కాస్త ఊపిరాడేలా, కొద్దిగా గాలీ–వెలుతురూ వచ్చేలా..కూసంత ‘‘సౌకర్యంగా’’ ఉండే ఓ గుడారాన్ని అడుగుతాడు ఓటరు. ఈ ‘సౌకర్యం’ అనే మాట ఏలినవారికి ‘విశాలం’ అనేలా ధ్వనిస్తుంది. ‘కోర్కెలు అనంతాలూ..వనరులు పరిమితాలు’ అనే ఎకనమిక్స్ సిద్ధాంతం ఇటు ఓటరుకూ, అటు పాలించేవారికీ అడ్డుపడుతుంది.గుడారం సైజు పెంచలేం. కాబట్టి దాంట్లోకి ఒంటెను వదలమంటారు ప్రభువులవారు. ఒక్కసారిగా కాదు. మెల్లమెల్లగా. మొదట తల, మెడ, తర్వాత సగం వరకు..అటు పిమ్మట మొత్తం ఒంటె దేహాన్ని. ఆ పైన ఒంటెను కొద్దిగా బయటకు తెచ్చినా..ఆ చర్య ఇచ్చే కాస్తంత వెసులుబాటూ ఎంతో గొప్పగా, మరెంతో ‘విశాలం’గా, ఇంకెంతో ‘సౌకర్యంగా’ అనిపిస్తుంటుంది. ఇదీ ఒంటె సిద్ధాంతం.
ఈ సిద్ధాంతం అన్నది ఆల్వేస్ బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతుందని కనిపెట్టినవారు రాజకీయవేత్తలే. అందుకే ‘సైంటిస్టు’ల సంక్లిష్ట సూత్రాల కన్నా..మన పొలిటికల్ లీడర్ల ప్రాక్టికల్ సిద్ధాంతాలే మిన్న. ఈ సిద్ధాంతం అమల్లో కేంద్రంలోని పాలకులు ఇంకా గ్రేట్. వారు ఒకటీ, అరా కాకుండా ఏకంగా రెండుమూడు ఒంటెల్ని గుడారంలోకి ఒకేసారి ప్రవేశపెడతారు. వాటితో చాలాసేపు సహజీవనం చేయిస్తారు. ఆ తర్వాత ఒక్క ఒంటెను కాస్తంత బయటకు తెచ్చినా చాలు..అదే పదివేలు అనేలా సర్దుకుపోతాడు ఓటరు.
కేంద్రంలోని పాలకులు ఈ ఒంటె సిద్ధాంతాన్ని అనేక విషయాల్లో అమలు చేస్తున్నారూ..చేస్తుంటారు. అన్నీ చెప్పుకోవడం కుదరదు కదా. మచ్చుకు గ్యాస్ సిలిండరును ఉదాహరణగా తీసుకుందాం. దాదాపు రూ.400 దగ్గరున్న సిలెండరు చకచకా రూ.1200 వరకు వెళ్తుంది. కానీ ఎన్నికలప్పుడు కేవలం రూ.200 మాత్రమే తగ్గుతానంటుంది.
ఘనత వహించిన బీఆర్‌ఎస్‌వారు ఒంటె సిద్ధాంతానికి బ్రహ్మాండమైన ఓ విరుగుడు కనిపెట్టారు.
వారి వాగ్దానం ప్రకారం... సిలిండర్ ధరను ఒకేసారి పదేళ్ల కిందటి ధరకు నెడతామంటున్నారు. దాంతో జేబుగలిగిన ప్రతి మారాజుకూ, కిచెన్ గలిగిన ప్రతి మహారాణికీ ఒక్కసారిగా ఎంతో భారం తొలగుతుందీ. మరెంతో భాగ్యం కలుగుతుంది. టైమ్–మెషీన్‌లో ఒకేసారి పదేళ్ల వెనక్కు వెళ్లడమంటే మాటలా! ప్రజలందరికీ మూకుమ్మడిగా పదేళ్ల కిందినాటి వయసూ, యౌవనమూ, పదేళ్ల కిందటి విగరూ, పొగరూ పునర్–ప్రాప్తించిన ఫీలింగ్ కలగదా?
విగరూ, పొగరూ పాలితులకూ!... ‘పవరు’పాలకులకు!! చదరంగంలో ‘గుర్రం’ స్టెప్పు ఒకటుంటుంది. దాన్ని ప్రయోగిస్తే..ఏకకాలంలో అది రెండు ‘ఫోర్సు’లకు ఎసరు పెడుతుంది. ఇక్కడ సిద్ధాంతపు ‘ఒంటె’ సిద్ధాంతాన్ని దెబ్బకొట్టడానికి ‘గుర్రం’ స్టెప్పు వేశారు..వ్యూహాల్లో దిట్ట అయిన కేసీఆర్‌వారు.
ఒక్క దెబ్బకు మూడు పిట్టలు.
ఒక పిట్ట..కేంద్రంలో గ్యాస్ సిలిండరు ధరను మూడు రెట్లు పెంచేసిన పార్టీ! మరో పిట్ట..పొరుగు రాష్ట్రంలోలా ఇక్కడా మహిళా సోదరీమణుల్ని బస్సుల్లో ఉచితంగా తిప్పాలనుకుంటున్న పార్టీ. ఎప్పుడో ఓసారి చేసే ‘ప్రయాణం’ కంటే రోజూ కిచెన్‌లో చేసే ‘వంట’కే కదా ప్రయారిటీ!! ఇక... మూడో పిట్ట గురించి వేరే చెప్పాలా..ఇతర పిట్టలు తప్పించుకున్నా..ఇప్పటికిప్పుడు వేటకూ, వేటుకూ గురితప్పకుండా గురయ్యే ‘ఓటరు’ పిట్ట!!!
Comments
Please login to add a commentAdd a comment