సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీల పొత్తుకు మార్గం దాదాపుగా సుగమమైంది. మునుగోడులో వామపక్షాలతో జతగట్టినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకే బీఆర్‌ఎస్ మొగ్గుచూపింది. బీఆర్‌ఎస్‌తో బ్రేకప్ నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలు ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేశాయి. కాంగ్రెస్ జాతీయ స్థాయి నేతలతో జరిపిన సంప్రదింపులు దాదాపు సక్సెస్ అయినట్లేననే సంకేతాలు వెలువడుతున్నాయి.
ఏఐసీసీ నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడిన ఇండియా కూటమిలో వామపక్షాలు సైతం భాగస్వాములుగా ఉండడంతో రాష్ట్రంలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తుపై సానుకూలతకు పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. అయితే తమకు కేటాయించే సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చిన తర్వాతే ఈ విషయంలో మరింత ముందుకెళ్లాలనే ఆలోచనలో లెఫ్ట్ పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్‌ను సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొత్తు, సీట్లు చర్చకు వచ్చినట్లు సమాచారం.
చెరో ఐదు సీట్లు ఇవ్వండి
పొత్తుకు కాంగ్రెస్ ప్రాథమికంగా సమ్మతించినప్పటికీ సీట్ల విషయాన్ని తేల్చలేదు. అయితే సీపీఐ, సీపీఎంలు చెరో ఐదు సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ వద్ద ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం. సీపీఐ నేత నారాయణ తాము ఐదు స్థానాల్లో పోటీ చేస్తామని, కొత్తగూడెం, వైరా, హుస్నాబాద్, బెల్లంపల్లి, మునుగోడు స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉందని పేర్కొన్నట్లు సమాచారం.
అయితే తాము అత్యంత బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు సీట్లను కేటాయించడాన్ని కాంగ్రెస్ కొంత ఇబ్బందికరంగా భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. సీపీఎం సైతం ఐదు సీట్లలో పోటీ చేస్తామంటోంది. భద్రాచలం, పాలేరు, మిర్యాలగూడ, మధిర, ఇబ్రహీంపట్నం స్థానాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు, ఈ మేరకు ఠాక్రేతో ఫోన్‌లో సీపీఎం నేతలు మాట్లాడినట్లు తెలిసింది. కాగా సీట్ల విషయంలో స్పష్టత వచ్చిన తర్వాతే చర్చలు కొనసాగించాలని వామపక్ష పార్టీలు నిర్ణయానికి వచ్చాయని సమాచారం.
కాంగ్రెస్ తర్జనభర్జన!
వామపక్ష పార్టీల ప్రతిపాదనల నేపథ్యంలో.. వారికి ఎక్కడెక్కడ సీట్లు కేటాయించాలనే అంశంపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ పార్టీ అధిష్టానం మాత్రం క్షేత్రస్థాయిలో నాయకత్వం అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాల వారీగా కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment