రాజధాని ముట్టడి | Anganwadi Workers protest to hike salaries of Anganwadi | Sakshi
Sakshi News home page

రాజధాని ముట్టడి

Published Tue, Feb 25 2014 1:14 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

రాజధాని ముట్టడి - Sakshi

రాజధాని ముట్టడి

* కదంతొక్కిన అంగన్‌వాడీ కార్యకర్తలు
* వేతనం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్
* ఇందిరాపార్క్ వద్ద ‘చలో హైదరాబాద్’ ధర్నా
* రిటైర్‌మెంట్ ప్రయోజనాలు కల్పించాలని,
* ఐకేపీ జోక్యాన్ని నివారించాలని విజ్ఞప్తి
* సచివాలయం ముట్టడికి యత్నం..
* అడ్డుకున్న పోలీసులు.. అరెస్టులు
* చర్చలకు పిలిచిన సీఎస్... రేపు మరోసారి  
 
సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వేలాది మంది అంగన్‌వాడీ వర్కర్లు రాజధానిని ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం 23 జిల్లాల నుంచి ఒక చేతిలో జెండా.. మరో చేతిలో సద్దిమూటతో వచ్చి ‘చలో హైదరాబాద్’ ధర్నాను నిర్వహించారు. తమకు ఇస్తున్న వేతనాన్ని కనీసం రూ. 10 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేలాదిగా తరలివస్తున్న అంగన్‌వాడీ వర్కర్లను అడ్డుకోవడానికి పోలీసులు నానా తంటాలూ పడ్డారు. చివరికి ధర్నాకు అనుమతి లేదంటూ.. సభకు వస్తున్నవారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీంతో అంగన్‌వాడీలు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో బైఠాయించడంతో.. ట్రాఫిక్ స్తంభించింది. చివరికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిగింది.
 
- సీఐటీయూ నాయకత్వంలో ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద ‘చలో హైదరాబాద్’ సభ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వేలాది మంది అంగన్‌వాడీ వర్కర్లు ధర్నాకు హాజరయ్యారు.
-  అంగన్‌వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ. 10 వేలు ఇవ్వాలని, రిటైర్‌మెంట్ ప్రయోజనాలను కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
- అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు చెల్లించాలని, ఐకేపీ జోక్యాన్ని నివారించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే విధానాన్ని రద్దు చేయాలని కోరారు.


 సచివాలయం ముట్టడికి యత్నం..
-  గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ.. ఇందిరాపార్కు నుంచి వేలాది మంది అంగన్‌వాడీ వర్కర్లు సీఐటీయూ అధ్యక్షుడు సాయిబాబు, ప్రధాన కార్యదర్శి ఆర్.సుధాభాస్కర్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడికి బయలుదేరారు.
- పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇందిరాపార్కు చౌరస్తా వద్ద ప్రధాన రహదారిపై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 4 వరకు బైఠాయించారు.
- దీంతో పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలకు ఆహ్వానించడంతో... పోలీస్ స్టేషన్ నుంచి సీఐటీయూ నాయకులను పోలీసులే సచివాలయానికి తీసుకెళ్లారు.
-కాగా.. వివిధ జిల్లాల నుంచి తరలివస్తున్న దాదాపు 300 మందికిపైగా అంగన్‌వాడీలను పలుచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం పూచీకత్తుపై విడుదల చేశారు.
 
 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి..
 రాష్ట్రంలో అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పారిపోయారని సీపీఎం కేంద్ర కమిటీ నాయకుడు ఎస్. వీరయ్య మండిపడ్డారు. అంగన్‌వాడీ వర్కర్లను గుర్రాలతో తొక్కించిన వారి అడ్రస్ 10 ఏళ్ల పాటు గల్లంతయ్యిందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు వ్యాఖ్యానించారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ వర్కర్ల కనీస వేతనాన్ని రూ.10 వేలకు పెంచాల్సిందేనని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రోజా డిమాండ్ చేశారు.
 
 26న పూర్తిస్థాయి చర్చలు..
 అంగన్‌వాడీలను చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 26వ తేదీ బుధవారం మరోసారి చర్చలు జరుపుదామని ప్రతిపాదించారని అంగన్‌వాడీ యూనియన్, సీఐటీయూ నాయకులు తెలిపారు. 26న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ, కమిషనర్ చిరంజీవి చౌదరితో చర్చలు జరుగనున్నాయని చెప్పారు. తమ సమస్యలను సీఎస్ దృష్టికి తీసుకెళ్లామని, ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్న వేతనాల వివరాలను కూడా అందజేశామని పేర్కొన్నారు. 26న చర్చిద్దామని సీఎస్ చెప్పారని... ఈ చర్చలకు ప్రభుత్వ అధికారులు ఒక నిర్దిష్టమైన ప్రతిపాదనలతో రావాలని కోరామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగుతుందని వెల్లడించారు. మంగళ, బుధవారాలలో రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని అంగన్‌వాడీ కార్యకర్తలకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు పిలుపునిచ్చారు.
 
 అంగన్‌వాడీలపై దాడి అమానుషం: రాఘవులు
 తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం... నిరసన తెలపడానికి వచ్చిన అంగన్‌వాడీ సిబ్బందిపై అమానుషంగా దాడి చేయించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ఆరోపించారు. హైదరాబాద్‌లో సోమవారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని... మహిళలని కూడా చూడకుండా దారుణంగా లాఠీచార్జ్ చేశారని మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement