
దర్యాప్తు చేస్తున్న ఎస్‌ఐ వెంకటేశ్ (ఇన్‌సెట్లో) ఒడిశా పోలీసులు అరెస్ట్ చేసిన గురునాథం
మందస: ఒడిశా అధికారులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఏ మాత్రం సంబంధంలేని అంగన్‌వాడీ కార్యకర్త భర్తను అరెస్టు చేశారు. అతన్ని విడుదల చేయాలని ఆంధ్రాలోని గిరిజన సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సరిహద్దు పంచాయతీల సర్పంచ్‌లు, ప్రజాసంఘాలు అధికారులను ఆశ్రయించారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని సాబకోట పంచాయతీ మాణిక్యపట్నం అంగన్‌వాడీ కేంద్రం వివాదం ముదురుతోంది. ఆంధ్రా భూభాగంలో నిర్మించిన కేంద్రాన్ని తొలగించాలని ఒడిశా అధికారులు ఇప్పటి వరకూ బెదిరిస్తూ వచ్చారు. తాజాగా అరెస్టుల పర్వానికి తెరతీశారు. మాణిక్యపట్నం అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మి భర్త గురునాథం సాబకోట సచివాలయం వద్ద ఉండగా, ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా గారబంద పోలీసులు శనివారం బలవంతంగా తీసుకెళ్లారు.
చదవండి: పెచ్చు మీరుతున్న ఒడిశా ఆగడాలు
విషయం తెలుసుకున్న మందస, సాబకోట, చీపి సర్పంచ్‌లు చెరుకుపల్లి యల్లమ్మలక్ష్మణమూర్తి, సవర సంధ్యారాము, సవర లక్ష్మీప్రియచిరంజీవి, మాజీ సర్పంచ్ మద్దిల రామారావు, గిరిజన నాయకులు ధర్మారావు, సవర నీలకంఠం, సవర ప్రధాన, సవర బాలయ్య, గురునాథ్, సీఐటీయు నాయకుడు ఆర్.దిలీప్‌కుమార్ తహసీల్దార్ బడే పాపారావు, ఎస్‌ఐ కోట వెంకటేశ్‌లకు కలిసి వినతిపత్రాలను అందజేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన గురునాథాన్ని విడిపించాలని, ఒడిశా అధికారులు, పోలీసుల వేధింపుల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తను రక్షించాలని విన్నవించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న మాణిక్యపట్నం, చీపి పంచాయతీలోని కొండమేర భూసమస్యలను పరిష్కరించాలని కోరారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి అక్రమ అరెస్టు, భూసమస్యలను ఫోన్ ద్వారా వివరించగా ఆయన సానుకూలంగా స్పందించి, ఒడిశా జిల్లా అధికారులతో మాట్లాడినట్టు సమాచారం. కాగా అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వెంకటేశ్ మాణిక్యపట్నం వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: అథ్లెట్ ద్యుతి చంద్ ఫిర్యాదు.. ‘ఫోకస్ ప్లస్’ ఎడిటర్ అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment