Speaker post
-
Sanjay Raut: టీడీపీ స్పీకర్ పదవికి పోటీ చేస్తే.. ఇండియా కూటమి మద్దతిస్తుంది
ముంబై: లోక్‌సభ స్పీకర్ పదవికి అధికార ఎన్డీఏ పక్షంలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోటీ చేస్తే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలన్నీ మద్దతిచ్చే అవకాశముందని శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ చెప్పారు. లోక్‌సభ స్పీకర్ పోస్టు చాలా కీలకమైందని, ఈ పదవి బీజేపీకి దక్కితే, ప్రభుత్వానికి మద్దతిచ్చే టీడీపీ, జేడీయూలతో పాటు చిరాగ్ పాశ్వాన్, జయంత్ చౌదరిలకు చెందిన పార్టీలను ముక్కలు చేస్తుందని ఆరోపించారు. బీజేపీని నమ్మి మోసపోయిన అనుభవం తమకు కూడా ఉందని రౌత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘లోక్‌సభ స్పీకర్ పదవిని టీడీపీ కోరుతున్నట్లుగా విన్నాను. అదే జరిగితే, ఇండియా కూటమి ఈ విషయాన్ని చర్చిస్తుంది. మా భాగస్వామ్య పక్షాలన్నీ టీడీపీకి మద్దతిచ్చేందుకు ప్రయత్నిస్తాయి’అని చెప్పారు. నిబంధన ప్రకారం ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ స్పీకర్ పోస్టు కేటాయించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అగ్ర నేతలు బీజేపీపై చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్.. గతంలో బీజేపీ చేసిన తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సరిచేయాలనుకోవడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. జూన్ 7వ తేదీన పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన భేటీలో ప్రధాని మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా, బీజేపీ పార్లమెంటరీ పార్టీ, లోక్‌సభలో బీజేపీ నేతగా ఎన్నికయ్యారని రౌత్ అన్నారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రత్యేకంగా జరగలేదు. అలా జరిగిన పక్షంలో నేత ఎవరనే ప్రశ్న ఉదయిస్తుంది, అప్పుడిక పరిణామాలు వేరుగా ఉంటాయి’అని అభిప్రాయపడ్డారు. మోదీ ఎన్డీఏ పార్లమెంటరీ పక్షం నేతగా మాత్రమే ఎన్నికవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని రౌత్ వ్యాఖ్యానించారు. -
లోక్‌సభ స్పీకర్ స్థానంపై సస్పెన్స్.. ఆయనకే ఛాన్స్?
సాక్షి, ఢిల్లీ: జూన్ 24వ తేదీన పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఎవరు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ నుంచే స్పీకర్‌ఉంటారని జేడీయూ స్పష్టం చేసిన నేపథ్యంలో ఓం బిర్లానే మరోసారి స్పీకర్ రేసులో ఉన్నారనే చర్చ నడుస్తోంది.ఇక, జూన్ 24న సమావేశాల ప్రారంభం నేపథ్యంలో తొలి రెండు రోజులు పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం ఉంటుంది. 25వ తేదీన స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో, ఈనెల 26వ తేదీన లోక్‌సభ ఎన్నికల స్పీకర్ ఎన్నిక ఉండే అవకాశం ఉంది. అయితే, లోక్‌సభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడంతో ఆమోదయోగ్యమైన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. 2014లో లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్, 2019లో ఓం బిర్లాను ప్రధాని మోదీనే ఎంపిక చేశారు. ఇక, ఈసారి కూడా ఆశ్చర్యకర పద్దతిలో స్పీకర్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అయితే, స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఛాన్స్ దక్కనుందనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. జూన్ 27వ తేదీ నుంచి జూలై మూడో తేదీ వరకు రాజ్యసభ సమావేశాలు జరుగనున్నాయి. -
స్పీకర్ పదవి.. బీజేపీ రిస్క్ చేస్తుందా?
హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్‌సభ స్పీకర్ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది. కనుక స్పీకర్ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్‌సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్‌కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టే ఉద్దేశంతో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్‌గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది. స్పీకర్‌గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం! జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్! మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్ (స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా. అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది. పవర్స్ అన్నీ ఇన్నీ కావులోక్సభ స్పీకర్‌కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్‌సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్‌సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది. నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
బిహార్ స్పీకర్ రేసులో ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు
పట్నా: బిహార్‌లో బీజేపీ మద్దతుతో జేడీ(యూ) అధినేత నితీష్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన సమయం నుంచి రాష్ట్ర స్పీకర్ పదవిపై బీజేపీ, జేడీయూ పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. బిహార్‌్ స్పీకర్ పదవి కోసం ఐదుగురు ఆశావహులు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీ ప్రస్తుత స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుత స్పీకర్, ఆర్జేడీ నేత అవధి బిహారీ స్థానంలో బీజేపీ నేతకు అవకాశం ఇవ్వాలని బీజేపీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే ఐదుగురు స్పీకర్ పదవి కోసం పోటీపడటం గమనార్హం. బీజేపీ పార్టీలోని నందకిషోర్ యాదవ్, నితీష్ మిశ్రా, మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి, సంజయ్ సరోగి, జానక్ సింగ్ స్పీకర్ పదవిని ఆశిస్తున్నారు. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం కేంద్రంలోని బీజేపీ అధిష్టానం చేతిలో ఉందని చర్చ నడుస్తోంది. నందకిషోర్ యాదవ్: బీసీ సామాజిక వర్గానికి చెందిన నందకిషోర్ గతంలో పలు మంత్రి పదవులను స్వీకరించారు. ఆయన పట్నా సాహిబ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ మేధామిగా.. పార్లమెంటరీ ప్రొసిడింగ్స్పైన పట్టు ఉన్న వ్యక్తిగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. నితీష్ మిశ్రా: మాజీ సీఎం డా. జగన్నాథ్ మిశ్రా కుమారుడు. ఈయనకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్‌పై పట్టు ఉందనే గుర్తింపు ఉంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నితీష్ మిశ్రా.. ఝంఝర్పూర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సంజయ్ సరోగి: దర్బంగా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఈయనకు స్పీకర్ పదవి ఇవ్వాలని పార్టీలో చర్చ జరుగోతంది. మాస్ లీడర్‌గా పేరున్న ఈయన ఉన్నతమైన విద్యార్హతలు కలిగి ఉన్నారు. గత రెండు దశాబ్దాలుగా సంజయ్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. ఈయన బనియా(వ్యాపార) సామాజకవర్గానికి చెందిన వ్యకి. బీజేపీకి ఈయన సమాజిక వర్గం నుంచి బలమైన ఓటు బ్యాంక్ ఉండటం గమనార్హం. జానక్ సింగ్: తారణ్య అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈయన అగ్రవర్ణ కులానికి చెందిన వ్యక్తి. ఈయినకు కూడా పార్లమెంటరీ ప్రొసిడింగ్స్ మంచి పట్టు ఉంది. రాజ్‌పుత్ వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ పదవి కేటాయించాలని బీజేపీ యోచిస్తున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. రేణు దేవి: మాజీ డిప్యూటీ సీఎం రేణు దేవి స్పీకర్ పదవిపై కన్నేశారు. వెనబడిన నోనియా సామాజికవర్గానికి చెందిన ఆమెకు సామాజిక సమీకరణాల దృష్ట్యా స్పీకర్ పదవిని కేటాయిస్తారని బీజేపీలో చర్చ జరుగుతోంది. ఇక.. ప్రస్తుత ఆర్జేడీ పార్టీకి చెందిన అవధ్ బిహారి ఇప్పటికీ స్పీకర్ పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీ పార్టీ అతనిపై అవిశాస్వ తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించిన విషయం తెలిసిందే. అవిశ్వాస తీర్మానం ద్వారా స్పీకర్ పదవి కోల్పోతే.. బిహార్ చరిత్రలో స్పీకర్ పదవి కోల్పోయిన మొదటి వ్యక్తిగా అవధ్ బిహారి నిలుస్తారు. -
అమ్మో.. ఆ పదవులు మాకొద్దు!
సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫలానా గుడికి వెళితే.. పదవి మటాష్ అన్న ప్రచారం ఉంటే.. నాయకులెవరూ పద విలో ఉన్నంతకాలం అటువైపు కన్నెత్తి చూడరు. అలాగే.. ఫలానా పదవి చేపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. అన్న ప్రచారం సాగితే.. దాన్ని చేపట్టేందుకు చాలా తక్కువ మంది ముందుకొస్తారు. అవే స్పీకర్, ఆర్టీసీ చైర్మన్, పీఏసీ చైర్మన్ పదవులు. తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకులంతా వీటిని చేపట్టాలంటే వెను కడుగు వేస్తారు. ఈ పదవులు చేపట్టాక రాజకీయంగా ఒడిదుడుకులు తప్పవన్న సంప్రదాయం చాలా ఏళ్లుగా రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది. ఆర్టీసీలో అడుగుపెడితే అంతేనా ఆర్టీసీ చైర్మన్ పదవి చేపట్టినవారూ రాజకీయంగా ఇబ్బందులు పడతారన్న ప్రచారం ఉంది. గతంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన గోనె ప్రకాశ్‌రావుకు ఆ తర్వాత రాజకీయాల్లో ప్రభ తగ్గింది. క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే పదవిని చేపట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్.సత్యనారాయణ చైర్మన్‌గా తప్పుకొన్నాక ప్రత్యక్ష రాజకీయాల జోలికే వెళ్లట్లేదు. ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ కూడా తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆర్టీసీ సెంటిమెంట్ మరోసారి పునరావృతమైందంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. పీఏసీ చైర్మన్.. తెలంగాణలో పీఏసీ చైర్మన్ పదవులు చేపట్టినవారికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. గత అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 2015 ఆగస్టులో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ పదవిని కాంగ్రెస్‌కే చెందిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టారు. 2016 మార్చిలో ఆయన కూడా అనారోగ్యంతో మరణించారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అంతా ఆలోచించారు. ఆఖరికి ఆ పదవిని మరో సీనియర్ నాయకురాలు గీతారెడ్డి చేపట్టారు. 2018 ఎన్నికల్లో ఆమె కూడా ఓటమి చవిచూశారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి వల్లే గీతారెడ్డి ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు. కొనసాగిన స్పీకర్ సెంటిమెంట్ స్పీకర్ పదవిపైనా పలువురు గులాబీ నేతలు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవి చేపడితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంటు చాలా ఏళ్లుగా ఉంది. గత స్పీకర్ మధు సూదనాచారి ఓటమితో అది మరోసారి పునరావృతమైంది. గతంలో స్పీకర్‌గా వ్యవహరించిన సురేశ్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ లాంటి వారిని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. దీంతో ఈసారి స్పీకర్ పదవి ఎవరిని వరించినా వారు కూడా రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదని నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు. -
చంద్రబాబుకు తలనొప్పిగా మారిన....
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు శాసనసభ స్పీకర్ ఎంపిక తలనొప్పిగా మారింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలలో చాలా మంది ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈ పదవికి ఎవరిని ఎంపికచేయాలో అర్ధంకాని పరిస్థితిలో ఆయన ఉన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై ఆయన కసరత్తు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో చంద్రబాబు ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కళావెంకట్రావు, కోడెల శివప్రసాద్, ధూళిపాళ్ల నరేంద్ర, కాలవ శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపికపైనే చర్చ జరిగింది. -
మరొకరు ఎవరో..
మంత్రి పదవిపై సీనియర్ల ఆశలు - జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే అవకాశం - చందూలాల్, చారి, సురేఖ మధ్య పోటీ - ఆనవాయితీగా విప్ పదవి? సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా జిల్లా నుంచి మరొకరికి అవకాశం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. రెండో దశ మంత్రివర్గ విస్తరణపై ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఎంతో ఆశతో ఉన్నారు. సోమవారం ఏర్పాటైన మంత్రివర్గంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు కీలకమైన ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఉప ముఖ్యమంత్రి పదవి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు రావడం ఇదే మొదటిసారి. కీలకమైన పదవి ఇచ్చిన నేపథ్యంలో జిల్లాకు మరో మంత్రి పదవి ఉంటుందా... ఒక్కటితోనే సరిపెట్టి చీఫ్ విప్ లేదా విప్ పదవి ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్, భూపాలపల్లి ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారి పేర్లను స్పీకర్ పదవికి పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. వీరిద్దరిలో ఎవరికి స్పీకర్ పదవి వచ్చినా జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉండదు. స్పీకర్ పదవిని జిల్లాకు ఇస్తే... ఉప ముఖ్యమంత్రితోపాటు హోదా పరంగా కీలకమైన రెండు పదవులు వచ్చినట్లు అవుతుంది. ఇదే జరిగితే జిల్లాకు మరో మంత్రి పదవి, చీఫ్ విప్, విప్ వంటివి ఏవీ వచ్చే అవకాశం ఉండదు. స్పీకర్ పదవికి పరిశీలనలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు ఈ పదవిపై విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు స్పీకర్ పదవి ఇస్తే... మన జిల్లాకు మరో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో మన జిల్లా ఎప్పుడూ కీలకంగానే ఉంది. టీఆర్ఎస్కు సంబంధించి అన్ని ఎన్నికల్లోనూ మంచి ఫలితాలనే అందించింది. ఉద్యమ విషయంలో కేసీఆర్ ఇచ్చిన కార్యక్రమాల్లో జిల్లాలో విజయవంతమయ్యాయి. ఇవన్నింటితోపాటు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న వారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మినహా 17 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 11 మంది మంత్రులుగా చేరారు. బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందనే వాదన వినిపిస్తోంది. సిరికొండ మధుసూదనాచారి, కొండా సురేఖ, దాస్యం వినయభాస్కర్ బీసీ వర్గం వారే కావడంతో మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న 11 మంత్రుల్లో ఎస్టీ వర్గానికి, మహిళకు చోటు దక్కలేదు. ఎస్టీ వర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చందూలాల్ సీనియర్‌గా ఉన్నారు. మహిళా కోటా విషయంలో కొండా సురేఖ సీనియర్‌గా ఉన్నారు. జిల్లాకు మరో మంత్రి పదవి ఇవ్వకుంటే చీఫ్ విప్ లేదా విప్ పదవి ఇచ్చే అవకాశం ఉంటుంది. చీఫ్ విప్ అయితే మధుసూదనచారికి, విప్ అయితే వినయభాస్కర్కు చాన్స్ దొరికే పరిస్థితి ఉండనుంది. మొదటి విడతలో జిల్లాలో రాజయ్య ఒక్కరికే మంత్రివర్గంలో చోటు దక్కడంతో... సీనియర్ ఎమ్మెల్యేలు రెండో దశపై ఆశగా ఉన్నారు. ఈ నెలాఖరులోపే ఇది పూర్తవుతుందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.