సడలని పట్టు
Published Tue, Feb 25 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:03 AM
రాయవరం, న్యూస్‌లైన్ :సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం కరుణించలేదు. పనికి తగిన వేతనం ఇవ్వాలంటూ అంగన్‌వాడీలు నిరవధిక సమ్మె చేపట్టినా.. సర్కారు మెట్టు దిగలేదు. అంగ న్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పట్టు వీడకుండా సమ్మె కొనసాగిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడడంతో కేంద్రాల పరిధిలో ఉన్న గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్ఠికాహారం అందడం లేదు.
ఎనిమిది రోజులుగా మూత
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఈ నెల 17 నుంచి సమ్మె చేపట్టారు. సమ్మెకు ముందు ఈ నెల మూడో తేదీన సామూహిక సెలవులు పెట్టి నిరసన తెలిపారు. 10న మండల పరిషత్ కా ర్యాలయాలను ముట్టడించారు. 11న ప్రాజెక్టు కార్యాలయాలను, 17, 18 తేదీల్లో మండల పరిషత్ కార్యాలయాల వద్ద ధర్నా, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో ఈ నెల 23న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. కనీస వేతనాలు ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ నెరవేరే వరకు సమ్మె కొనసాగిస్తామని అంటున్నారు.
డిమాండ్లు ఇవే..
జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,830 అంగన్‌వాడీ కేంద్రాలు, 270 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేపట్టడంతో అవి మూతపడ్డాయి. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలను రూ.10 వేలు చేయాలని, ఐసీడీఎస్‌లో ఐకేపీ జోక్యాన్ని తగ్గించాలని, ప్రాజెక్టులను రెగ్యులరైజ్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పింఛను సౌకర్యం కల్పించాలనే తదితర డిమాండ్లతో సీఐటీయూ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టారు. తొలుత 17 నుంచి 22 వరకు సమ్మె చేయాలని నిర్ణయించినా, తర్వాత దానిని నిరవధిక సమ్మెగా మార్చినట్టు సంఘ నేతలు తెలిపారు.
నిలిచిన సేవలు
అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మె చేపట్టడంతో ఆయా కేంద్రాల ద్వారా చిన్నారులకు, బాలింతలకు, గర్భిణులకు అందే సేవలు నిలిచిపోయాయి. జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 2.57 లక్షల మంది చిన్నారులు నమోదయ్యారు. 2.39 లక్షల మంది చిన్నారులు కేంద్రాలకు వస్తున్నట్టు రికార్డులు చెబుతున్నాయి. వీరితో పాటు కేంద్రాల పరిధిలో 45,161 మంది గర్భిణులు ఉండగా, 43,354 మందికి ఫీడింగ్ ఇస్తున్నారు. 45,207 మంది బాలింతల్లో 41,774 మందికి పౌష్ఠికాహారం అందజేస్తున్నారు. వీరికి పౌష్ఠికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు. గర్భిణులకు, బాలింతలకు వారానికి నాలుగు గుడ్ల చొప్పున ఇవ్వాల్సి ఉండగా, అవి నిలిచిపోయాయి. మూడు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు పౌష్ఠికాహార భోజనం, గుడ్లు, శనగలు ఇవ్వాల్సి ఉండగా కార్యకర్తల, ఆయాల సమ్మెతో నిలిచిపోయింది. అంగన్‌వాడీ కార్యకర్తల, ఆయాల సమ్మె చేస్తే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్న అధికారులు అందులో విఫలమయ్యారు.
Advertisement
Advertisement