chalo hyderabad
-
అంగన్వాడీల సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్‌రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌తో భేటీ అయిన వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీత, ఏఐటీయూసీ నేతలు ఎన్.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు. మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. -
'22న ర్యాలీ నిర్వహించి తీరుతాం'
కరీంనగర్ : 'మా కొలువులు మాకు కావాలి' పేరుతో ఈ నెల 22న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం తెలిపారు. కరీంనగర్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ( చదవండి : సతాయిస్తే వెనక్కి తగ్గుతామా? ) ప్రభుత్వం నుంచి అనుమతి రాకున్నా ర్యాలీ నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఈ ర్యాలీ చేపడుతున్నామన్నారు. హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు వరకు నిరసన ర్యాలీ నిర్వహించి.. ఇందిరాపార్కు వద్ద భారీ సభ నిర్వహిస్తామని కోదండరాం తెలిపారు. -
చలో హైదరాబాద్‌కు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ డీఎడ్, బీఎడ్, డీఎస్సీ అభ్యర్థుల సంఘాలు సంయుక్తంగా తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని, ఐదేళ్లుగా డీఎస్సీ ప్రకటించకుండా మోసం చేస్తోందన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో 65 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, 2012 తర్వాత ఇప్పటివరకు ఒక్క టీచర్ పోస్టును కూడా తర్వాతి ప్రభుత్వాలు భర్తీ చేయలేదన్నారు. -
చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ
చేగుంట: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు కోసం హైదరాబాద్‌లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. చేగుంటలో బుధవారం చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తమ డిమాండ్‌ను వినిపించడానికి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్ విధానం పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఎలాంటి భద్రత ఉండని కుటుంబ సభ్యులకు భరోసా లేని విధంగా ఉంటుందన్నారు. దీంతో ఉద్యోగులకు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల నుంచి నెలనెలా తీసుకునే డబ్బులను షేర్ మార్కెట్‌కు బదిలీ చేయడంతో పదవీ విరమణ అనంతరం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉద్యోగుల భవిష్యత్తు ఉందని వాపోయారు. ఈ విధానం రద్దు కోసం జరిపే పోరాటంలో అన్ని సంఘాల సభ్యులు భాగస్వాములు కావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఎస్ సంఘం నాయకులు నాగరాజు, లక్ష్మణ్, సిద్దిరాములు, మధన్, వారాల నర్సింలు, రాజేందర్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
చేవెళ్ల: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెలలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం సంఘం కార్యకలాపాలు, భవిష్యత్‌లో అనుసరించబోయే కార్యాచరణపై విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌చేశారు. ఆలోగా తక్షణమే 10వ పే రివిజన్కమిషన్ ప్రకారం బేసిక్‌పే, డీఏను చెల్లించాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడి , టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగాలను క్రమబద్ధీకరించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు వినాయక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వసంతరావు మాట్లాడుతూ..తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు మురళీకృష్ణ, నాగమల్లేశ్వరి, రజిత, శోభ, పండరి పాల్గొన్నారు. -
రేపు లాయర్ల ‘ఛలో హైదరాబాద్’
హైదరాబాద్: తెలంగాణ లాయర్ల జేఏసీ శుక్రవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు, జడ్జిలకు ఆప్షన్లు ఇవ్వటంపై గత కొన్ని రోజులుగా లాయర్లు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలోనే 11 మంది జడ్జిలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళన చేయాలని టీ అడ్వకేట్స్ జేఏసీ నిర్ణయించింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద చేపట్టే ఆందోళనకు పెద్ద ఎత్తున హాజరు కావాలని లాయర్లను కోరింది. -
వ్యవసాయశాఖలో పదోన్నతుల వివాదం
►నేడు ఉద్యోగుల చలో హైదరాబాద్ సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతుల చిచ్చు రేగుతోంది. రాష్ట్రంలోని ఐదో జోన్, ఆరో జోన్ ఉద్యోగుల్లో కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వివాదం రగులుకుంటోంది. 371 (డి) నిబంధన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని... ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీనివల్ల ఆరో జోన్‌లోని వారు ఆరేళ్లకే పదోన్నతులు పొందుతుండగా... ఐదో జోన్‌కు చెందినవారు పదేళ్లయినా పదోన్నతులు పొందలేకపోతున్నారని అంటున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఐదో జోన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరుతూ ఐదో జోన్‌కు చెందిన నాలుగు జిల్లాల వ్యవసాయశాఖ ఉద్యోగులు బుధవారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. దాదాపు 200 మంది వరకు హైదరాబాద్ తరలివచ్చి వ్యవసాయశాఖ డెరైక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు. -
కదం తొక్కిన ఆశ వర్కర్లు
-
బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆశ వర్కర్ల అరెస్టు
ఆదిలాబాద్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేశారు. తమ సమస్యల సాధనకోసం ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు లో భాగంగా గురువారం సాయంత్రం బెల్లంపల్లి రైల్వే ష్టేషన్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన 300 మంది ఆశా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారు. పోలీసులను చూసి బెదిరిపోయిన వర్కర్లను వెంటాడి.. పిడిగుద్దులు గుద్దుతూ.. రైలు ఎక్కకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫారమ్ పైకి రావడంతో.. కొంత మంది బోగీల్లోకి ఎక్కారు. ఈ గందర గోళంలో రైలు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. బోగీల్లోకి ఎక్కిన వారిని సైతం బలవంతంగా రైలు దించేశారు. పోలీసుల దాడికి నిరసనగా.. ఆశ వర్కర్లు స్టేషన్ లోని ఆర్ పీ ఎఫ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. -
పోడు భూముల రక్షణకై 25న చలో హైదరాబాద్
టేకులపల్లి (ఖమ్మం) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పోడు భూముల రక్షణ కోసం ఈనెల 25వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు న్యూడెమోక్రసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం జిల్లా టేకులపల్లిలోని పార్టీ కార్యాలయంలో చలో హైదరాబాద్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేతలు ఊక్లా, హర్జ్య, తోటకూరి వెంకటేశ్వర్లు, కల్తి వెంకటేశ్వర్లు, నోముల భానుచందర్ తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల చలో హైదరాబాద్ భగ్నం
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ లోని అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి అడగడునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లోని కార్యకర్తలను ముందుగా అరెస్ట్ చేసి వారి చేపట్టిన హైదరాబాద్ కార్యక్రమానికి పోలీసులు భగ్నం కల్గించారు. తమ సమస్యలను పరిష్కిరించాలని కోరుతూ మంగళవారం చలో హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొనడానికి తరలివెళుతున్న అంగన్వాడీ కార్యకర్తలను విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి రైల్వే స్టేషన్లలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం జరిగింది. స్వల్ప తోపులాట జరగడంతో ఐద్వా నాయకురాలు శ్రీదేవి సొమ్మసిల్లి పడిపోయారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి బయలు దేరిన 50 మంది అంగాన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగరలో సోమవారం చోటుచేసుకుంది. కనీస వేతనాలను చెల్లించాలని కోరుతూ చలో హైదరాబాద్ కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. -
ప్రజా ఉద్యమాలను అణచలేరు
విజయనగరం క్రైం:ప్రజా ఉద్యమాలను ఎవరూ అణచివేయలేరని, అలా చేస్తే ప్రజలే వారిని శాశ్వతంగా దూరంగా ఉంచుతారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం.కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలో ఆదివారం సీపీఎం నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఇంటి ముందు వారు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారు అరగంట పాటు ఆందోళన కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు సీపీఎం నాయకులను అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే మహిళా నాయకులు మాత్రం రోడ్డుకు అడ్డంగా కూర్చుని నిరసన తెలిపారు. తర్వాత వన్‌టౌన్‌లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లను రప్పించారు. ఇంతలో విషయం తెలుసుకున్న డీఎస్పీ పీవీ రత్నం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిరసన తెలుపుతున్న మహిళా నాయకులను అరెస్టు చేసి జైలుకు తరలిం చారు. అంతకుముందు కృష్ణమూర్తి మాట్లాడుతూ అంగన్వాడీలు, వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడానికి చలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ఆ ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను అరెస్టు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అరెస్టు చేసిన వారిని విడిపించేంత వరకు ఆందోళన వీడేది లేదన్నారు. ప్రజా హక్కులను కాలరాసే అధికారం ఎవరికీ లేదని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి టి.సూర్యనారాయణ, పార్టీ నాయకులు రెడ్డి వేణు, బి.ఇందిర, బి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు. సీపీఎం నాయకులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పిళ్లా విజయ్‌కుమార్ మద్దతు ప్రకటించారు. లోక్‌సత్తా పార్టీ నుంచి ఎల్.భాస్కర్ హాజరై మద్దతు ప్రకటించారు. సీపీఎం నాయకుల ఆందోళన వల్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటు ఎత్తుబ్రిడ్జి దాటి వాహనాలు పెద్ద సంఖ్యలో క్యూలో ఉండగా ఇటు కలెక్టరేట్ జంక్షన్ వరకు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 49 మంది సీపీఎం నాయకుల అరెస్ట్ అంగన్వాడీ సమస్యలపై ఈనెల 17న చలో హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్తారనే ముందస్తు సమాచారంతో పలువురు సీపీఎం నాయకులను వన్‌టౌన్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. దీనికి నిరసనగా సీపీఎం నాయకులు కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఇంటి ఎదురుగా ఉన్న జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో వన్‌టౌన్ సీఐ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు 49 మంది నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేశారు -
ఉద్యమంపై ఉక్కుపాదం
కాకినాడ సిటీ :తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చిన అంగన్వాడీలు, వీఆర్ఏలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సర్కారు ఆదేశాల మేరకు ఆయా సంఘాల నేతలు, ముఖ్య కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. వారి ఇళ్లకు వెళ్లి బలవంతంగా అరెస్టులు చేశారు. ఈ దమనకాండపై కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స అండ్ హెల్పర్స యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 9 నుంచి అంగన్వాడీ కార్యకర్తలు దశలవారీ ఆందోళనలు చేపట్టారు. సోమవారం జరిగే చలో హైదరాబాద్‌కు సంసిద్ధులయ్యారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.పుణ్యవతి, ఎంఏ గఫూర్ నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. వారికి మద్దతుగాను, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నుంచి అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అంగన్వాడీ నేతలు, కార్యక్రతలు ఇళ్ల నుంచి కదలరాదని, బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అంగన్వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా కాకినాడ రూరల్ మండలం చీడిగలోని ఆమె నివాసానికి ఇంద్రపాలెం పోలీసులు వెళ్లి ఆమె భర్త సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పలుచోట్ల వీఆర్ఏల అరెస్టు 010 పద్దు ద్వారా ప్రతి నెలా సక్రమంగా జీతాలివ్వాలని, వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని, తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, మహిళా వీఆర్ఏలకు ప్రసూతి సెలవు మంజూరు చేయాలని, పింఛను సౌకర్యం కల్పించాలన్న డిమాండ్లతో ‘చలో హైదరాబాద్’ చేపట్టిన వీఆర్ఏలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పి.గన్నవరం, రాజానగరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్‌కు బయలుదేరినవారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులు తమను అడ్డుకోవడంపై వీఆర్ఏలు నిరసన తెలిపారు. అప్రజాస్వామికం జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని అంగన్వాడీ నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు బలవంతపు అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతుంటే నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని, కనీస వేతనం అమలు చేసి, వేతనాలు పెంచాలని, పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదనపు పనులు అప్పగించరాదని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, పదోన్నతులకు వయోపరిమితులు తొలగించాలని, అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు ఇవ్వాలని, అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలన్న న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోగా, నిరంకుశంగా వ్యవహరించడం దారుణం. - దువ్వా శేషుబాబ్జీ, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆందోళన తీవ్రతరం అంగన్వాడీలు సాయంత్రం వరకూ సెంటర్ నడుపుతున్నా వేతనం పెంచడంలేదు. తెలంగాణ ప్రభుత్వం తాజా బడ్జెట్లో వర్కర్‌కు రూ.2800, ఆయాకు రూ.1800 పెంచి అమలు చేస్తోంది. మన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ఊసే ఎత్తడంలేదు. రాష్ట్ర నాయకులు పుణ్యవతి, గఫూర్‌ల నిరవధిక దీక్షకు ప్రజాసంఘాలన్నీ మద్దతివ్వాలి. సమస్యల పరిష్కారానికి పూనుకోకుండా నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం, గృహనిర్బంధం విధించడం గర్హనీయం. ఇలాంటి నియంతృత్వ పోకడలే చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరంగా ఉంచాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం. పోలీసులు నిర్బంధిస్తే స్టేషన్ల ముందే బైఠాయిస్తాం. - ఎం.వీరలక్ష్మి, జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ -
ఐకేపీ యానిమేటర్లకు వైఎస్ జగన్ మద్దతు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన జీతం బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. పోలీసులు అరెస్ట్ చేసిన ఐకేపీ నాయకురాలు ధనలక్ష్మితో సోమవారం ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఐకేపీ ఉద్యోగుల పోరాటానికి మద్దతు తెలిపారు. ప్రసుత్తం ఆమె బొల్లారం పోలీసు స్టేషన్ లో ఉన్నారు. కాగా, ఐకేపీ యానిమేటర్ల అరెస్ట్ ను నిరసిస్తూ శాసనసభ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది. ఐకేపీ యానిమేటర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఛలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టిన ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. -
ఐకేపీ ఛలో హైదరాబాద్ కార్యక్రమం భగ్నం
అనంతపురం: ఇందిరా క్రాంతి పథకం (ఐకేపీ) ఉద్యోగుల ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గంలో ఐకేపీ యానిమేటర్లను పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా కృష్ణా జిల్లా నుంచి సోమవారం తలపెట్టిన ఐకేపీ ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇందులో భాగంగా ముందుగా సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో ఐకేపీ వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. -
ఐకేపీ వీవోఏల ప్రదర్శన, ధర్నా
ఖమ్మం మయూరిసెంటర్: వేతన బకారులు విడుదల చేయాలన్న డిమాండుతో ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి వెళ్తున్న ఐకేపీ గ్రామ దీపికలను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఐకేపీ వీవోఏల ఉద్యోగ సంఘం (సీఐటీయూ) ఆధ్వర్యంలో నగరంలో ప్రదర్శన, కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్, బస్టాండ్, వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా ధర్నా చౌక్‌కు ప్రదర్శకులు చేరుకున్నారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించారు. సంఘం జిల్లా నాయకురాలు రేష్మా అధ్యక్షతన జరిగిన ఈ ధర్నానుద్దేశించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వీవోఏలపట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం తగదని అన్నారు. వీరికి ప్రభుత్వం 17 నెలల వేతనాలు ఇవ్వాల్సుందన్నారు. వీటిని వెంటనే విడుదల చేయూలని అడిగేందుకు వెళుతున్న వీరిని ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం, లాఠీచార్జి జరపడం అప్రజాస్వామికమని అన్నారు. ఇన్ని నెలలపాటు వేతనాలు రాకపోతే గ్రామ దీపికలు ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. వీరికి ఆహార భద్రత కార్డులను రద్దు చేసేందుకు యత్నించడం దారుణమన్నారు. వీరికి బకారుు వేతనాలు తక్షణమే విడుదల చేయాలని, లేదా సంబంధిత మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ దీపికలకు ఐదువేల రూపాయల వేతనం ఇస్తామన్న ఎన్నికల హామీని కేసీఆర్ విస్మరించారని విమర్శించారు. గ్రామ దీపికలపట్ల మంత్రి కేటీఆర్ అహంకారపూరితంగా వ్యవహరించడం తగదన్నారు. వేతన బకారుులు వెంటనే విడుదల చేయాలని, వేధింపులు మానుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కె.నరసింహారావు, ఉపాధ్యక్షులు గణపతి, టి.లింగయ్య, నాయకులు నీరజ, అరుణ, ఫణిరాజు, మోహన్‌రావు, బషీర్, టి.వెంకటేశ్వరరావు, నీలాద్రి, పద్మ, రాణి, వసంత, జయ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
