
చలో హైదరాబాద్‌కు వైఎస్సార్‌సీపీ మద్దతు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ నోటిఫికేషన్‌ను వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేస్తూ డీఎడ్, బీఎడ్, డీఎస్సీ అభ్యర్థుల సంఘాలు సంయుక్తంగా తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోందని, ఐదేళ్లుగా డీఎస్సీ ప్రకటించకుండా మోసం చేస్తోందన్నారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో 65 వేల ఉద్యోగాలు భర్తీ చేయగా, 2012 తర్వాత ఇప్పటివరకు ఒక్క టీచర్ పోస్టును కూడా తర్వాతి ప్రభుత్వాలు భర్తీ చేయలేదన్నారు.