ముంబై: లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు.
బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్‌ఎస్‌ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు.
‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment