చేగుంట: కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు కోసం హైదరాబాద్‌లో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కోరారు. చేగుంటలో బుధవారం చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆవిష్కరించిన అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలీం మాట్లాడారు.
నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ తమ డిమాండ్‌ను వినిపించడానికి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నూతన పెన్షన్ విధానం పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఎలాంటి భద్రత ఉండని కుటుంబ సభ్యులకు భరోసా లేని విధంగా ఉంటుందన్నారు. దీంతో ఉద్యోగులకు భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉంటుందని తెలిపారు.
ఉద్యోగుల నుంచి నెలనెలా తీసుకునే డబ్బులను షేర్ మార్కెట్‌కు బదిలీ చేయడంతో పదవీ విరమణ అనంతరం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉద్యోగుల భవిష్యత్తు ఉందని వాపోయారు. ఈ విధానం రద్దు కోసం జరిపే పోరాటంలో అన్ని సంఘాల సభ్యులు భాగస్వాములు కావాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఎస్ సంఘం నాయకులు నాగరాజు, లక్ష్మణ్, సిద్దిరాములు, మధన్, వారాల నర్సింలు, రాజేందర్, సిద్దిరాములు తదితరులు పాల్గొన్నారు.