398ఓట్లు వచ్చాయి. దీంతో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనకళ్లకు 30,707మెజార్టీ వచ్చింది.
అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 5,959ఓట్ల మెజార్టీ సాధిస్తే క్రాస్ ఓటింగ్ కారణంగా ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు మాత్రం ఏకంగా 10,300 ఓట్లు మెజార్టీ దాటింది. బందరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రకు 15,806ఓట్ల మెజార్టీ రాగా, ఎంపీగా కొనకళ్లకు 16,712ఓట్లు మెజార్టీ వచ్చింది. పెడన నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత వెంకట్రావుకు 13,683ఓట్లు మెజార్టీ రాగా ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 16,345 ఓట్లు మెజార్టీ వచ్చింది.
పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన 1,069 ఓట్లు మెజార్టీతో గెలుపొందగా ఆదే నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 426ఓట్లమెజార్టీ వచ్చింది. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి 11,529ఓట్లు మెజార్టీతో గెలుపొందగా అక్కడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథికి 3,222ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం మినహా అన్ని చోట్ల కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ అనుకూలించడంతో గెలుపు దక్కించుకున్నారు.
ఎంపీ ఓట్ల లెక్కింపులో గజిబిజి గందరగోళం...
మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీరు గజిబిజి గందరగోళంగా మారింది. కానూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బందరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం, పెడన. గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిర్వహించారు. ఎప్పటికప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల వివరాలు ప్రతీ రౌండ్‌లోనూ కాస్త ఆలస్యంగా వెల్లడించారు.
ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల బాధ్యుల్లో సమన్వయలోపం కారణంగా లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల వివరాలు రౌండ్ల వారీగా ప్రకటించలేదు. మీడియాకు ఒక గది కేటాయించి వారిని అక్కడే కట్టుదిట్టం చేయడంతో వారికి సకాలంలో సమాచారం అందక అవస్థలు పడ్డారు. అధికారులు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సమాచారం సకాలంలో ఇవ్వగలిగినా లోక్‌సభ ఓట్ల వివరాలు ఇవ్వలేకపోయారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం మోరాయించడంతో బందరు లోక్‌సభ నియోజకవర్గ ఫలితాన్ని రాత్రి పది గంటల వరకు అధికారికంగా ప్రకటించలేదు.
నమ్మకంతో గెలిపించారు : కొనకళ్ల
తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు అన్నారు. శుక్రవారం కానూరు సిద్థార్థ ఇజినీరింగ్ కాలేజిలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నీతివంతమైన పాలన కోరుకున్న ప్రజలు దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనను కోరుకున్నారని కొనకళ్ల అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పునర్ నిర్మించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని ప్రజలు నమ్మినట్టు తేలిందని కొనకళ్ల అన్నారు. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు.