
కొనకళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన
మచిలీపట్నం : బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు పార్లమెంటు సమావేశంలో ఉన్న సమయంలో గుండెపోటుకు గురయ్యారనే సమాచారంతో ఆయన కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎంపీ కొనకళ్ల గత పదిహేను రోజుల నుంచి అనారోగ్యంగానే ఉన్నా తెలంగాణ అంశం నేపథ్యంలో ఢిల్లీలోనే ఉంటున్నారు. ఎంపీ భార్య పద్మజకు అనారోగ్యంగా ఉండటంతో ఆమె గత నాలుగు రోజులుగా విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
ఎంపీ, ఆయన భార్య ఇద్దరూ ఒకేసారి అనారోగ్యానికి గురికావడంతో ఆయన బంధువుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఎంపీ కొనకళ్ల గుండెపోటుకు గురయ్యారనే సమాచారాన్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకున్న ఆయన బంధువులు ఎంపీ ఇంటికి వచ్చారు. నెట్‌లోనూ, టీవీలలోనూ వస్తున్న వార్తలను చూస్తూ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్‌ల ద్వారా సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎంపీ కొనకళ్ల సోదరుడు కొనకళ్ల బుల్లయ్య గత పది రోజులుగా ఢిల్లీలోనే తన సోదరుడి వద్ద ఉంటున్నారు. ఎంపీ కొనకళ్ల అనారోగ్యం పాలవడంతో ఆయన బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఎంపీ గృహానికి వెళ్లిన సమయంలో వారి బంధువులు వెలిబుచ్చిన ఆందోళన వారి మాటల్లోనే...
ఆందోళనకు గురవుతున్నాం - గీత, ఎంపీ మేనకోడలు
మామయ్యకు అనారోగ్యంగా ఉందనే సమాచారం మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు చెప్పడంతో షాక్‌కు గురయ్యాను. తెలంగాణ అంశం పార్లమెంటులో చర్చకు వచ్చిన సమయంలో మామయ్య అనారోగ్యానికి గురవడం బాధ కలిగించింది. అనారోగ్యంతో బాధపడుతున్నా కీలక సమయంలో ఆస్పత్రిలో చేరితే ప్రజలు వేరేలా అనుకుంటారని భావించి ఆయన ఆస్పత్రిలో కూడా చేరలేదు. పద్మజ అత్తయ్య కూడా నాలుగు రోజులుగా ఆస్పత్రిలోనే ఉండటం, మామయ్య అనారోగ్యం పాలవడం మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోంది.
అసత్య వార్తలతో మరింత ఆందోళన
- నాగశ్రీ, ఎంపీ మేనల్లుడి భార్య
ఎంపీ కొనకళ్ల నారాయణరావు అస్వస్థతకు గురైతే ఒక్కొక్క చానల్‌లో ఒక్కొక్క రకంగా ప్రసారం చేస్తున్నారు. ఒకరేమో పాయిజన్ తీసుకున్నారని, మరొకరేమో గుండెపోటుకు గురయ్యారని, కొన్ని వెబ్‌సైట్లలో ఏవేవో కామెంట్లు పెట్టి బంధువులను ఆందోళనకు గురిచేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆయన పార్లమెంటులోనే ఉండి పోరాటం చేస్తున్నారు. పలుమార్లు నాతోనూ రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని, దాని కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన రోజే ఆయన తీవ్ర అనారోగ్యానికి గురికావటం కలచివేసింది. అసలు విషయాన్ని కప్పిపుచ్చి కొన్ని ప్రసార మాధ్యమాలు, వెబ్‌సైట్లు ఏవేవో కామెంట్లు పెట్టడం బాధ కలిగించింది.
పెదనాన్న ఆరోగ్యంపై ఆందోళనగా ఉంది
- శృతి, సోదరుడి కుమార్తె
పెదనాన్న నారాయణరావు ఆరోగ్యంపై మాకు ఆందోళనగానే ఉంది. పార్లమెంటు సమావేశాల్లో పెదనాన్న టీవీలో మాట్లాడటం చూశా. కాసేపటి తరువాత టీవీ చూస్తే పెదనాన్న గుండెపోటుకు గురయ్యారని వార్తలు వస్తున్నాయి. యూ ట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే ఏవేవో కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి కామెంట్లు కుటుంబ సభ్యులకు బాధ కలిగిస్తున్నాయి. పెదనాన్న ఆరోగ్యంగా ఉన్నారని భావిస్తున్నా.
బందరులో టీడీపీ నాయకుల ర్యాలీ
బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు పార్లమెంటులో గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బందరులోని టీడీపీ నాయకులు గురువారం సాయంత్రం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టిన సమయంలో ఈ బిల్లును అడ్డుకునేందుకు కొనకళ్ల తీవ్ర పోరాటం చేశారని టీడీపీ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ ర్యాలీలో టీడీపీ జిల్లా కార్యదర్శి బచ్చుల అర్జునుడు, కొల్లు రవీంద్ర, మోటమర్రి బాబాప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఎంపీ అస్వస్థతకు గురైన నేపథ్యంలో టీడీపీ నాయకులు వ్యాపార సంస్థలను మూయించారు. పెడన తదితర ప్రాంతాల్లో ఎంపీ ఆరోగ్యం కుదుటపడాలని పలు దేవాలయాలు, చర్చిల్లో ప్రార్థనలు, పూజలు చేశారు.