konakalla narayana
-
మంత్రి కొల్లు, ఎంపీ కొనకళ్లకు చుక్కెదురు
బుద్దాలపాలెంలో కుర్చీలు విసిరేసిన గ్రామస్థులు భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి గ్రామాల్లోకి రావాలని డిమాండ్ గ్రామస్థుల వాగ్వాదంతో వెనుదిరిగిన మంత్రి, ఎంపీ సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో కోన గ్రామంలో జరిగిన సీన్ రిపీటైంది. బుద్దాలపాలెంలో భూసేకరణపై మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులకు చుక్కెదురైంది. స్థానిక ఎంపీయూపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కొల్లు మాట్లాడుతూ అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ చేస్తున్నామని, భూములు సేకరిస్తామే తప్ప గ్రామాలను ఖాళీ చేయించబోమని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ.. ‘మాతో సంప్రదింపులు జరపకుండా మీ ఇష్టానుసారం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామంలో ఒక్క సెంటు భూమి కూడా పరిశ్రమల స్థాపన కోసం ఇచ్చేది లేదు. అప్పటి వరకు ఈ సమావేశంలో మాట్లాడవద్దు’ అంటూ అడ్డు తగిలారు. భూసేకరణపై అవగాహన కల్పించేందుకే తాము గ్రామానికి వచ్చామని, రైతులంతా కుర్చీల్లో కూర్చోవాలని మంత్రి కోరినప్పటికీ అందుకు వారు అంగీకరించలేదు. అనంతరం ఓ మహిళకు అభిప్రాయం చెప్పాలని మైక్ ఇచ్చారు. ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తామని చెప్పారని, అవి ఇంతవరకు రద్దు కాలేదని, ఇప్పుడు భూసేకరణ చేస్తామని చెప్పి మమ్మల్ని గ్రామం నుంచి పంపుతారా అని ఆ మహిళ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఉన్న టీడీపీ కార్యకర్త ఒకరు మహిళ నుంచి మైక్ లాక్కోవటంతో గందరగోళం నెలకొంది. ‘మాట్లాడుతున్న మహిళ నుంచి మైక్ తీసుకుంటారా’ అని గ్రామస్థులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాతే మీరు గ్రామానికి రావాలి. అప్పటివరకు మీ మాటలు వినేది లేదు. తక్షణమే ఈ సభను రద్దు చేయాలి’ అని గ్రామస్థులు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. అయినప్పటికీ మంత్రి మాట్లాడబోతుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు వారి ఎదురుగా ఉన్న కుర్చీలను పైకి విసిరేశారు. సమావేశం జరిగే అవకాశం లేకపోవటంతో మంత్రి, ఎంపీ వెనుదిరిగి కారు వద్దకు వెళుతుండగా.. గ్రామస్థులు వారి వెనుకే అనుసరిస్తూ ‘మంత్రి కొల్లు రవీంద్ర డౌన్ డౌన్’, ‘ఎంపీ కొనకళ్ల నారాయణరావు డౌన్ డౌన్’, ‘భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రైతుల అంగీకారం ఉంటేనే సంప్రదింపులు జరుపుతామని, ఇష్టం లేకుంటే సంప్రదింపులు జరిపేది లేదని చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేశాకే మళ్లీ గ్రామానికి వస్తానని స్పష్టం చేశారు. వీరు గ్రామాన్ని విడిచిపెట్టిన అనంతరం పోలీసులు పికెట్ నిర్వహించారు. -
గన్నవరం నుంచి ఢిల్లీకి ఏయిరిండియా సర్వీసు
విజయవాడ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. గన్నవరం నుంచి న్యూఢిల్లీకి నూతన సర్వీసు ప్రారంభించింది. ఈ సర్వీసుని ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ తదితరులు గురువారం ఉదయం లాంఛనప్రాయంగా ప్రారంభించారు. మరిన్ని విమాన సర్వీసులు తెచ్చే దిశగా ప్రయత్నిస్తామని ఎంపీలు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ మీదుగా ఢిల్లీ-విజయవాడ మధ్య ప్రతిరోజు ఒక సర్వీసు నడుస్తోంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్, బర్మింగ్‌హాం, ఫ్రాంక్ఫర్ట్, ఖాట్మండు, లండన్, మెల్బోర్న్, సిడ్నీ, ప్యారిస్, రోమ్, మిలన్‌లకు వెళ్లే విమానాలకు కనెక్ట్ అయ్యేందుకు కొత్త సర్వీసు దోహదం చేస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది. -
త్వరలో బందరు పోర్టు పనులు: ఎంపీ
బందరు పోర్టు పనులకు భూసేకరణే అడ్డంగా మారిందని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ చెప్పారు. మరో రెండు, మూడు నెలల్లోనే పోర్టు పనులు ప్రారంభిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని ఆయన అన్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. -
జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి
లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : జిల్లా కేంద్రమైన మచిలీపట్నంతోపాటు ఇతర ముఖ్య పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు కృషి చేస్తానని బందరు ఎంపీ, లోక్‌సభ ప్యానల్ స్పీకర్ కొనకళ్ల నారాయణరావు హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లల్లో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్‌ను ఆది వారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కొనకళ్లతోపాటు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ రఘునందనరావు, ఎస్పీ ప్రభాకరరావు పాల్గొన్నారు. మంత్రి రవీంద్ర కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. కొనకళ్ల మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పోలీసు అధికారులు తనను సంప్రదించిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేశానన్నారు. మచిలీపట్నంతో పాటు జిల్లాలోని ఇతర ముఖ్య పట్టణాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేసేం దుకు కృషి చేస్తానన్నారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ మచిలీపట్నంలో సీసీ కెమేరాల ఏర్పాటు అభినందనీయమన్నారు. అయితే గతంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు ఏర్పాటుచేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రస్తుతం నిరుపయోగంగా మారాయన్నారు. వాటిని ఉపయోగంలోకి తీసుకొచ్చేలా ఉన్నతాధికారులు కృషి చేస్తేనే ట్రాఫిక్ సమస్య పరిష్కారమవుతుందని సూచించారు. కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజలకు రక్షణ కల్పించేలా విధులు నిర్వర్తించాలన్నారు. పట్టణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను అవసరమైన మేరకు తాము వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎస్పీ ప్రభాకరరావు మాట్లాడుతూ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో ట్రాఫిక్ నియంత్రణ సులభమవుతుందన్నారు. నేరాలు నియంత్రిం చేందుకు దోహదపడుతుందన్నారు. నేరస్థులపై నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం జిల్లాలోని జగ్గయ్యపేట, పామర్రు పట్టణాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు మచిలీపట్నంలోని ప్రధాన కూడళ్లయిన మూడు స్తంభాలసెంటర్, కోనేరుసెంటర్, బస్‌స్టాండ్‌సెంటర్, ప్రభుత్వాస్పత్రి, చేపల మార్కెట్, రైతు బజార్, కాలేఖాన్పేటతో మరో 32 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిధుల మంజూరుకు కృషి చేసిన కొనకళ్లకు ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. మునిసిపల్ కమిషనర్ మోటమర్రి బాబా ప్రసాద్, అడిషనల్ ఎస్పీ బి.డి.వి.సాగర్, బందరు డీఎస్పీ డాక్టర్ కె.వి.శ్రీనివాసరావు, సీఐలు, ఎస్సైలు, పట్టణ ప్రముఖలు, జనమైత్రి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
లోక్‌సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం
న్యూఢిల్లీ: ఆకాశానంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీత కోరారు. లోక్‌సభలో తొలిసారిగా మాట్లాడుతూ రోజు రోజుకు పెరుగుతున్న ధరల గురించి ప్రస్తావించారు. తమ బతుకులను బాగుచేస్తారనే నమ్మకంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ప్రజలు సంపూర్ణ మెజారిటీతో అధికారం కట్టబెట్టారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మోడీ సర్కారు ఉందన్నారు. ధరల పెరుగుదలను అరికట్టి సామాన్యులపై భారం తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. పౌరసరఫరాల వ్యవస్థను సంస్కరించాలని సూచించారు. దేశమంతా 'ఒకే ధర' విధానాన్ని అమలు చేయాలని కోరారు. తొలిసారిగా లోక్‌సభలో మాట్లాడిన కొత్తపల్లి గీత ఏ మాత్రం తొణక్కుండా తాను చెప్పాల్పింది చెప్పారు. ఆమె ప్రసంగాన్ని సభ్యులు శ్రద్ధగా విన్నారు. ఆమె లోక్‌సభలో మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ ఉండడం విశేషం. -
లోక్‌సభలో ఆకట్టుకున్న కొత్తపల్లి గీత ప్రసంగం
-
‘బెజవాడ’కు పెద్దపీట వేస్తారా!?
నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చే నెల ఎనిమిదో తేదీన రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ తరుణంలో విజయవాడ డివిజన్‌పై మన నేతలు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఉంది. జిల్లాకు చెందిన ఇద్దరు ఎంపీలు కొనకళ్ల నారాయణ (మచిలీపట్నం), కేశినేని శ్రీనివాస్ (విజయవాడ) ఆ పార్టీకి చెందినవారే కావడంతో రైల్వే మంత్రి సదానందగౌడ్‌ను ఒప్పించి సాధ్యమైనన్ని వరాలు పొందాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్నివిధాల విజయవాడ కీలకం కానుంది. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటవుతుందని ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పటికే విజయవాడ డివిజన్లో రైల్ ట్రాఫిక్ అధికంగా ఉంది. లభించే ఆదాయం కూడా బాగానే ఉంటోంది. విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటుచేస్తే ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారి సంఖ్య అనూహ్యంగా పెరగవచ్చు. రైళ్లను కూడా పెంచాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజయవాడ డివిజన్‌కు తగినన్ని నిధులు రాబట్టకపోతే ఈ ప్రాంతం అభివృద్ధిలో వెనుకబడిపోయే అవకాశం ఉందని రైల్వే అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఎంపీలు దృష్టి పెట్టాల్సిన అంశాలివీ.. విజయవాడ-గుంటూరు-తెనాలి మధ్య మెట్రో రైలు ఏర్పాటు చేయిస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఇప్పటికే హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సుమారుగా రూ.2,000 కోట్లు అవుతుందని ప్రాథమిక అంచనా. ఈ బడ్జెట్లో కనీసం రూ.500 కోట్లు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉంది. 2015లో గోదావరి పుష్కరాలు, 2016లో కృష్ణా పుష్కరాలు రానున్నాయి. వీటి కోసం ప్రత్యేక రైళ్లు వేస్తారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం కోసం ఈ ఏడాది బడ్జెట్లోనే కనీసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయించాలి. నిధులు లేనందున విజయవాడ రైల్వే స్టేషన్లో రూట్ రిలే ఇంటర్ లాకింగ్ ప్రాజెక్టు(ఆర్ఆర్ఎల్) అమలులో జాప్యం జరుగుతోంది. దీనివల్ల నగరం వెలుపలకు వచ్చిన రైళ్లు ప్లాట్‌ఫారాలపై రావడానికి కనీసం అర్ధగంట పడుతోంది. దీనికి కనీసం రూ.50 కోట్లు ఖర్చవుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒకటి నుంచి ఐదు ప్లాట్‌ఫారాలకు వచ్చే రైళ్ల జాప్యాన్ని తగ్గించవచ్చు. 2, 3, 4, 5 ప్లాట్‌ఫారాలపై ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న మెట్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం ఎక్కేందుకు, దిగేందుకు ఒకే మెట్ల మార్గం ఉండడం వల్ల ప్రయాణికులు తోసుకోవాల్సివస్తోంది. అందువల్ల పక్కనే మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. మచిలీపట్నంలో పోర్టును అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అంతకంటే ముందు విజయవాడ- మచిలీపట్నం రైల్వే లైనును అభివృద్ధి చేయాల్సిన అసరం ఎంతైనా ఉంది. లేకపోతే సరుకు రవాణాకు ఇబ్బంది అవుతుంది. విజయవాడ, గుంటూరు, తెనాలి స్టేషన్లను ‘ఏ’ క్లాస్‌గా ప్రకటించి అభివృద్ధి చేయాలి. విజయవాడ కేంద్రంగా కొత్త జోన్‌ను సాధించాలి. విజయవాడ నుంచి ప్రారంభమయ్యే రైళ్లును రాబట్టాలి. జోథపూర్, బెంగళూరు, అహ్మదాబాద్, ఓక్ తదితర ప్రాంతాలకు విజయవాడ నుంచి రైళ్లు నడిపేందుకు కృషిచేయాలి. ఎలక్ట్రికల్ లోకో వర్క్‌షాపును ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైంది. దీన్ని ఈ ఐదేళ్లలోనైనా సాధించాలి. బందరు ఎంపీ నారాయణరావు ప్రధాన డిమాండ్లు మచిలీపట్నం-నర్సపూర్‌ల రూట్లో ప్రతిరోజు రైలు మచిలీపట్నం నుంచి చెన్నై, యశ్వంత్‌పూర్, ముంబాయిలకు రైళ్ల ఏర్పాటు మచిలీపట్నం, గుడివాడ రైల్వేస్టేషన్లను అప్‌గ్రేడేషన్ చేసి ఆధునిక రైల్వేస్టేషన్లుగా తీర్చిదిద్దాలి విజయవాడ- గుడివాడ రైల్వే మార్గం ఇప్పటికే డబ్లింగ్ జరుగుతోంది.రాబోయే రోజుల్లో గుడివాడ-మచిలీపట్నం రైల్వేమార్గాన్ని డబ్లింగ్ విద్యుదీకరణ చేయాలి. గుడివాడ,పెడనలలో రైల్వే ట్రాక్స్‌పై ఫ్లైఓవర్ నిర్మాణాలకు నిధులు మంజూరు విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ డిమాండ్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ అయ్యే అవకాశాలు ఉన్నందున విజయవాడ కేంద్రంగా ఒక రైల్వే జోన్ ఏర్పాటుచేయాలి. విజయవాడ-కర్నూలు రైల్వే లైన్‌ను డబ్లింగ్ చేయాలి. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి వందలాది మంది స్టాఫ్‌వేర్ ఇంజినీర్లు బెంగళూరు వెళ్లుతున్నందున విజయవాడ- బెంగళూరుకు ప్రతిరోజు రైలు ఏర్పాటు చేయాలి. ముంబాయి, కోల్‌కతా, షిర్డీ, ఢిల్లీ నగరాలకు విజయవాడ నుంచి ప్రారంభమయ్యేటట్లు రైళ్లు ఏర్పాటు చేయాలి. పైనుంచి వచ్చే రైళ్లలో విజయవాడకు కేటాయిస్తున్న కోటా ఏమాత్రం సరిపోనందున ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే రైళ్లు ఏర్పాటు అవసరం ఉంది. విజయవాడ, గుంటూరు, తెనాలి మెట్రో రైలు ప్రారంభించాలి. ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయిస్తే భవిష్యత్తులో వాటిని మరింత పెంచవచ్చు. -
బందరు ఎంపీగా కొనకళ్ల
రెండో పర్యాయం గెలుపు కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్ 81వేల ఓట్లకు పైగా ఆధిక్యం సాక్షి, మచిలీపట్నం : మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి కొనకళ్ల నారాయణరావు విజయం సాధించారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిపై కొనకళ్ల సుమారు 81వేలకుపైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సమీకరణలు ఆయనకు లాభించడంతో రెండో పర్యాయం ఎంపీగా ఎన్నికయ్యారు. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా జరిగిన క్రాస్ ఓంటింగ్ కొనకళ్లకు బాగా లాభించింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నెగ్గిన గుడివాడలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి అతి తక్కువ మెజార్టీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పామర్రులో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గెలిచినప్పటికీ టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకే మెజార్టీ ఓట్లు వచ్చాయి. అవనిగడ్డ, బందరు, పెడన, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోను భారీగా క్రాస్ ఓటింగ్ ఎంపీకి మెజార్టీని పెంచింది. మాజీ మంత్రిగా కొలుసు పార్థసారథి ప్రాతినిథ్యం వహించిన పెనమలూరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ ఫలించి ఆయనకు భారీ మెజార్టీ తెచ్చిపెట్టేలా దోహదం చేసింది. రౌండ్ రౌండ్‌కు కొనకళ్లకు ఆధిక్యత పెరిగింది. మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ రెండు చోట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా ఐదు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. అన్నింటా కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ అనుకూలించిన తీరు ఇలా ఉంది. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి బోడే ప్రసాద్‌కు 31,448ఓట్లు మెజార్టీ వచ్చింది. బోడే కంటే కొనకళ్లకు తక్కువ ఓట్లు పోలవడంతో మెజార్టీ సుమారు వెయ్యి తగ్గింది. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి పెనమలూరు నియోజకవర్గం నుంచి గత ప్రభుత్వంలో ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గం అంత కలిసిరాలేదు. పెనమలూరు నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ కారణంగా సారథి కంటే కొనకళ్లకు మెజార్టీ తెచ్చిపెట్టింది. పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనకళ్లకు మొత్తం 1,05,105ఓట్లు రాగా, సారథికి 74,398ఓట్లు వచ్చాయి. దీంతో పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనకళ్లకు 30,707మెజార్టీ వచ్చింది. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 5,959ఓట్ల మెజార్టీ సాధిస్తే క్రాస్ ఓటింగ్ కారణంగా ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు మాత్రం ఏకంగా 10,300 ఓట్లు మెజార్టీ దాటింది. బందరు నియోజకవర్గంలోనూ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రకు 15,806ఓట్ల మెజార్టీ రాగా, ఎంపీగా కొనకళ్లకు 16,712ఓట్లు మెజార్టీ వచ్చింది. పెడన నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత వెంకట్రావుకు 13,683ఓట్లు మెజార్టీ రాగా ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 16,345 ఓట్లు మెజార్టీ వచ్చింది. పామర్రు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన 1,069 ఓట్లు మెజార్టీతో గెలుపొందగా ఆదే నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 426ఓట్లమెజార్టీ వచ్చింది. గుడివాడ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి 11,529ఓట్లు మెజార్టీతో గెలుపొందగా అక్కడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి కొలుసు పార్థసారథికి 3,222ఓట్ల మెజార్టీ వచ్చింది. మొత్తానికి గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం మినహా అన్ని చోట్ల కొనకళ్లకు క్రాస్ ఓటింగ్ అనుకూలించడంతో గెలుపు దక్కించుకున్నారు. ఎంపీ ఓట్ల లెక్కింపులో గజిబిజి గందరగోళం... మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు తీరు గజిబిజి గందరగోళంగా మారింది. కానూరులోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో బందరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మచిలీపట్నం, పెడన. గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిర్వహించారు. ఎప్పటికప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల వివరాలు ప్రతీ రౌండ్లోనూ కాస్త ఆలస్యంగా వెల్లడించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల బాధ్యుల్లో సమన్వయలోపం కారణంగా లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల వివరాలు రౌండ్ల వారీగా ప్రకటించలేదు. మీడియాకు ఒక గది కేటాయించి వారిని అక్కడే కట్టుదిట్టం చేయడంతో వారికి సకాలంలో సమాచారం అందక అవస్థలు పడ్డారు. అధికారులు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు సమాచారం సకాలంలో ఇవ్వగలిగినా లోక్‌సభ ఓట్ల వివరాలు ఇవ్వలేకపోయారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎం మోరాయించడంతో బందరు లోక్‌సభ నియోజకవర్గ ఫలితాన్ని రాత్రి పది గంటల వరకు అధికారికంగా ప్రకటించలేదు. నమ్మకంతో గెలిపించారు : కొనకళ్ల తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేలా పనిచేస్తానని టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావు అన్నారు. శుక్రవారం కానూరు సిద్థార్థ ఇజినీరింగ్ కాలేజిలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నీతివంతమైన పాలన కోరుకున్న ప్రజలు దేశంలో నరేంద్రమోడీ, రాష్ట్రంలో చంద్రబాబు పాలనను కోరుకున్నారని కొనకళ్ల అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పునర్ నిర్మించే ఏకైక నాయకుడు చంద్రబాబేనని ప్రజలు నమ్మినట్టు తేలిందని కొనకళ్ల అన్నారు. జిల్లాను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. -
కొనకళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన
మచిలీపట్నం : బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు పార్లమెంటు సమావేశంలో ఉన్న సమయంలో గుండెపోటుకు గురయ్యారనే సమాచారంతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎంపీ కొనకళ్ల గత పదిహేను రోజుల నుంచి అనారోగ్యంగానే ఉన్నా తెలంగాణ అంశం నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటున్నారు. ఎంపీ భార్య పద్మజకు అనారోగ్యంగా ఉండటంతో ఆమె గత నాలుగు రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు. ఎంపీ, ఆయన భార్య ఇద్దరూ ఒకేసారి అనారోగ్యానికి గురికావడంతో ఆయన బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎంపీ కొనకళ్ల గుండెపోటుకు గురయ్యారనే సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన బంధువులు ఎంపీ ఇంటికి వచ్చారు. నెట్లోనూ, టీవీలలోనూ వస్తున్న వార్తలను చూస్తూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ల ద్వారా సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎంపీ కొనకళ్ల సోదరుడు కొనకళ్ల బుల్లయ్య గత పది రోజులుగా ఢిల్లీలోనే తన సోదరుడి వద్ద ఉంటున్నారు. ఎంపీ కొనకళ్ల అనారోగ్యం పాలవడంతో ఆయన బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎంపీ గృహానికి వెళ్లిన సమయంలో వారి బంధువులు వెలిబుచ్చిన ఆందోళన వారి మాటల్లోనే... ఆందోళనకు గురవుతున్నాం - గీత, ఎంపీ మేనకోడలు మామయ్యకు అనారోగ్యంగా ఉందనే సమాచారం మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చెప్పడంతో షాక్‌కు గురయ్యాను. తెలంగాణ అంశం పార్లమెంటులో చర్చకు వచ్చిన సమయంలో మామయ్య అనారోగ్యానికి గురవడం బాధ కలిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్నా కీలక సమయంలో ఆస్పత్రిలో చేరితే ప్రజలు వేరేలా అనుకుంటారని భావించి ఆయన ఆస్పత్రిలో కూడా చేరలేదు. పద్మజ అత్తయ్య కూడా నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఉండటం, మామయ్య అనారోగ్యం పాలవడం మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోంది. అసత్య వార్తలతో మరింత ఆందోళన - నాగశ్రీ, ఎంపీ మేనల్లుడి భార్య ఎంపీ కొనకళ్ల నారాయణరావు అస్వస్థతకు గురైతే ఒక్కొక్క చానల్లో ఒక్కొక్క రకంగా ప్రసారం చేస్తున్నారు. ఒకరేమో పాయిజన్ తీసుకున్నారని, మరొకరేమో గుండెపోటుకు గురయ్యారని, కొన్ని వెబ్సైట్లలో ఏవేవో కామెంట్లు పెట్టి బంధువులను ఆందోళనకు గురిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన పార్లమెంటులోనే ఉండి పోరాటం చేస్తున్నారు. పలుమార్లు నాతోనూ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని, దాని కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావటం కలచివేసింది. అసలు విషయాన్ని కప్పిపుచ్చి కొన్ని ప్రసార మాధ్యమాలు, వెబ్సైట్లు ఏవేవో కామెంట్లు పెట్టడం బాధ కలిగించింది. పెదనాన్న ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది - శృతి, సోదరుడి కుమార్తె పెదనాన్న నారాయణరావు ఆరోగ్యంపై మాకు ఆందోళనగానే ఉంది. పార్లమెంటు సమావేశాల్లో పెదనాన్న టీవీలో మాట్లాడటం చూశా. కాసేపటి తరువాత టీవీ చూస్తే పెదనాన్న గుండెపోటుకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. యూ ట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే ఏవేవో కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి కామెంట్లు కుటుంబ సభ్యులకు బాధ కలిగిస్తున్నాయి. పెదనాన్న ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నా. బందరులో టీడీపీ నాయకుల ర్యాలీ బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు పార్లమెంటులో గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బందరులోని టీడీపీ నాయకులు గురువారం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఈ బిల్లును అడ్డుకునేందుకు కొనకళ్ల తీవ్ర పోరాటం చేశారని టీడీపీ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా కార్యదర్శి బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, మోటమర్రి బాబాప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎంపీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో టీడీపీ నాయకులు వ్యాపార సంస్థలను మూయించారు. పెడన తదితర ప్రాంతాల్లో ఎంపీ ఆరోగ్యం కుదుటపడాలని పలు దేవాలయాలు, చర్చిల్లో ప్రార్థనలు, పూజలు చేశారు. -
సోనియా బాధ్యురాలు: బాబు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో చోటుచేసుకున్న పరిణామాలు, పరాకాష్టకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ బాధ్యురాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఆమెకు అనుభవమూ, పరిపక్వత లేదని విమర్శించారు. పార్లమెంటులో ఇంత జరిగినా సోనియా, ప్రధాని మన్మోహన్, రాహుల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. లోక్‌సభ పరిణామాలకు ముగ్గురూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదేం సోనియా రాజ్యం కాదని దుయ్యబట్టారు. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణను బాబు గురువారం పరామర్శించారు. అనంతరం బాబు మీడియాతో మాట్లాడుతూ, ఇరు ప్రాంతాల వారిని కూర్చోబెట్టి మాట్లాడకుండా ఢిల్లీలో కూర్చొని నిర్ణయం తీసుకోడానికి వీరెవరని ప్రశ్నించారు. ఎస్సార్సీ, కమిషన్, కమిటీలు, అసెంబ్లీ తీర్మానాల ద్వారా రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారని, కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఓట్లు, సీట్లు, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిందని ధ్వజమెత్తారు. బిల్లులో రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయన్నారు. దొంగల వలే టేబుల్ ఐటమ్‌గా బిల్లు పెట్టారని, బిల్లు కోసం అంత రహస్యమెందుకని ప్రశ్నించారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రులు వెల్‌లోకి వచ్చి సభలను అడ్డుకుంటే వారిని నియంత్రించలేకపోయారన్నారు. స్పీకర్ ప్రవర్తన బాధాకరమన్నారు. గొడవల మధ్య బిల్లులను చదివి పాసు చేయడంలో స్పీకర్ చూపిన ఉత్సాహం సభ్యులను కాపాడడంలో చూపలేదని విమర్శించారు. మోదుగుల మైకు పట్టుకుంటే కత్తి పట్టుకున్నారని మంత్రి కమల్‌నాథ్ అనడం దుర్మార్గమన్నారు. సోనియా ఇటాలియన్ గాంధీలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
కొనకళ్లకు తీవ్ర అస్వస్థత
లోక్‌సభలో ఛాతీ నొప్పితో కుప్పకూలిన ఎంపీ తొలుత లోిహయాకు, ఆపై.. అపోలోకు తరలింపు పొన్నం, బలరాం నాయక్, వినయ్‌కుమార్ పాండేలకూ అస్వస్థత వైద్యం అనంతరం ముగ్గురు డిశ్చార్జి సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉదిక్తత చోటు చేసుకోవడంతో టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సభలో ఉన్న సమయంలోనే ఛాతీలో నొప్పి రావడంతో పాటు బీపీ, పల్స్ రేటు పెరగడంతో.. కుప్పకూలారు. వెంటనే ఆయన్ను లోహియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లగడపాటి పెప్పర్ స్ప్రే ఘటనలో అస్వస్థతకు గురైన కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, యూపీలోని శ్రావస్తి ఎంపీ వినయ్‌కుమార్ పాండేలకు ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం డిశ్చార్జి చేశారు. లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన వెంటనే.. పలువురు సభ్యులు, సందర్శకులు, పాత్రికేయులకు దగ్గు, కళ్ల మంటలు ప్రారంభమయ్యాయి. అస్వస్థతకు గురైన పొన్నం, బలరాం నాయక్, వినయ్‌కుమార్ పాండేను అంబులెన్సులో సమీపంలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. నారాయణ పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం సాయంత్రం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కొనకళ్ల నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు గురువారం రాత్రి తెలిపారు. రక్తపోటు, పల్స్ సాధారణ స్థితికి వచ్చాయని... అబ్జర్వేషన్లో పెట్టామని చెప్పారు. ప్రస్తుతానికైతే బైపాస్ సర్జరీ చేసే ఆలోచనేదీ లేదని వివరించారు. -
ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి విషమం
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు పరిస్థితి విషమించింది. లోక్ సభలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో తీవ్రంగా ఒత్తడికి లోనైన ఆయనకు గుండెపోటు రావడంతో నిండు సభలోనే ఆయన కుప్పకూలిపోయారు. సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల ఎంపీలు, మార్షల్స్ కూడా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను అదుపు చేయడానికి పిడిగుద్దులు కురిపించారు. సరిగ్గా ఆ సమయంలోనే కొనకళ్ల నారాయణ కుప్పకూలిపోయారు. వాయిదా అనంతరం సభ జరుగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా గుండె పట్టుకుని కూలిపోయారు. దాంతో పార్లమెంట్ సిబ్బంది...కొనకళ్ల నారాయణను హుటాహుటీన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి కరొనరీ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స చేయించినా.. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కొనకళ్లను హుటాహుటిన అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు. అంతకు ముందు కొనకళ్ల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలిపేందుకు కూడా సభలో అవకాశం ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా తమపై దాడికి యత్నించిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలు తమపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తమపై దాడికి పాల్పడే... పైపెచ్చు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కొనకళ్ల మండిపడ్డారు. కాగా లోక్‌సభలో పెప్పర్ స్ప్రే ఘాటుకు అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. ముఖం మండుతుందని వారికి మందులు ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.