కీలక పదవిపై టీడీపీ, జేడీ(యూ) ఆసక్తి
బీజేపీని వెంటాడుతున్న ‘1999’ అనుభవం
నాడు ఎన్డీఏ సర్కారును కూల్చింది ‘టీడీపీ’ స్పీకరే
హోరాహోరీ సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అంతా ఊహించినట్టే నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. మోదీ 3.0 మంత్రివర్గమూ కొలువుదీరింది. కానీ గత రెండు ఎన్నికల మాదిరిగా సొంతంగా మెజారిటీ సాధించడంలో బీజేపీ ఈసారి విఫలమైంది. దాంతో ఎన్డీఏ సంకీర్ణ సర్కారు మనుగడలో భాగస్వామ్య పక్షాల పాత్ర కీలకంగా మారింది.
ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అతి కీలకమైన లోక్‌సభ స్పీకర్ పదవిపైనే నెలకొన్నాయి. ఎన్డీఏ కీలక భాగస్వామి టీడీపీ ఆ పదవిపై ఆసక్తిగా ఉందంటూ ముందునుంచీ వార్తలొస్తున్నాయి. తాజాగా జేడీ(యూ) పేరూ విని్పస్తోంది. అవి నాలుగైదు కేబినెట్ బెర్తులు కోరినా ఎన్డీఏ పెద్దన్న బీజేపీ మాత్రం చెరో రెండింటితో సరిపెట్టింది.
కనుక స్పీకర్ పోస్టుపై ఆ పార్టీలు పట్టుదలగా ఉన్నట్టు చెబుతున్నారు. కానీ అపారమైన విచక్షణాధికారాలుండే స్పీకర్ పాత్ర కీలక సమయాల్లో అత్యంత నిర్ణాయకంగా మారుతుంటుంది. మరీ ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల్లో లోక్‌సభ స్పీకర్ పాత్రకుండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. పైగా గతంలో టీడీపీకి స్పీకర్ పోస్టు ఇచ్చి సర్కారును కుప్పకూల్చుకున్న అనుభవమూ బీజేపీకి ఉంది. ఈ నేపథ్యంలో కీలక పదవిని మిత్రపక్షాల చేతిలో పెట్టే రిస్క్‌కు బీజేపీ పెద్దలు మరోసారి సిద్ధపడతారా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది...
అది 1999. రాజకీయ అస్థిరతకు చెక్ పెట్టే ఉద్దేశంతో వాజ్‌పేయి సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లోక్‌సభలో బలపరీక్షకు సిద్ధపడింది. మద్దతిస్తామన్న పలు ఇతర పారీ్టలు తీరా అసలు సమయానికి అడ్డం తిరగడంతో ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం కుప్పకూలింది. నాడు స్పీకర్‌గా ఉన్న టీడీపీ నేత జీఎంసీ బాలయోగి తీసుకున్న నిర్ణయమే అందుకు కారణంగా మారడం విశేషం! అంతకు కొద్ది రోజుల ముందే ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాంగ్రెస్ ఎంపీ గిరిధర్ గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతించాలా, లేదా అన్న ధర్మసందేహం తలెత్తింది.
స్పీకర్‌గా తన విచక్షణాధికారాలను ఉపయోగించి గమాంగ్‌ను ఓటింగ్‌కు అనుమతిస్తూ బాలయోగి నిర్ణయం తీసుకున్నారు. చివరికి విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 269 ఓట్లు రాగా వ్యతిరేకంగా 270 వచ్చాయి. అలా గమాంగ్ వేసిన ఒక్క ఓటు ప్రభుత్వాన్ని పడ గొట్టింది. ఎన్డీఏ సర్కారుకు బయటినుంచి మద్దతిచి్చన టీడీపీ అధినేత చంద్రబాబు కోరిక మేరకు స్పీకర్ పదవిని ఆ పారీ్టకిస్తూ నాటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయం తీసుకున్నారు. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు బాబు మరోసారి టీడీపీకి స్పీకర్ పదవి కోరుతున్నట్టు వార్తలొస్తుండటం విశేషం!
జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్!
మోదీ 3.0 ప్రభుత్వం కొలువుదీరినా బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని విషయం తెలిసిందే. లోక్‌సభలో మెజారిటీ మార్కు 272 కాగా బీజేపీకి 240 మంది ఎంపీలే ఉన్నారు. ఎన్డీఏ భాగస్వాముల్లో 16 ఎంపీలున్న టీడీపీ, 12 మంది ఉన్న జేడీ(యూ) ప్రభుత్వ మనుగడకు కీలకంగా మారాయి. సంకీర్ణ ప్రభుత్వాల మనుగడలో స్పీకర్ పదవి ఎంత కీలకమో 1999 నాటి వాజ్‌పేయి ప్రభుత్వ ఉదంతం నిరూపించింది. పైగా ‘జిస్కా స్పీకర్, ఉస్కీ సర్కార్ (స్పీకర్ పదవి దక్కిన వారిదే సర్కారు)’ అన్న నానుడి హస్తిన రాజకీయ వర్గాల్లో బాగా ఫేమస్ కూడా.
అలాంటి కీలకమైన స్పీకర్ పదవిని ఈసారి టీడీపీ కోరుతోంది. మోదీ అందుకు అంగీకరించే సాహసం చేస్తారా అన్నదానిపై రకరకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2014, 2019ల్లో బీజేపీ సొంతగానే మెజారిటీ సాధించడంతో ఆయనకు ఇలాంటి పరీక్ష ఎదురవలేదు. అయితే మంత్రివర్గ కూర్పులో భాగస్వాముల డిమాండ్లకు మోదీ పెద్దగా తలొగ్గలేదు. టీడీపీ ఐదారు, జేడీ(యూ) నాలుగైదు బెర్తులు అడిగినా వాటికి చెరో రెండు పదవులతో సరిపెట్టారు. పైగా కీలకమైన శాఖలన్నింటినీ బీజేపీకే కేటాయించారు. కనుక స్పీకర్ పదవిని కూడా బీజేపీయే అట్టిపెట్టుకోవచ్చన్న అభిప్రాయం విని్పస్తోంది.
పవర్స్ అన్నీ ఇన్నీ కావు
లోక్‌సభ స్పీకర్‌కు సాధారణ అధికారాలతో పాటు అత్యంత కీలకమైన విచక్షణాధికారాలు కూడా ఉంటాయి. సభా నిబంధనలను తన విచక్షణ మేరకు నిర్వచించగలుగుతారు. అందుకే స్పీకర్ పదవిని పాలక పక్ష బలానికి, ఆధిపత్యానికి ప్రతీకగా భావిస్తుంటారు. లోక్‌సభను అజమాయిషీ చేస్తూ కార్యకలాపాలను సజావుగా నడిపించేది స్పీకరే. కనుక ఆ పదవి దక్కే పార్టీ సహజంగానే లోక్‌సభ కార్యకలాపాల అజెండా తదితరాలను ప్రభావితం చేయగలుగుతుంది.
నిర్ణాయక సందర్భాల్లో ఇది కీలకంగా మారుతుంది. సభలో ప్రవేశపెట్టే బిల్లులు ద్రవ్య బిల్లా, సాధారణ బిల్లా అన్నది స్పీకరే నిర్ధారిస్తారు. సభా సంఘాలను ఏర్పాటు చేస్తారు. వాటి చైర్‌పర్సన్లు, సభ్యులను నియమిస్తారు. సభ్యుల సస్పెన్షన్ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సింది స్పీకరే. పార్లమెంటు సంయుక్త సమావేశాలకు సారథ్యం వహిస్తారు. అన్నింటికీ మించి ఏ అంశంపై అయినా సభలో ఓటింగ్ జరిగి రెండు పక్షాలకూ సమానంగా ఓట్లొస్తే స్పీకర్ పాత్ర మరింత కీలకంగా మారుతుంది. ఆయన నిర్ణాయక ఓటు ఎవరికి వేస్తే వారే నెగ్గుతారు!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment