ఖమ్మం, న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో హైదరాబాద్’ పిలుపునందుకుని బయలుదేరిన అంగన్‌వాడీలను జిల్లాలో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిర్బంధించి వారి ఆందోళనను భగ్నం చేసేందుకు యత్నించారు. జిల్లా ఉద్యోగులనే కాకుండా జిల్లా మీదుగా వెళ్తున్న పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఉద్యోగులనూ అడ్డుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని అశ్వారావుపేట, భద్రాచలం, కూసుమంచి మండలం నాయకన్‌గూడెం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టారు. భారీగా బలగాలను మోహరించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ వెళ్తున్న అంగన్‌వాడీలను అడ్డుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రధాన రహదారి మీదుగా వెళ్తున్న వాహనాలను అశ్వారావుపేట, సత్తుపల్లి, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మంరూరల్, కూసుమంచి ప్రాంతాల్లో అడ్డగించారు. పలువురు ఉద్యోగులను అరెస్టు చేశారు. అక్రమ నిర్బంధంపై అంగన్‌వాడీలు ఆగ్రహించారు. పోలీస్ చర్యలను ఖండించారు. శాంతియుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని అన్నారు. వీరికి సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలో చేశారు. అంగన్‌వాడీలు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పలువురు పోలీస్‌వలయం నుంచి తప్పించుకొని వేరేమార్గాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లాలో సుమారు మూడువేల మంది అంగన్‌వాడీ ఉద్యోగిణులను అరెస్ట్ చేసి సోమవారం తెల్లవారాక వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.
పొరుగుజిల్లాల వారికి కొణిజర్లలో బ్రేక్...
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతాలకు చెందిన అంగన్‌వాడీ ఉద్యోగులను పోలీసులు కొణిజర్ల వద్ద అడ్డుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పది బస్సులు, రెండు డీసీఎంలలో వెళ్తున్న సుమారు 500 మంది అంగన్‌వాడీలను అడ్డుకున్నారు. పోలీస్ చర్యను నిరసిస్తూ వారు రాష్ట్రీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకులు వీరికి మద్దతు తెలిపారు. రాత్రి 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వైరా వైపు నుంచి వస్తున్న ఇతరత్ర వాహనాలను పోలీసులు వైరా, బోనకల్ మీదుగా ఖమ్మం తరలించారు. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతకూ అనుమతించకపోవడంతో చేసేదేమీలేక ఉద్యోగులు వెనుదిరిగి వెళ్లారు.
కూసుమంచిలోనూ అదే తంతు..
కూసుమంచిలోనూ ఇదే తంతు కొనసాగింది. కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వాహనాల్లో వస్తున్న సుమారు 200 మంది అంగన్‌వాడీలను హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై జాన్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు కూసుమంచి, నాయకన్‌గూడెంలో అడ్డుకున్నారు. పోలీస్ అడ్డంకులను నిరసిస్తూ అంగన్‌వాడీలు స్టేషన్ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు. కొందరు కాలినడకన హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు. సుమారు రెండుగంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీస్ ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు వాహనాల్లో పోలీసులను ఎక్కించి బలవంతంగా అంగన్‌వాడీ కార్యకర్తలను వెనక్కుపంపించారు.
అశ్వారావుపేట మీదుగా వెళ్తున్న సుమారు 50 మంది అంగన్‌వాడీలను ఇలాగే నిర్బంధించారు. పోలీసుల, అంగన్‌వాడీ ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రీయ రహదారిపై అరగంటపాటు రాస్తారోకో చేశారు. ఆదివారం రాత్రి కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు వచ్చిన అంగన్‌వాడీలను ఇలాగే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో బాలరాజు అంగన్‌వాడీలు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. 200 మందికిపైగా కార్యకర్తలు పోలీసుల వలయం తప్పించుకుని హైదరాబాద్ వెళ్లారు. సత్తుపల్లి నియోజకవర్గం వీఎం బంజర వద్ద పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అంగన్‌వాడీలనూ ఇదే విధంగా అడ్డుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో వదిలిపెట్టారు.
జిల్లావ్యాప్తంగా మూడువేల మంది అరెస్ట్
జిల్లాకు చెందిన అంగన్‌వాడీలను అశ్వారావుపేటలో 200 మంది, ఖమ్మం అర్బన్‌లో 300, ఖమ్మం రూరల్‌లో 50, కొణిజర్లలో 50, కూసుమంచిలో 400, కొణిజర్లలో 12 బస్సుల్లో వెళ్తున్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 1200 మంది, పెనుబల్లిలో 500, సత్తుపల్లిలో 300 మందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. భద్రాచలంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అంగన్‌వాడీలకు అడ్డంకులు
Published Tue, Feb 25 2014 2:20 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
Advertisement
Advertisement