నారీ భేరి
- సీడీపీవోలకు సమ్మె నోటీసులు
- నేటి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపు
- పల్స్‌పోలియో విధులకు సైతం దూరం
- జిల్లాలో 7,400 మంది కార్యకర్తలు, సహాయకులు
- అంగన్‌వాడీలు మూతపడితే బాలింతలు, గర్భిణులు, పిల్లలకు పస్తులే
- దాదాపు 1.35 లక్షల మందిపై ప్రభావం
అమ్మలాంటి మనసు ఆక్రోశిస్తోంది.. అన్నం పెట్టిన చేయి పిడికిలెత్తింది.. చాలీచాలని జీతాలతో కడుపు రగిలి హక్కుల సాధన కోసం సమ్మె బాట పట్టింది.. అంగన్ వాడీల్లో మోగించిన నారీ భేరి ఆదివారం ్చనుంచి ఉధృతం కానుంది. వెరసి జిల్లాలోని 7,400 మంది కార్యకర్తలు, హెల్పర్లు నిరవధిక సమ్మెకు దిగడంతో 3,359 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడే పరిస్థితి వచ్చింది. ఫలితంగా జిల్లాలో సుమారు 1.35 లక్షల మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పస్తులు తప్పని పరిస్థితి దాపురిస్తోంది.
సాక్షి, మచిలీపట్నం : దాదాపు 37 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం)ని ప్రభుత్వం రెగ్యులర్ శాఖగా గుర్తించకుండా ప్రైవేటీకరించే ప్రయత్నం చేయడంపై అంగన్‌వాడీలు ఆందోళన బాట పట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలకు, హెల్పర్లకు అరకొర జీతాలతో జీవనం కష్టంగా మారిందని, మరోవైపు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతహస్తం పథకంతో పని గంటల భారం పెరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల ప్రైవేటీకరణ యత్నాలు నిలుపుదల చేయాలని, తమ జీతాలు పెంచాలని తదితర పది డిమాండ్లతో జిల్లాలో ఈ నెల 17 నుంచి 22 వరకు సమ్మె చేపట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆదివారం నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారుల (సీడీపీవో)కు అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు శనివారం సమ్మె నోటీసులతో కూడిన వినతిపత్రాలు అందజేశారు.
అంగన్‌వాడీ కేంద్రాలకు తాళాలు..
ఈ నెల 23 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న కార్యకర్తలు, హెల్పర్లు తాము పనిచేసే అంగన్‌వాడీ కేంద్రాలకు శనివారం నుంచి తాళాలు వేశారు. 7,400 మంది ఆందోళన బాట పట్టడంతో జిల్లాలోని 3,559 అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్‌వాడీ కేంద్రాలు తెరుచుకోకపోతే వీటిపై ఆధారపడిన 32 వేల 119 మంది గర్భిణులు, 32 వేల 560 మంది బాలింతలు, 70 వేల మంది పిల్లలకు పస్తులు తప్పవు. మొత్తం లక్షా 34 వేల 679 మందికి పౌష్టికాహారం అందకుండా పోతోంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు తాళాలు ఇచ్చేందుకు ససేమిరా అనడంతో అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ విషయమై ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిణి కృష్ణకుమారిని ‘సాక్షి’ వివరణ కోరగా గ్రామ సమాఖ్య సభ్యులతో గాని, తల్లిదండ్రుల కమిటీ సభ్యులతో గాని అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం పంపిణీ చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
పల్స్‌పోలియో విధులకు దూరం..
జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్‌పోలియో విధులకు సైతం తాము హాజరయ్యేది లేదంటూ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే పల్స్‌పోలియో కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సహకారం లేకపోవడం ఇబ్బందికరమే. ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంఅండ్‌హెచ్‌వో) సరసిజాక్షిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆదివారం సెలవు రోజు కావడంతో ఉపాధ్యాయులను పల్స్‌పోలియో కార్యక్రమానికి ఉపయోగించుకునేలా జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో)ని కోరినట్టు చెప్పారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి ఇబ్బంది లేకుండా జిల్లాలోని నర్సింగ్ విద్యార్థినులు, ఐకేపీ మహిళల సేవలను ఉపయోగించుకుంటామని ఆమె వివరించారు.
డిమాండ్లు ఇవీ..
అంగన్‌వాడీ ఉద్యోగులకు నెలకు రూ.4,400 వేతనంగా ఇస్తున్నారు. దాన్ని రూ.12,500 కనీస వేతనంగా చేయాలి
ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పదవీవిరమణ ప్రయోజనాలు ఇవ్వాలి. పింఛను సౌకర్యం కల్పించాలి
అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రథమ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఐటీసీ సంస్థలు జోక్యం చేసుకునేలా ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలి. ప్రైవేటీకరణ ఆపాలి. ఐకేపీ జోక్యాన్ని నివారించాలి
అమృతహస్తం పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. దీన్ని నిర్వహిస్తున్న వర్కర్లకు రూ.2 వేలు, హెల్పర్లకు వెయ్యి రూపాయల వేతనం అదనంగా ఇవ్వాలి
ఐసీడీఎస్‌ను సంస్థాగతం చేసి పటిష్టంగా అమలు చేయాలి. అంగన్‌వాడీ సెంటర్లలో మౌలిక వసతులు కల్పించాలి
బీఎల్‌ఓ విధుల నుంచి అంగన్‌వాడీలను మినహాయించాలి
పెంచిన అంగన్‌వాడీ సెంటర్‌ల అద్దెలు ఎలాంటి షరతులూ లేకుండా అమలు చేయాలి
ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలి
దరల పెరుగుదలకు అనుగుణంగా మెనూ చార్జీలు, కట్టెల బిల్లులను పెంచాలి
వంటకు సరిపడా గ్యాస్‌ను సబ్సిడీతో సరఫరా చేయాలి