శివారు చేలు...నైస్తున్నాయ్ | Oh ... naistunnay suburbs | Sakshi
Sakshi News home page

శివారు చేలు...నైస్తున్నాయ్

Published Fri, Mar 7 2014 1:30 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

శివారు చేలు...నైస్తున్నాయ్ - Sakshi

శివారు చేలు...నైస్తున్నాయ్

  • సాగునీరందక అన్నదాత కష్టాలు
  •  పది రోజులుగా విడుదల కాని నీరు
  •  దిగుబడి తగ్గిపోతుందంటున్న రైతులు
  •  శివారు ప్రాంతాల్లో చేలన్నీ నోళ్లు తెరుస్తున్నాయ్.. పదిరోజులుగా పొలాలకు నీరందక.. పంట దక్కే పరిస్థితి కానరాక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పెట్టుబడులు కూడా రాదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.
     
    మచిలీపట్నం, న్యూస్‌లైన్ : దాళ్వా సాగులో అన్నదాతకు అన్నీ కష్టాలే మిగులుతున్నాయి. సాగునీరు సక్రమంగా అందకపోవటంతో ఎన్నో ఆశలతో వరిసాగు చేసిన రైతులకు నిరాశే మిగిలే పరిస్థితి దాపురించింది. సాగునీటిని విడుదల చేయండి మహాప్రభో అంటూ రైతులు చేస్తున్న మొర నీటి పారుదల శాఖాధికారులకు పట్టడం లేదు. రేపు, మాపు అంటూ అధికారులు  చెప్పటమే తప్ప కాలువల్లో నీటిమట్టం పెరిగిన దాఖలాలు లేవు.

    శివారు ప్రాంతాల్లోని పొలాల్లో పైరు ఎండిపోతున్నా చుక్కనీరు విడుదల చేసేందుకు అధికారులు చొరవ చూపకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల ఎకరాల్లో రబీలో వరిసాగు జరగాల్సి ఉంది. సాగునీటి విడుదలలో జాప్యం కారణంగా 2.65 లక్షల ఎకరాల్లోనే వరిసాగు జరిగింది. నాలుగు రోజుల పాటు నీరు ఇవ్వటం, పది రోజుల పాటు ఇవ్వకపోవటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సకాలంలో సాగునీరు విడుదల కాకుంటే ఈ ప్రభావం దిగుబడులపై పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
     
    పది రోజులుగా విడుదల కాని నీరు...
     
    సముద్రతీరంలోని కోడూరు, నాగాయలంక, బందరు, పెడన, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో దాళ్వా పంటను సాగు చేశారు. కోడూరు, నాగాయలంక మండలాలకు కేఈబీ కాలువ ద్వారా సాగునీరు అందాల్సి ఉంది. కోడూరు మండలంలోని ఊటగుండం, మందపాకల, పోటుమీద గ్రామాలకు కాలువల ద్వారా సక్రమంగా నీరు అందకపోవటంతో పొలాలు నెర్రెలిచ్చాయి. బుధవారం నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాసరావు, ఈఈ గంగయ్య ఊటగుండం గ్రామానికి వచ్చారు. అక్కడున్న పరిస్థితులను చూసి.. పొలాలు నెర్రెలిచ్చి కనపడటంతో మారు మాట్లాడకుండా వెళ్లిపోయారని రైతులు చెబుతున్నారు.

    గురువారం కోడూరు ప్రధాన కాలువలో కొంతమేర నీటి మట్టం పెరిగినా శివారు ప్రాంతాలకు ఇంకా నీరు చేరలేదని ఊటగుండం, పోటుమీద గ్రామాల రైతులు చెబుతున్నారు. బందరు మండలంలోని పెదయాదర, తుమ్మలచెరువు, తుమ్మలపాలెం, వాడగొయ్యి, చిన్నాపురం తదితర ప్రాంతాలకు 9/8, 9/7, 9/6, 9/5, 9/3 కాలువల ద్వారా సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. ఈ కాలువలన్నింటికి తొమ్మిదో నంబరు ప్రధాన కాలువ ద్వారా నీరు విడుదల కావాల్సి ఉంది. గత పది రోజులుగా ప్రధాన కాలువలో నీటి మట్టం పడిపోవటంతో అన్ని గ్రామాల్లోని పొలాలూ నెర్రెలిచ్చి దర్శనమిస్తున్నాయి.

    అధికారులకు రైతులు ఫోన్ చేసి సాగునీరు విడుదల చేయాలని కోరితే సాయంత్రానికి కాలువ మట్టం పెరుగుతుందని చెప్పటమే తప్ప ఆచరణలో జరగటం లేదని రైతులు వాపోతున్నారు. పది రోజుల పాటు పొలానికి నీరు అందకుంటే ఈ ప్రభావం దిగుబడిపై పడి ఖర్చులు కూడా రావని రైతులు చెబుతున్నారు. బంటుమిల్లి మండలంలోని సాతులూరు, ముంజులూరు, పెదతుమ్మిడి గ్రామాల్లో సాగునీటి ఎద్దడి అధికంగా ఉంది. కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం లాకుల వద్ద ఐదు అడుగుల నీటి మట్టం ఉంటే శివారు ప్రాంతాలకు సాగునీరు అందుతుంది.

    ఈ లాకుల వద్ద కేవలం మూడడుగుల నీటి మట్టం ఉండటంతో చివరి భూములకు సాగునీరు అందటం లేదు. కృత్తివెన్ను మండలంలోని గరిసిపూడి, చందాల, దోమలగొంది, లక్ష్మీపురం, చినపాండ్రాక తదితర గ్రామాల్లో పొలాలు నెర్రెలిచ్చాయి. ప్రధాన కాలువల్లోనే నీటి మట్టం తగ్గిపోవటంతో రైతులు పంటను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజన్లను వాడుతున్నారు. ఉన్న కొద్దిపాటి నీటిని ఆయిల్ ఇంజన్ల ద్వారా మళ్లిస్తుండటంతో దిగువకు నీరు చేరని పరిస్థితి నెలకొంది.

    దీనికి తోడు ఎగువ ప్రాంతాల రైతులు నీటిపారుదలశాఖ అధికారులు, సిబ్బందిని తమ దారిలోకి తెచ్చుకుని ప్రధాన కాలువలకు అడ్డుకట్టలు వేసి నీటిని దిగువకు వెళ్లకుండా దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం వరి పైరు చిరుపొట్ట, పొట్టదశలో ఉందని ఈ సమయంలో పైరుకు నీరు అందకుంటే కంకులు లోపలే అవిసిపోతాయని రైతులు చెబుతున్నారు. దాళ్వాకు ఎకరానికి ఇప్పటికే రూ.15 వేలకు పైగా ఖర్చు చేశామని నీరు విడుదల చేయకుంటే ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని ఆవేదన చెందుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement