అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈ నిరసనలు మిన్నంటాయి. ప్రధానంగా బొబ్బిలిలో జరిగిన అంగన్‌వాడీల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. వేలాది మంది కార్యకర్తలతో బొబ్బిలిలో నిర్వహించిన ఆందోళనకు సీఐటీయూ నాయకులు కూడా మద్దతు పలికారు. కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పదకొండు మందిని అరెస్టు చేశారు. అనంతరం వారిని సొంతపూచీకత్తుపై విడిచిపెట్టారు. విజయనగరంలోనూ కోట జంక్షన్ నుంచి కన్యాకాపరమేశ్వరి ఆలయం వరకు వరకూ ప్రదర్శన నిర్వహించి అక్కడ రాస్తారోకో చేపట్టారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 21న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీలు తరలి రావాలని నేతలు పిలుపునిచ్చారు.సాలూరు, నెల్లిమర్ల, కురుపాం ప్రాంతాల్లో సైతం నిరసన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈనెల 22 వరకూ అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడనున్నాయి.