కొనకళ్లకు తీవ్ర అస్వస్థత
లోక్‌సభలో ఛాతీ నొప్పితో కుప్పకూలిన ఎంపీ
తొలుత లోిహయాకు, ఆపై.. అపోలోకు తరలింపు
పొన్నం, బలరాం నాయక్, వినయ్‌కుమార్ పాండేలకూ అస్వస్థత
వైద్యం అనంతరం ముగ్గురు డిశ్చార్జి
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర ఉదిక్తత చోటు చేసుకోవడంతో టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సభలో ఉన్న సమయంలోనే ఛాతీలో నొప్పి రావడంతో పాటు బీపీ, పల్స్ రేటు పెరగడంతో.. కుప్పకూలారు. వెంటనే ఆయన్ను లోహియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడినుంచి అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లగడపాటి పెప్పర్ స్ప్రే ఘటనలో అస్వస్థతకు గురైన కాంగ్రెస్ ఎంపీలు పొన్నం ప్రభాకర్, బలరాం నాయక్, యూపీలోని శ్రావస్తి ఎంపీ వినయ్‌కుమార్ పాండేలకు ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం డిశ్చార్జి చేశారు.
లగడపాటి పెప్పర్ స్ప్రే చేసిన వెంటనే.. పలువురు సభ్యులు, సందర్శకులు, పాత్రికేయులకు దగ్గు, కళ్ల మంటలు ప్రారంభమయ్యాయి. అస్వస్థతకు గురైన పొన్నం, బలరాం నాయక్, వినయ్‌కుమార్ పాండేను అంబులెన్సులో సమీపంలోని రాం మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. నారాయణ పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్యం కోసం సాయంత్రం అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కొనకళ్ల నారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో ఆసుపత్రి వైద్యులు గురువారం రాత్రి తెలిపారు. రక్తపోటు, పల్స్ సాధారణ స్థితికి వచ్చాయని... అబ్జర్వేషన్‌లో పెట్టామని చెప్పారు. ప్రస్తుతానికైతే బైపాస్ సర్జరీ చేసే ఆలోచనేదీ లేదని వివరించారు.