కాకినాడ సిటీ :తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ‘చలో హైదరాబాద్’కు పిలుపునిచ్చిన అంగన్‌వాడీలు, వీఆర్‌ఏలపై చంద్రబాబు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సర్కారు ఆదేశాల మేరకు ఆయా సంఘాల నేతలు, ముఖ్య కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. వారి ఇళ్లకు వెళ్లి బలవంతంగా అరెస్టులు చేశారు. ఈ దమనకాండపై కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడీ వర్కర్‌స అండ్ హెల్పర్‌స యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 9 నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు దశలవారీ ఆందోళనలు చేపట్టారు. సోమవారం జరిగే చలో హైదరాబాద్‌కు సంసిద్ధులయ్యారు.
అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం నుంచి హైదరాబాద్‌లోని ఇందిరాపార్కువద్ద సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.పుణ్యవతి, ఎంఏ గఫూర్ నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నారు. వారికి మద్దతుగాను, తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్లేందుకు ఉద్యుక్తులయ్యారు. వారిని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ నేతలు, కార్యక్రతలు ఇళ్ల నుంచి కదలరాదని, బయటకు వస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలా ఉండగా అంగన్‌వాడీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి ఇప్పటికే హైదరాబాద్ చేరుకోగా కాకినాడ రూరల్ మండలం చీడిగలోని ఆమె నివాసానికి ఇంద్రపాలెం పోలీసులు వెళ్లి ఆమె భర్త సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.
పలుచోట్ల వీఆర్‌ఏల అరెస్టు
010 పద్దు ద్వారా ప్రతి నెలా సక్రమంగా జీతాలివ్వాలని, వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని, తమను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని, మహిళా వీఆర్‌ఏలకు ప్రసూతి సెలవు మంజూరు చేయాలని, పింఛను సౌకర్యం కల్పించాలన్న డిమాండ్లతో ‘చలో హైదరాబాద్’ చేపట్టిన వీఆర్‌ఏలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని పి.గన్నవరం, రాజానగరం, కోరుకొండ తదితర ప్రాంతాల్లో హైదరాబాద్‌కు బయలుదేరినవారిని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. పోలీసులు తమను అడ్డుకోవడంపై వీఆర్‌ఏలు నిరసన తెలిపారు.
అప్రజాస్వామికం
జిల్లాలోని అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలోని అంగన్‌వాడీ నేతల ఇళ్లకు వెళ్లి పోలీసులు బలవంతపు అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇది అప్రజాస్వామికం. ప్రభుత్వానికి తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళుతుంటే నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని, కనీస వేతనం అమలు చేసి, వేతనాలు పెంచాలని, పెన్షన్‌తో కూడిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, అదనపు పనులు అప్పగించరాదని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, పదోన్నతులకు వయోపరిమితులు తొలగించాలని, అర్హులైన హెల్పర్లకు పదోన్నతులు ఇవ్వాలని, అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలన్న న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోగా, నిరంకుశంగా వ్యవహరించడం దారుణం.
- దువ్వా శేషుబాబ్జీ, సీపీఎం జిల్లా కార్యదర్శి
ఆందోళన తీవ్రతరం
అంగన్‌వాడీలు సాయంత్రం వరకూ సెంటర్ నడుపుతున్నా వేతనం పెంచడంలేదు. తెలంగాణ ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో వర్కర్‌కు రూ.2800, ఆయాకు రూ.1800 పెంచి అమలు చేస్తోంది. మన రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీల ఊసే ఎత్తడంలేదు. రాష్ట్ర నాయకులు పుణ్యవతి, గఫూర్‌ల నిరవధిక దీక్షకు ప్రజాసంఘాలన్నీ మద్దతివ్వాలి. సమస్యల పరిష్కారానికి పూనుకోకుండా నేతలను ముందస్తుగా అరెస్టు చేయడం, గృహనిర్బంధం విధించడం గర్హనీయం. ఇలాంటి నియంతృత్వ పోకడలే చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరంగా ఉంచాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి. లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తాం. పోలీసులు నిర్బంధిస్తే స్టేషన్ల ముందే బైఠాయిస్తాం.
- ఎం.వీరలక్ష్మి, జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్
ఉద్యమంపై ఉక్కుపాదం
Published Mon, Mar 16 2015 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:54 PM
Advertisement
Advertisement