ఇందూరు/కామారెడ్డి/బోధన్/న్యూస్‌లైన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేపట్టిన అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు కదం తొక్కారు. బుధవారం నిజామాబాద్, కామారెడ్డి, బోధన్ ఆర్డీవో కార్యాలయాల ఎదుట జిల్లాలోని ఆయా రెవెన్యూ డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గౌరవ వేతనం వద్దు, కనీస వేతనం కావాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నినదించారు.
బోధన్‌లో..
పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగించారు. ఇక్కడ నిజామాబాద్, మహారాష్ట్ర, బాన్సువాడ వైపు వెళ్లే ప్రధాన రహదారులను గంట పాటు దిగ్బంధించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధి రమాదేవి, సీఐటీయూ డివిజన్ నాయకులు జె. శంకర్‌గౌడ్, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డిలో...
స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట పది మండలాలకు చెందిన అంగన్‌వాడీకార్యకర్తలు, ఆ యాలు మహా ధర్నా నిర్వహించారు. నిజాం సాగర్ చౌరస్తాలో మానవహారం,రాస్తారోకో, ధ ర్నా నిర్వహించారు.స్థానిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు.
జిల్లాకేంద్రంలో...
సమస్యలపై స్పందించకుంటే ఈనెల 21న ఐసీడీఎస్ కమిషనరేట్‌ను ముట్టడిస్తామని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ప్రభుత్వానికి హెచ్చరించారు.సమ్మెలో భాగంగా బుధవారం నిజామాబాద్ ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. గేటు ముందు బైటాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు గోవర్థన్ మాట్లాడుతూ... ప్రభుత్వ వైఖరి కొనసాగితే 21న ఐసీడీఎస్ కమిషనరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.అనంతరం ఆర్డీవో యాదిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ర్యాలీగా కోర్టు వరకు చేరుకుని పొట్టి శ్రీరాములు చౌరస్తాలో భారీ మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ ఉద్యోగ సంఘం నాయకులు సులోచన, హైమావతి, స్వర్ణ, సువర్ణ, సూర్యకళ పాల్గొన్నారు.
కదం తొక్కిన అంగన్‌వాడీలు
Published Thu, Feb 20 2014 2:52 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement