'సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటాం'
హైదరాబాద్ : తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. కనీస వేతనం పదివేలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి అంగన్ వాడీ కార్యకర్తలు ఇందిరా పార్క్ వరకూ ర్యాలీగా బయల్దేరారు.
కాగా అంగన్వాడీలు తలపెట్టిన సభకు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి అంగన్వాడీ కార్యకర్తలు సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమలాసన్ రెడ్డి హెచ్చరించారు.
అయితే పోలీసుల హెచ్చరికలకు తాము భయపడేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు స్ఫష్టం చేశారు. సభ నిర్వహించి తీరుతామని వారు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఏం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు సీఐటీయూ సంఘీభావం తెలిపింది.