మెదక్: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవద్దని కోరుతూ బీఆర్‌ఎస్ శ్రేణులు మంత్రి హరీశ్‌రావును కలసి విజ్ఞప్తి చేశాయి. సుమారు రెండొందల మంది ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసానికి వెళ్లి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన జగ్గారెడ్డి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, గత ఎన్నికల్లో బోగస్ హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన నియోజకవర్గం ప్రజలను కూడా మోసం చేశారని ఆరోపించారు.
అలాంటి వారిని పార్టీలోకి తీసుకోవద్దని కోరారు. నాలుగున్నరేళ్లు ఏనాడు నియోజకవర్గం ప్రజలను పట్టించుకోని జగ్గారెడ్డిని చేర్చుకుంటే పార్టీకి నష్టం జరుగుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రానున్న ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కే కేటాయించాలని కోరారు. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఆయన ప్రజల్లో ఉంటున్నారని, నియోజకవర్గ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
చింతప్రభాకర్‌కు టిక్కెట్ ఇస్తే.. పార్టీ శ్రేణులంతా కలిసి గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతానని మంత్రి హరీశ్ అన్నట్లు పార్టీ ముఖ్యనాయకులు పేర్కొంటున్నారు. హరీశ్‌రావును కలిసిన వారిలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నియోజకవర్గంలోని అన్ని మండలాల జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు కమిటీ నేతలు, ద్వితీయ శ్రేణినాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
గతంలో ఏకగ్రీవ తీర్మానం..
జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని కోరుతూ నెల రోజుల క్రితం సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ముఖ్యనేతలంతా సంగారెడ్డిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాలులో సమావేశమైన విషయం విదితమే. జగ్గారెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని అప్పట్లో ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు. త్వరలోనే జగ్గారెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా కలసి మంత్రి హరీశ్‌రావు వద్దకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment