►నేడు ఉద్యోగుల చలో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయశాఖలో పదోన్నతుల చిచ్చు రేగుతోంది. రాష్ట్రంలోని ఐదో జోన్, ఆరో జోన్ ఉద్యోగుల్లో కొందరికి తక్కువగా, మరికొందరికి ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వివాదం రగులుకుంటోంది. 371 (డి) నిబంధన కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని... ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీనివల్ల ఆరో జోన్‌లోని వారు ఆరేళ్లకే పదోన్నతులు పొందుతుండగా... ఐదో జోన్‌కు చెందినవారు పదేళ్లయినా పదోన్నతులు పొందలేకపోతున్నారని అంటున్నారు.
దీంతో తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని ఐదో జోన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితిని సరిదిద్దాలని కోరుతూ ఐదో జోన్‌కు చెందిన నాలుగు జిల్లాల వ్యవసాయశాఖ ఉద్యోగులు బుధవారం చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. దాదాపు 200 మంది వరకు హైదరాబాద్ తరలివచ్చి వ్యవసాయశాఖ డెరైక్టర్‌కు వినతిపత్రం ఇవ్వనున్నారు.