సాక్షి, హైదరాబాద్: రాజకీయాల్లో సెంటిమెంట్లకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఫలానా గుడికి వెళితే.. పదవి మటాష్ అన్న ప్రచారం ఉంటే.. నాయకులెవరూ పద విలో ఉన్నంతకాలం అటువైపు కన్నెత్తి చూడరు. అలాగే.. ఫలానా పదవి చేపడితే రాజకీయ భవిష్యత్తు ఉండదు.. అన్న ప్రచారం సాగితే.. దాన్ని చేపట్టేందుకు చాలా తక్కువ మంది ముందుకొస్తారు. అవే స్పీకర్, ఆర్టీసీ చైర్మన్, పీఏసీ చైర్మన్ పదవులు. తెలుగు రాజకీయాల్లో రాజకీయ నాయకులంతా వీటిని చేపట్టాలంటే వెను కడుగు వేస్తారు. ఈ పదవులు చేపట్టాక రాజకీయంగా ఒడిదుడుకులు తప్పవన్న సంప్రదాయం చాలా ఏళ్లుగా రాజకీయ నాయకుల్లో బలంగా నాటుకుపోయింది.
ఆర్టీసీలో అడుగుపెడితే అంతేనా
ఆర్టీసీ చైర్మన్ పదవి చేపట్టినవారూ రాజకీయంగా ఇబ్బందులు పడతారన్న ప్రచారం ఉంది. గతంలో ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన గోనె ప్రకాశ్‌రావుకు ఆ తర్వాత రాజకీయాల్లో ప్రభ తగ్గింది. క్రమంగా క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. ఇదే పదవిని చేపట్టిన సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్.సత్యనారాయణ చైర్మన్‌గా తప్పుకొన్నాక ప్రత్యక్ష రాజకీయాల జోలికే వెళ్లట్లేదు. ఇటీవల ఆర్టీసీ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన సోమారపు సత్యనారాయణ కూడా తాజా ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో ఆర్టీసీ సెంటిమెంట్ మరోసారి పునరావృతమైందంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు.
పీఏసీ చైర్మన్..
తెలంగాణలో పీఏసీ చైర్మన్ పదవులు చేపట్టినవారికి పలు ఆటంకాలు ఏర్పడ్డాయి. గత అసెంబ్లీలో పీఏసీ చైర్మన్‌గా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేత, నారాయణఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి 2015 ఆగస్టులో గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ పదవిని కాంగ్రెస్‌కే చెందిన పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్‌రెడ్డి చేపట్టారు. 2016 మార్చిలో ఆయన కూడా అనారోగ్యంతో మరణించారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి చేపట్టేందుకు అంతా ఆలోచించారు. ఆఖరికి ఆ పదవిని మరో సీనియర్ నాయకురాలు గీతారెడ్డి చేపట్టారు. 2018 ఎన్నికల్లో ఆమె కూడా ఓటమి చవిచూశారు. దీంతో పీఏసీ చైర్మన్ పదవి వల్లే గీతారెడ్డి ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు.
కొనసాగిన స్పీకర్ సెంటిమెంట్
స్పీకర్ పదవిపైనా పలువురు గులాబీ నేతలు విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవి చేపడితే రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని, తర్వాతి ఎన్నికల్లో ఓడిపోతారన్న సెంటిమెంటు చాలా ఏళ్లుగా ఉంది. గత స్పీకర్ మధు సూదనాచారి ఓటమితో అది మరోసారి పునరావృతమైంది. గతంలో స్పీకర్‌గా వ్యవహరించిన సురేశ్‌రెడ్డి, నాదెండ్ల మనోహర్ లాంటి వారిని ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. దీంతో ఈసారి స్పీకర్ పదవి ఎవరిని వరించినా వారు కూడా రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కోక తప్పదని నేతలు కాస్త ఆందోళన చెందుతున్నారు.
అమ్మో.. ఆ పదవులు మాకొద్దు!
Published Fri, Dec 14 2018 4:45 AM | Last Updated on Fri, Dec 14 2018 9:23 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment