ఎంపీ కొనకళ్ల నారాయణ పరిస్థితి విషమం
కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావు పరిస్థితి విషమించింది. లోక్ సభలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో తీవ్రంగా ఒత్తడికి లోనైన ఆయనకు గుండెపోటు రావడంతో నిండు సభలోనే ఆయన కుప్పకూలిపోయారు. సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ రాష్ట్రాల ఎంపీలు, మార్షల్స్ కూడా సీమాంధ్ర ప్రాంత ఎంపీలను అదుపు చేయడానికి పిడిగుద్దులు కురిపించారు. సరిగ్గా ఆ సమయంలోనే కొనకళ్ల నారాయణ కుప్పకూలిపోయారు.
వాయిదా అనంతరం సభ జరుగుతున్న సమయంలో ఆయన ఒక్కసారిగా గుండె పట్టుకుని కూలిపోయారు. దాంతో పార్లమెంట్ సిబ్బంది...కొనకళ్ల నారాయణను హుటాహుటీన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి కరొనరీ కేర్ యూనిట్లో చేర్చి చికిత్స చేయించినా.. ఆయన పరిస్థితి మరింత విషమించడంతో కొనకళ్లను హుటాహుటిన అక్కడి నుంచి అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయనకు అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉంటుందని వైద్యులు అంటున్నారు.
అంతకు ముందు కొనకళ్ల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తమ ప్రాంత ప్రజల మనోభావాలను తెలిపేందుకు కూడా సభలో అవకాశం ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా తమపై దాడికి యత్నించిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలు తమపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. తమపై దాడికి పాల్పడే... పైపెచ్చు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని కొనకళ్ల మండిపడ్డారు. కాగా లోక్సభలో పెప్పర్ స్ప్రే ఘాటుకు అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలను ఆర్ఎమ్ఎల్ ఆస్పత్రికి తరలించారు. ముఖం మండుతుందని వారికి మందులు ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు.