ఇందిరాపార్క్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న విజయమ్మ
అంగన్వాడీ ఉద్యోగుల చేస్తున్న న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఉద్యోగులు కోరుతూన్న డిమాండ్ న్యాయబద్దంగా ఉన్నాయని తెలిపారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులను కలసి విజయమ్మ తన సంఘీభావాన్ని ప్రకటించారు.
గతంలో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను విజయమ్మ ఈ సందర్బంగా గుర్తు చేశారు. త్వరలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని విజయమ్మ ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా ఇచ్చారు.
వైఎస్ విజయమ్మతోపాటు ఆ పార్టీ నేతలు శోభానాగిరెడ్డి, గట్టు రామచంద్రరావులు అంగన్వాడి ఉద్యోగులను కలసిన వారిలో ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోరుతూ గత నాలుగు రోజులుగా అంగన్వాడీ ఉద్యోగులు ఇందిరా పార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.