కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
చేవెళ్ల: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్‌కుమార్ తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెలలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం సంఘం కార్యకలాపాలు, భవిష్యత్‌లో అనుసరించబోయే కార్యాచరణపై విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌చేశారు. ఆలోగా తక్షణమే 10వ పే రివిజన్‌కమిషన్ ప్రకారం బేసిక్‌పే, డీఏను చెల్లించాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడి , టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగాలను క్రమబద్ధీకరించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు వినాయక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వసంతరావు మాట్లాడుతూ..తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు మురళీకృష్ణ, నాగమల్లేశ్వరి, రజిత, శోభ, పండరి పాల్గొన్నారు.