
సమావేశం వద్ద గ్రామస్థులు విసిరేసిన కుర్చీలు
బుద్దాలపాలెంలో కుర్చీలు విసిరేసిన గ్రామస్థులు
భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసి గ్రామాల్లోకి రావాలని డిమాండ్
గ్రామస్థుల వాగ్వాదంతో వెనుదిరిగిన మంత్రి, ఎంపీ
సాక్షి, మచిలీపట్నం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెంలో కోన గ్రామంలో జరిగిన సీన్ రిపీటైంది. బుద్దాలపాలెంలో భూసేకరణపై మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరైన మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావులకు చుక్కెదురైంది. స్థానిక ఎంపీయూపీ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రి కొల్లు మాట్లాడుతూ అనుబంధ పరిశ్రమలకు భూసేకరణ చేస్తున్నామని, భూములు సేకరిస్తామే తప్ప గ్రామాలను ఖాళీ చేయించబోమని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు స్పందిస్తూ.. ‘మాతో సంప్రదింపులు జరపకుండా మీ ఇష్టానుసారం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రామంలో ఒక్క సెంటు భూమి కూడా పరిశ్రమల స్థాపన కోసం ఇచ్చేది లేదు. అప్పటి వరకు ఈ సమావేశంలో మాట్లాడవద్దు’ అంటూ అడ్డు తగిలారు. భూసేకరణపై అవగాహన కల్పించేందుకే తాము గ్రామానికి వచ్చామని, రైతులంతా కుర్చీల్లో కూర్చోవాలని మంత్రి కోరినప్పటికీ అందుకు వారు అంగీకరించలేదు. అనంతరం ఓ మహిళకు అభిప్రాయం చెప్పాలని మైక్ ఇచ్చారు. ఎన్నికల ముందు డ్వాక్రా సంఘాల రుణాలను రద్దు చేస్తామని చెప్పారని, అవి ఇంతవరకు రద్దు కాలేదని, ఇప్పుడు భూసేకరణ చేస్తామని చెప్పి మమ్మల్ని గ్రామం నుంచి పంపుతారా అని ఆ మహిళ ప్రశ్నించారు. ఈ సందర్భంగా సమావేశంలో ఉన్న టీడీపీ కార్యకర్త ఒకరు మహిళ నుంచి మైక్ లాక్కోవటంతో గందరగోళం నెలకొంది. ‘మాట్లాడుతున్న మహిళ నుంచి మైక్ తీసుకుంటారా’ అని గ్రామస్థులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ‘భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాతే మీరు గ్రామానికి రావాలి. అప్పటివరకు మీ మాటలు వినేది లేదు. తక్షణమే ఈ సభను రద్దు చేయాలి’ అని గ్రామస్థులు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. అయినప్పటికీ మంత్రి మాట్లాడబోతుండగా కోపోద్రిక్తులైన గ్రామస్థులు వారి ఎదురుగా ఉన్న కుర్చీలను పైకి విసిరేశారు. సమావేశం జరిగే అవకాశం లేకపోవటంతో మంత్రి, ఎంపీ వెనుదిరిగి కారు వద్దకు వెళుతుండగా.. గ్రామస్థులు వారి వెనుకే అనుసరిస్తూ ‘మంత్రి కొల్లు రవీంద్ర డౌన్ డౌన్’, ‘ఎంపీ కొనకళ్ల నారాయణరావు డౌన్ డౌన్’, ‘భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రైతుల అంగీకారం ఉంటేనే సంప్రదింపులు జరుపుతామని, ఇష్టం లేకుంటే సంప్రదింపులు జరిపేది లేదని చెప్పారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేశాకే మళ్లీ గ్రామానికి వస్తానని స్పష్టం చేశారు. వీరు గ్రామాన్ని విడిచిపెట్టిన అనంతరం పోలీసులు పికెట్ నిర్వహించారు.