గర్జించిన ఐకేపీ ఉద్యోగులు
-
అంగన్వాడీలకు అడ్డంకులు
ఖమ్మం, న్యూస్‌లైన్: సమస్యల పరిష్కారం కోసం ‘ఛలో హైదరాబాద్’ పిలుపునందుకుని బయలుదేరిన అంగన్వాడీలను జిల్లాలో పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ నిర్బంధించి వారి ఆందోళనను భగ్నం చేసేందుకు యత్నించారు. జిల్లా ఉద్యోగులనే కాకుండా జిల్లా మీదుగా వెళ్తున్న పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఉద్యోగులనూ అడ్డుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని అశ్వారావుపేట, భద్రాచలం, కూసుమంచి మండలం నాయకన్‌గూడెం తదితర ప్రాంతాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు పెట్టారు. భారీగా బలగాలను మోహరించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ వెళ్తున్న అంగన్వాడీలను అడ్డుకొని పోలీసు స్టేషన్లకు తరలించారు. ప్రధాన రహదారి మీదుగా వెళ్తున్న వాహనాలను అశ్వారావుపేట, సత్తుపల్లి, కొణిజర్ల, ఖమ్మం అర్బన్, ఖమ్మంరూరల్, కూసుమంచి ప్రాంతాల్లో అడ్డగించారు. పలువురు ఉద్యోగులను అరెస్టు చేశారు. అక్రమ నిర్బంధంపై అంగన్వాడీలు ఆగ్రహించారు. పోలీస్ చర్యలను ఖండించారు. శాంతియుతంగా వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని అన్నారు. వీరికి సీపీఎం, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ప్రధాన రహదారులపై రాస్తారోకోలో చేశారు. అంగన్వాడీలు హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పలువురు పోలీస్వలయం నుంచి తప్పించుకొని వేరేమార్గాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు. జిల్లాలో సుమారు మూడువేల మంది అంగన్వాడీ ఉద్యోగిణులను అరెస్ట్ చేసి సోమవారం తెల్లవారాక వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. పొరుగుజిల్లాల వారికి కొణిజర్లలో బ్రేక్... తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, కృష్ణాజిల్లా తిరువూరు ప్రాంతాలకు చెందిన అంగన్వాడీ ఉద్యోగులను పోలీసులు కొణిజర్ల వద్ద అడ్డుకున్నారు. సోమవారం తెల్లవారుజామున పది బస్సులు, రెండు డీసీఎంలలో వెళ్తున్న సుమారు 500 మంది అంగన్వాడీలను అడ్డుకున్నారు. పోలీస్ చర్యను నిరసిస్తూ వారు రాష్ట్రీయ రహదారిపై ఆందోళనకు దిగారు. సీపీఎం నాయకులు వీరికి మద్దతు తెలిపారు. రాత్రి 2 గంటల పాటు రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వైరా వైపు నుంచి వస్తున్న ఇతరత్ర వాహనాలను పోలీసులు వైరా, బోనకల్ మీదుగా ఖమ్మం తరలించారు. పలువురు నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసులు ఎంతకూ అనుమతించకపోవడంతో చేసేదేమీలేక ఉద్యోగులు వెనుదిరిగి వెళ్లారు. కూసుమంచిలోనూ అదే తంతు.. కూసుమంచిలోనూ ఇదే తంతు కొనసాగింది. కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వాహనాల్లో వస్తున్న సుమారు 200 మంది అంగన్వాడీలను హైదరాబాద్ వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్సై జాన్‌రెడ్డి నేతృత్వంలో పోలీసులు కూసుమంచి, నాయకన్‌గూడెంలో అడ్డుకున్నారు. పోలీస్ అడ్డంకులను నిరసిస్తూ అంగన్వాడీలు స్టేషన్ ఎదుట రోడ్డుపై ఆందోళనకు దిగారు. కొందరు కాలినడకన హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు. సుమారు రెండుగంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీస్ ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు వాహనాల్లో పోలీసులను ఎక్కించి బలవంతంగా అంగన్వాడీ కార్యకర్తలను వెనక్కుపంపించారు. అశ్వారావుపేట మీదుగా వెళ్తున్న సుమారు 50 మంది అంగన్వాడీలను ఇలాగే నిర్బంధించారు. పోలీసుల, అంగన్వాడీ ఉద్యోగుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్రీయ రహదారిపై అరగంటపాటు రాస్తారోకో చేశారు. ఆదివారం రాత్రి కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు వచ్చిన అంగన్వాడీలను ఇలాగే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. త్రీటౌన్ ఎస్‌హెచ్‌వో బాలరాజు అంగన్వాడీలు రైల్వేస్టేషన్‌లోకి వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 500 మందిని అదుపులోకి తీసుకున్నారు. 200 మందికిపైగా కార్యకర్తలు పోలీసుల వలయం తప్పించుకుని హైదరాబాద్ వెళ్లారు. సత్తుపల్లి నియోజకవర్గం వీఎం బంజర వద్ద పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన అంగన్వాడీలనూ ఇదే విధంగా అడ్డుకున్నారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో వదిలిపెట్టారు. జిల్లావ్యాప్తంగా మూడువేల మంది అరెస్ట్ జిల్లాకు చెందిన అంగన్వాడీలను అశ్వారావుపేటలో 200 మంది, ఖమ్మం అర్బన్‌లో 300, ఖమ్మం రూరల్‌లో 50, కొణిజర్లలో 50, కూసుమంచిలో 400, కొణిజర్లలో 12 బస్సుల్లో వెళ్తున్న తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన 1200 మంది, పెనుబల్లిలో 500, సత్తుపల్లిలో 300 మందిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అక్రమ అరెస్ట్‌లను నిరసిస్తూ సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. భద్రాచలంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్
-
'సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటాం'
హైదరాబాద్ : తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. కనీస వేతనం పదివేలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద అంగన్వాడీ కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి బయల్దేరిన కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కాగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచి అంగన్ వాడీ కార్యకర్తలు ఇందిరా పార్క్ వరకూ ర్యాలీగా బయల్దేరారు. కాగా అంగన్వాడీలు తలపెట్టిన సభకు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. సెంట్రల్ జోన్ పరిధిలో సభలు, ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని ఆయన చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి అంగన్వాడీ కార్యకర్తలు సభ నిర్వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని కమలాసన్ రెడ్డి హెచ్చరించారు. అయితే పోలీసుల హెచ్చరికలకు తాము భయపడేది లేదని అంగన్వాడీ కార్యకర్తలు స్ఫష్టం చేశారు. సభ నిర్వహించి తీరుతామని వారు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలకు ఏం జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు సీఐటీయూ సంఘీభావం తెలిపింది. -
అంగన్వాడీ కార్యకర్తలు అరెస్ట్
హైదరాబాద్ : సమస్యల పరిష్కారం కోరుతూ 'ఛలో హైదరాబాద్' కార్యక్రమానికి బయల్దేరిన అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. నల్గొండ జిల్లా సూర్యాపేటలో హైదరాబాద్ వస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు సోమవారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. దాంతో వారు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు వరంగల్ జిల్లాలోనూ అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి అనుమతి లేదంటూ వారిని జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లలో అరెస్ట్ చేయటంతో కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇక కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలను ఖమ్మం, నల్గొండ జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు నిలిపివేశారు. దాంతో వారు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా బొబ్బిలిలో జరిగిన అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది కార్యకర్తలతో బొబ్బిలిలో నిర్వహించిన ఆందోళనకు సీఐటీయూ నాయకులు కూడా మద్దతు పలికారు. కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పదకొండు మందిని అరెస్టు చేశారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు. విజయనగరంలోనూ కోట జంక్షన్ నుంచి కన్యాకాపరమేశ్వరి ఆలయం వరకు వరకూ ప్రదర్శన నిర్వహించి అక్కడ రాస్తారోకో చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 21న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలు తరలి రావాలని నేతలు పిలుపునిచ్చారు.సాలూరు, నెల్లిమర్ల, కురుపాం ప్రాంతాల్లో సైతం నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 22 వరకూ అంగన్వాడీ కేంద్రాలు మూతపడనున్నాయి. -
‘చలో హైదరాబాద్’ను విజయవంతం చేయండి : ఏపీఎన్జీవో
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ‘చలో హైదరాబాద్’ పేరిట చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఏపీఎన్జీవోల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణకు సీమాంధ్ర ప్రాంత శాసన సభ్యులపై ఒత్తిడి పెంచేందుకు చేపడుతున్న ఈ ధర్నాను విజయవంతం చేయాలని పలు సంఘాలకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాకు సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా మద్దతివ్వాలని ఆదివారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కోరారు. ఈ సందర్భంగా ‘చలో హైదరాబాద్’ ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని, అవసరమైతే రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేయాలన్న లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. సమైక్యవాదుల ఓట్లతో గెలిచిన జేపీ ఆ విషయాన్ని మరచి మాట్లాడడం బాధాకరమన్నారు. వచ్చే ఎన్నికల్లో జేపీపై పోటీకి ఉద్యోగుల్లో ఒకరిని దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. -
అటెండర్ నుంచి అధికారి వరకు ‘చలో హైదరాబాద్’
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు కల్పించినా సక ల జనభేరి మోగిస్తాం. ఇందుకు జిల్లావాసులు అ ధిక సంఖ్యలో తరలిరావాలి. జనభేరితో ప్రభుత్వం తలొగ్గక తప్పదు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటూ టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.అశోక్ పేర్కొన్నారు. శనివారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.. నిన్నా మొన్నటి వరకు ఆయన ఎవరికీ తెలీదు.. ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నెలరోజుల కిందటి వరకు విజయవాడలో ఎవరో తెలియదు. సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట అతన్ని సీమాంధ్ర మీడియా తెరపైకి తెచ్చింది. సమైక్యవాద ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన అశోక్‌బాబు వాస్తవాలను వక్రీకరిస్తూ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే రెండు రాష్ట్రాల సచివాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పనిచేయాల్సి ఉంటుందన్న కనీస జ్ఞానం లేకుండా ఉద్యోగులను సైతం తరిమికొడతారంటూ తప్పుడు ప్రచారం చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమే. ఎన్టీఆర్ హయాంలోనే 610 జీవో.. 985 డిసెంబర్ 26న అప్పటి టీఎన్జీవో నేత స్వామినాథం ఇచ్చిన రిప్రెజెంటేషన్ మేరకు అప్పటి సీఎం ఎన్టీ రామారావు 610 జీవో విడుదల చేస్తే ఇప్పటివరకు అమలుకాలేదు. సచివాలయం కేంద్రంగా అడుగడుగునా ఉల్లంఘనకు పాల్పడుతూ తెలంగాణ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు. 14ఎఫ్ రద్దయినా కోర్టు స్టే మీద చాలామంది సీమాంధ్ర ఉద్యోగులు ఫ్రీజోన్ పేరిట హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలగాణ ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులను ఎల్లగొడతారనేది అపోహ. సీఎంది అవివేకం.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ సర్కార్ సుముఖత వ్యక్తం చేసిన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్, సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విభజనకు అడ్డుతగలడం అవి వేకం. సీమాంధ్రలో జరుగుతున్నది కృత్రిమ ఉద్యమం. ఆ ఉద్య మం వెనక సీమాంధ్ర సీఎంగా మారిన కిరణ్‌కుమార్‌రెడ్డి పాత్ర ఉంది. తెలంగాణలో ఉద్యోగులు సకల జనుల సమ్మెకు దిగితే ‘ఎస్మా’ లాంటి కఠిన చట్టాల పేరిట బెదిరించిన సీఎం సంక్షేమ పథకాలు నిలిచిపోతున్నాయని వాపోయారని.. అయితే సీమాం ధ్రలో 60 రో జులుగా ఆయనే వెనుకుండి ఉద్యమం నడిపిస్తుంటే అక్కడ పథకాలు కుంటుపడడం లేదా..? రాష్ట్ర విభజన జరిగితే జల వివాదాలు ఉంటాయనడం అవివేకం. జాతీయ స్థాయిలో జ ల వివాదం పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్, జల వనరుల సం ఘాలు ఉన్న విషయాలను తెలియకుండా మాట్లాడుతున్నారు. ఇంటికొకరు చొప్పున జనభేరికి.. ఆరు నూరైనా... నూరారైనా.. హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌం డ్లో సకల జనభేరి జరుగుతుంది. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికు లు, వృత్తిదారుల జేఏసీలతోపాటు తెలంగాణ కోరుకునే అన్ని రాజకీయ పార్టీలు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశాయి. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి ఇంటికొక్కరు చొప్పున చలో హైదరాబాద్ తరలేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సత్వరమే జరగాలి. రాష్ట్రంలో శాంతిభద్రతలను అదుపు చేయడంలో విఫలమైన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి.. రాష్ట్రపతి పా లన విధించాలి. తెలంగాణ ప్రక్రియకు అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంటులో తీర్మానం పెట్టి ఆమోదిస్తే తక్షణమే రాష్ట్రం ప్రకటించే అవకాశం ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకు కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వివిధ రకాల ఉద్యమాలు కొనసాగిస్తాం. - సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ -
ఛలో హైదరాబాద్ నిర్వహిస్తాం: ఏపీఎన్జీవో
హైదరాబాద్ : ప్రభుత్వం అనుమతించకపోయినా సెప్టెంబర్ 7వ తేదీన తలపెట్టిన ఛలో హైదరాబాద్‌ను నిర్వహించి తీరుతామని ఏపీఎన్జీవోల సంఘం స్పష్టం చేసింది. తాము శాంతియుతంగా నిరసన తెలియచేస్తామని ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలు ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ... జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నేతలను కలవాలని నిర్ణయించారు. వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన 40 మంది ప్రతినిధులతో ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు అశోక్‌బాబు తెలిపారు. సమైక్య వాదాన్ని ఢిల్లీ నేతలకు గట్టిగా వినిపిస్తామని చెప్పారు. ఆంటోనీ కమిటీని కలిసి తమ వాదనలు వినిపిస్తామని అశోక్ బాబు వెల్లడించారు. -
సెప్టెంబర్ 7న చలో హైదరాబాద్‌కు పిలుపు
-
7న చలో హైదరాబాద్: ప్రొఫెసర్ ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘చలో హైదరాబాద్’ పిలుపుతో సెప్టెంబరు మొదటివారంలో రాజధానిలో భారీ శాంతిర్యాలీని నిర్వహించనున్నట్టు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం ప్రకటించారు. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గురువారం నిర్వహించిన సద్భావనాదీక్ష (శాంతిదీక్ష)లో ఆయన మాట్లాడుతూ సెప్టెంబరు 4-7 తేదీల మధ్య తెలంగాణ ప్రజలంతా హైదరాబాద్‌కు తరలి రావడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉంటున్న సీమాంధ్ర ప్రజలకు ఎలాంటి భయాలు లేవని, సంపన్న సీమాంధ్రులే తెలంగాణను అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా కలిసే ఉంటామని చెప్పడానికి సెప్టెంబరు మొదటివారంలో భారీశాంతి ర్యాలీని నిర్వహిస్తున్నట్టుగా వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఉపద్రవం ఏదో వస్తున్నట్టుగా, భారతదేశం నుండి విడిపోతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా ఇదే ఫెడరల్ వ్యవస్థ ఉంటుందని, రాష్ట్రాలన్నీ ఇప్పటిలాగానే పనిచేస్తాయని వివరించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒక మాట, ఢిల్లీలో మరోమాట చెప్తూ ఇటు ప్రజలను, అటు అధిష్టానాన్ని మోసం చేస్తున్నాడని విమర్శించారు. నదీ జలాల పంపకం, హైదరాబాద్ వంటివాటిని వివాదం చేసే విధంగా కిరణ్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చేదాకా ఇదే ఐకమత్యంతో పోరాడాల్సిందేనని కోదండరాం పిలుపునిచ్చారు. పార్టీ వైఖరిని స్పష్టం చేసిన తర్వాతనే చంద్రబాబు సీమాంధ్రలో యాత్రకు పోవాలని, లేదంటే అది ఆత్మవంచన యాత్రే అవుతుందని టీఆర్ఎస్ సంస్థాగత, శిక్షణా శిబిరాల నిర్వహణ కమిటీ చైర్మన్ కడియం శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ప్రజల సహనాన్ని చేతకానితనంగా భావిస్తే ఎవరికీ మంచిదికాదని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు హెచ్చరించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనుకుంటే ఎవరూ సహించబోరని ఆయన చెప్పారు. వైషమ్యాలు పెంచడానికి ఎంఐఎం కుట్రలు: కవిత తెలంగాణపై ఇలాంటి కుట్రలే కొనసాగితే ఇప్పటిదాకా బతుకమ్మలు ఎత్తుకున్న చేతులతోనే బరిసెలను పడతామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజల ఇంటిపై ఎంఐఎం పేరు రాసుకోవాలని అసదుద్దీన్ చెప్తున్నారని, రాజకీయ లబ్ధికోసం తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య వైషమ్యాలను పెంచడానికి ఎంఐఎం కుట్రలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణపై ఇంకా మోసపూరితంగా వ్యవహరించకుండా చంద్రబాబునాయుడు వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పొట్ట నింపుకోవడానికి వచ్చినవారితో సామరస్యంగా ఉంటామని, పొట్టలు కొట్టేవారితోనే తమ పోరాట మని చెప్పారు. ప్రజల మధ్య ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టకుండా, శాంతియుత విభజనకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దీక్షలో జేఏసీ నేతలు దేవీప్రసాద్, మల్లేపల్లి లక్ష్మయ్య, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, రఘు, జల వనరులరంగం నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు తదితరులు ప్రసంగించారు. సెప్టెంబరు 7న శాంతిర్యాలీ..? జేఏసీ నిర్వహించ తలపెట్టిన శాంతిర్యాలీ సెప్టెంబరు 7న నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 4 నుంచి7 తేదీల మధ్యనే దీనిని నిర్వహించాలని మొదట భావించారు. అయితే సెప్టెంబరు 3, 4 తేదీల్లో ముల్కీ అమరుల సంస్మరణ దినంగా జరుపుకోనున్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబరు 5న ఉండటంతో శాంతి ర్యాలీని 7న నిర్వహించాలని జేఏసీ నేతలు సూత్రప్రాయంగా నిర్ణయించారు.