పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం
- సార్వత్రిక ఎన్నికల్లో కొనసాగుతున్న రాజకీయం
- అభ్యర్థులందరిదీ అదే దారి
సాక్షి, మచిలీపట్నం : ముందు జనం.. వెనుక జనం.. జెండాలు పట్టుకుని జైజైలు.. నడుమ అభ్యర్థి అందరికి నమస్కరిస్తూ తనకు ఓటేసి గెలిపించాలని వినయపూర్వకంగా విజ్ఞప్తులు ఇదీ ఎన్నికల ప్రచారంలో మన కళ్లముందు కదలాడే దృశ్యం. సీన్ కట్ చేస్తే మనకు తెలియకుండా గంప గుత్తగా ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు తెరవెనుక ప్రయత్నాలు చాలానే చేస్తారు. గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకులు, పార్టీల ప్రముఖులు ఇలా పది ఓట్లు రాలే అవకాశం ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థినీ కలిసి మంత్రాంగం నెరపే ట్రెండ్ పుంజుకుంది.
గతంలో రాజకీయంగా అనుభవం, వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన కొందరు నేతలు మాత్రమే ఈ తరహా పద్ధతిలో రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. గతంలో కొందరు సెట్ చేసిన ఈ తరహా ట్రెండ్‌ను ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి అభ్యర్థీ అనుసరిస్తున్నారు. పగలు ప్రచారం నిర్వహించే అభ్యర్థులు ఎంత అలిసిపోయినా రాత్రి వేళ ఓపిక తెచ్చుకుని గుట్టుచప్పుడు కాకుండా పలు ప్రాంతాల్లో పర్యటించి పలువురిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోను పలువురు అభ్యర్థుల గెలుపుకోసం పట్టుదలగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు శక్తివంచన లేకుండా ప్రచారం నిర్వహిస్తునే మరోవైపు శక్తికి మించి ఖర్చు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే తాపత్రయంతో ఎన్నికల ప్రచారానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతకంటే ఎక్కువగా రాత్రివేళ సమీకరణలకు పావులు కదుపుతున్నారు.
ఇప్పటికే పార్టీల వారీగా ఓటర్లు, కార్యకర్తలు, అభిమానులు డిసైడ్ అయిపోవడంతో తటస్థుల ఓట్లపై అభ్యర్థులు దృష్టి సారించారు. ఇందుకోసం కీలకమైన తటస్థ ఓటర్లను రాత్రివేళ కలిసి వారితో గంటల కొద్దీ గడిపి తమ గెలుపుకోసం వారు పాటుపడేలా మాట తీసుకుంటున్నారు. మరోవైపు ఎదుటి పార్టీల్లో అసంతృప్తులను, అసమ్మతిని ఎప్పటికప్పుడు డేగ కళ్లతో పసిగడుతూ వాటిని తమకు అనుకూలంగా తిప్పుకొనేలా అభ్యర్థులు వ్యూహరచన చేస్తున్నారు.
పార్టీల్లో అసమ్మతి వాదులకు సొంత పార్టీ నేతలు రాత్రివేళ వెళ్లి బుజ్జగింపులు చేస్తుంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు సైతం రాత్రివేళే వారిని తమ దారికి తెచ్చుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కీలక వ్యక్తులు, ప్రముఖ నేతలను పగటిపూట కలిస్తే అనుమానాలకు అవకాశం ఉంటుందని, తద్వారా ఓటు బ్యాంక్ చెదిరిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అభ్యర్థులు రాత్రి మంత్రాంగానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
నాకు మద్దతు ఇచ్చి నా గెలుపు కోసం మీ వంతు సాయం అందిస్తే ఎప్పుడూ మీకు అండగా ఉండి ఏ పని కావాలన్నా చేసిపెడతానంటూ అభ్యర్థులు వ్యక్తిగత హామీలు ఇస్తూ గెలుపు మంత్రం కోసం తపిస్తున్నారు. మొత్తానికి అభ్యర్థులు పగలు ప్రచారం.. రాత్రి మంత్రాంగం ముమ్మరం చేయడంతో ఎవరి ధీమాలో వారు ఉండటం కొసమెరుపు.