అంగన్‌వాడీల ‘చలో హైదరాబాద్’ భగ్నం
- బస్సులను అడ్డుకున్న పోలీసులు
- అర్ధరాత్రి ఆందోళనలకు దిగిన కార్యకర్తలు
ఖమ్మం, న్యూస్‌లైన్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అసెంబ్లీ ముట్టడికి హైదరాబాద్ తరలి వెళుతున్న అంగన్‌వాడీలకు ఆటంకాలు ఎదురయ్యాయి. అంగన్‌వాడీ కార్యకర్తలు, సీఐటీయూ నాయకురాళ్లను సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా కొణిజర్ల, కూసుమంచి, కొత్తగూడెం, ఖమ్మం అర్బన్, అశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాల్లో పోలీసులు అడ్డుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, మారేడుమల్లి క్లస్టర్, కృష్ణాజిల్లా తిరువూరు క్లస్టర్ నుంచి సుమారు 500 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఆర్టీసీ బస్సుల్లో బయలుదేరారు. వారి బస్సులను వైరా సి.ఐ. దేవేందర్ రెడ్డి నేతృత్వంలో కొణిజర్ల, వైరా ఎస్.ఐ.లు పి.కరుణాకర్, బి.విక్రమ్‌లు కొణిజర్ల పోలీస్ స్టేషన్ ఎదుట సోమవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో నిలిపివేశారు. దీన్ని నిరసిస్తూ అంగన్‌వాడీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట రాష్ట్రీయ రహదారిపై బైఠాయించారు.
సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చివరికి వారు అవే బస్సుల్లో వెనుదిరిగారు. అదేవిధంగా కూసుమంచి పోలీస్‌స్టేషన్, నాయకన్‌గూడెం వద్ద ఏర్పాటు చే సిన చెక్‌పోస్టుల వద్ద హైదరాబాద్‌కు బస్సులు, డీసీఎం, మినీ వ్యానుల్లో వెళుతున్న కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన సుమారు 200 మంది, ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లను పోలీసులు అడ్డుకున్నారు.
అంగన్‌వాడీలు కూసుమంచి పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించగా, నాయకన్‌గూడెం వద్ద రాస్తారోకో చేపట్టి నిరసనను వ్యక్తం చేశారు. చివరకు పోలీసులు ఆందోళనకారులను వాహనాల్లో ఎక్కించి బలవంతంగా వెనక్కి పంపించివేశారు. ఇలా హైదరాబాద్‌కు తరలి వెళ్తున్న ఇతర జిల్లాలు, ఖమ్మం జిల్లాలకు చెందిన వారిని అశ్వారావుపేటలో 200 మంది, ఖమ్మం అర్బన్‌లో 300 మంది, ఖమ్మం రూరల్‌లో 50 మంది, కొణిజర్లలో 50 మంది, కూసుమంచిలో 400 మంది, కొణిజర్లలో 1200 మందిని, పెనుబల్లిలో 500 మంది, సత్తుపల్లిలో 300 మందిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
విధిలేక తిరిగొచ్చాం..
విస్సన్నపేట : ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్.ఐ. దుందుడుకు చర్యతో వెనుతిరగాల్సి వచ్చిందని అంగన్‌వాడీ వర్కర్ల ప్రాజెక్టు లీడర్ హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళుతుండంగా కొణిజర్ల పోలీస్ స్టేషన్ వద్ద తమ వాహనాలను ఆపి మీది కాని ప్రాంతంలో మీకు సెక్యూరిటీ ఎక్కడ ఇవ్వగలం..వెనక్కి వెళ్లిపోండి అంటూ ఎస్.ఐ. దురుసుగా ప్రవర్తించారన్నారు. బస్సు నిలిపివేయడంతో నాలుగు కిలోమీటర్లు నడిచామన్నారు. బస్సు డ్రైవర్‌ను కూడా నిర్బంధించడంతో వెనుతిరగాల్సి వచ్చిందని, తిరువూరు వచ్చేవరకు తమ వెంట కానిస్టేబుళ్ళను కూడా పంపారన్నారు. ఒక భాద్యతాయుతమైన ఎస్.ఐ. ఈ విధంగా ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.