Contract Lecutrers
-
Telangana: కాంట్రాక్ట్ అధ్యాపకులకు తీపికబురు
సాక్షి, నల్లగొండ: కాంట్రాక్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రెగ్యులర్ ప్రభుత్వ లెక్చరర్లతో సమానంగా వారి వేతనాలు కూడా పెంచింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 320 మందికి వేతనాలు పెరగనున్నాయి. దీంతో వారంతా ఆనందంలో మునిగారు. టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ చేస్తూ జీఓ 16ను విడుదల చేసింది. ఆ సమస్య కోర్టులో పడడంతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మూల వేతనాన్ని కాంట్రాక్ట్ ఉద్యోగులకు అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 10వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వడంతో అప్పటివరకు రూ.18 వేలకు పనిచేసిన కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనం రూ.37,100కు పెరిగింది. దీంతో రెగ్యులర్ ఉద్యోగులతో సమానమైన వేతనం పొందుతూ వచ్చారు. గురువారం ప్రభుత్వం 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచుతూ జీఓ105 ద్వారా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో ఉద్యోగికి ప్రస్తుతం వేతనం రూ.54,220కు పెరిగింది. చదవండి: తెలంగాణలోనూ నాడు-నేడు -
కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి
చేవెళ్ల: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరించే ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేష్కుమార్ తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వచ్చేనెలలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమం పోస్టర్‌ను మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఆవిష్కరించారు. అనంతరం సంఘం కార్యకలాపాలు, భవిష్యత్‌లో అనుసరించబోయే కార్యాచరణపై విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్‌చేశారు. ఆలోగా తక్షణమే 10వ పే రివిజన్కమిషన్ ప్రకారం బేసిక్‌పే, డీఏను చెల్లించాలని తెలిపారు. తెలంగాణ ఏర్పడి , టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఉద్యోగాలను క్రమబద్ధీకరించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు వినాయక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వసంతరావు మాట్లాడుతూ..తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, న్యాయమైన తమ డిమాండ్లను నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు మురళీకృష్ణ, నాగమల్లేశ్వరి, రజిత, శోభ, పండరి పాల్గొన్నారు.