పింఛన్ వస్తుందా? | sunitha mahender reddy meet to peoples as Sakshi VIP Reporter | Sakshi
Sakshi News home page

పింఛన్ వస్తుందా?

Published Mon, Nov 24 2014 12:30 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

పింఛన్ వస్తుందా? - Sakshi

పింఛన్ వస్తుందా?

‘హైదరాబాద్ నగరానికి సురంగల్ సమీపంలో ఉన్నప్పటికీ ఆశించినంతగా అభివృద్ధి చెందలేదనేది వాస్తవం. ఉపాధ్యాయుడి నియామకం, రైతుల పొలాల వద్దకు ఫార్మేషన్ రోడ్లు, జిల్లా పరిషత్ నిధుల నుంచి గ్రామాలను కలిపే అప్రోచ్ రోడ్లు, అంగన్‌వాడీ భవనం, విద్యార్థుల సమయానికి అనుగుణంగా అదనంగా బస్సులను వేయించడం, రోడ్ల రీ బీటీకి నిధులు కేటాయిస్తా. అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పించడానికి ప్రయత్నిస్తా. ఇళ్లులేని వారికి కొత్త ఇళ్లను మంజూరు చేయిస్తా. త్వరలోనే అంగన్‌వాడీ భవనాన్ని మంజూరు చేయిస్తా. నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యనూ అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి కృషిచేస్తా.’
 
అవ్వా.. బాగున్నావా.. తాతా పింఛన్ వస్తోందా.. అంటూ పలకరింపులు. పిల్లలూ.. మధ్యాహ్నం భోజనం సరిగా పెడుతున్నారా.. అంటూ వాకబు. గ్రామమంతా కలియతిరుగుతూ సమస్యలన్నీ నోట్ చేసుకుంటూ జెడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామవాసులతో మమేకమయ్యారు. ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా గ్రామంలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా సమస్యలే స్వాగతం పలికాయి. ప్రజల నుంచి ఆమె పలు వినతులు స్వీకరించారు. గ్రామంలోని పాఠశాల నుంచి మొదలుకుని వృద్ధుల పింఛన్ల వరకు.. అన్ని సమస్యలనూ సావధానంగా విన్న ఆమె.. వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చారు.
 
చైర్‌పర్సన్: అవ్వా నీ పేరేంది.. పింఛన్ వస్తుందా?
వృద్ధురాలు: నా పేరు పోచమ్మ. ఇంతకుముందు పింఛన్ వచ్చేది. మధ్యలో ఆగిపోయింది.
చైర్‌పర్సన్: ఎందుకు ఆగిపోయింది.. అధికారులను అడిగావా?
పోచమ్మ: చాలాసార్లు అడిగానమ్మా.. ఎందుకు ఇస్తలేరో వాళ్లేం చెప్తలేరు. నువ్వయినా చెప్పి పింఛన్ ఇప్పించమా..
చైర్‌పర్సన్: అమ్మా బాగున్నవా.. ఏం సమస్యలున్నాయి?
విజయలక్ష్మి: బాగున్న మేడమ్. గ్రామానికి కొంత దూరంలో ఉన్న కాలనీలో నీటి సమస్య ఉంది. పైపులైన్లు సరిగాలేవు. వాటర్‌ట్యాంకు లేదు. కాలనీలో రోడ్డు కూడా సరిగా లేదే.
చైర్‌పర్సన్: నువ్వు చెప్పమ్మా. రేషన్ సరిగా ఇస్తున్నారా?
రాములమ్మ: నాకు రెండు కాళ్లు నడవడానికి రావు. అంబాడుతూ నడుస్తా. మూడు నెలల నుంచి రేషన్ బియ్యం ఇస్తలేరు. ఆధార్ కార్డు లింకు కాలేదంటున్నరు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చిన. అయినా రేషన్ బియ్యం ఇస్తలేరు.
చైర్‌పర్సన్: అధికారులకు చెప్పి రేషన్ బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తా. మరి నీకు పింఛన్ వస్తుందా?
రాములమ్మ:ఐదు వందలు వస్తుందమ్మా. ఇప్పుడింకా రాలేదు.
చైర్‌పర్సన్: ఇప్పటినుంచి ఎక్కువొస్తుంది. అధైర్యపడకు. ఆ.. పెద్దాయనా.. నీపేరేంది?
పెద్దాయన: వెంకట్‌రెడ్డి
చైర్‌పర్సన్: వ్యవసాయానికి కరెంటు ఎలా వస్తోంది?
వెంకట్‌రెడ్డి: అమ్మా రోజుకు ఆరు గంటలు ఇస్తున్నామంటున్నరు. కాని అది రాత్రి సగం, పగలు సగం ఇవ్వడంతో పంటలకు నీళ్లు పారపెట్టలేకపోతున్నం.
చైర్‌పర్సన్: పంటలు ఎండుతున్నాయా?
వెంకట్‌రెడ్డి: వర్షాలు సరిగా పల్లేదు. ఇప్పుడు కరెంటు సరిగా లేక పంటలు ఎండుతున్నయి.
చైర్‌పర్సన్: మరి కరెంటు బిల్లులు సరిగా కడుతున్నారా?
వెంకట్‌రెడ్డి: వ్యవసాయ బోర్ల సర్వీస్ చార్జీలను ఇంటి బిల్లులతో కలిపే వేస్తున్నారు. ఆ బిల్లులు చెల్లిస్తున్నాం. కానీ ఇచ్చే ఆరు గంటల కరెంటు ఒకే సమయంలో నిరంతరాయంగా ఇస్తే మంచిది.
చైర్‌పర్సన్: అన్నా.. నువ్వుజెప్పు ఏం సమస్యలున్నయ్?
నర్సింహ: గ్రామంలో చాలా సమస్యలున్నాయమ్మా. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సరిగాలేదు. మొయినాబాద్- సురంగల్ రోడ్డు పూర్తిగా గుంతలు పడింది. రోడ్డుపై వాహనాలు నడపలేని పరిస్థితి ఉంది.
చైర్‌పర్సన్: చెప్పండి ఇంకా ఏమి సమస్యలున్నాయి?
జైపాల్‌రెడ్డి: మా ప్రాంతంలో రైతులకు ప్రధాన సమస్య 111 జీఓ. ఈ జీఓ వల్ల మా భూములకు విలువ లేకుండా పోయింది. పక్కనే ఉన్న రాజేంద్రనగర్ మండలంలో భూములు కోట్ల విలువ చేస్తుంటే. ఇక్కడ మాత్రం కనీసం 5 లక్షలు కూడా ధరలేదు.
చైర్‌పర్సన్: ఈ సమస్యను చాలా రోజులుగా
ఎదుర్కొంటున్నట్టున్నారు?
జైపాల్‌రెడ్డి: ఇంచుమించు ఇరవై ఏళ్లుగా ఈ జీఓ సమస్య ఉంది.  
చైర్‌పర్సన్: ఏం పాపా నీ కళ్లు కనిపించవా?
సువర్ణ: మేడమ్ నా కళ్లు కనిపించవు. నాకు పింఛన్ సరిగా ఇస్తలేరు. ఒక నెల ఇస్తే రెండు మూడు నెలలు ఆపేస్తున్నారు.
చైర్‌పర్సన్: కళ్లు ఎప్పుడు, ఎలా పోయాయి.. చదువుకున్నావా?
సువర్ణ: 9వ తరగతి వరకు చదివాను. 9వ తరగతిలోనే బెంచీ తగిలి కన్నుపోయింది. ఆపరేషన్ చేశారు. అయినా చూపురాలేదు.
చైర్‌పర్సన్: ఆస్పత్రిలో ఇచ్చిన రిపోర్టులున్నాయా..
పింఛన్‌కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నావా?
సువర్ణ: ఆస్పత్రిలో రిపోర్టులు ఏమీ ఇవ్వలేదు. పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పుడైనా వస్తుందా?
చైర్‌పర్సన్: తప్పకుండా నీకు పింఛన్ వచ్చే విధంగా చూస్తానమ్మా. బాబు నీవు చెప్పు సమస్యలేమున్నయ్?
ఎండీ.షఫీ: ఆఫీసుల్లో లీడర్లు చెబితేనే పనులవుతున్నాయి. ప్రజలు స్వయంగా వెళ్లి అడిగితే అధికారులు పనులు చేయడంలేదు. మొన్ననే బాలల దినోత్సవం జరుపుకొన్నాం. పాఠశాలల్లో చదివే పిల్లలకే బాలల దినోత్సవమా? హోటళ్లు, కిరాణ షాపులు, మెకానిక్ షాపులు, రోడ్లపై చెత్త కాగితాలేరుకునే పిల్లలకు బాలల దినోత్సవం లేదా? ఈ పిల్లలందర్నీ అధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్లు బాల కార్మికులుగానే మిగులుతున్నారు.
చైర్‌పర్సన్: అలాంటి వారిని హాస్టళ్లలో చేర్పించి చదివిం చేలా అధికారులకు చెప్తాను. ఇంకా ఏం సమస్య ఉంది?
ఎండీ.షఫీ: మైనార్టీలకు శ్మశానవాటిక లేదు.
చైర్‌పర్సన్: మైనార్టీ వె ల్ఫేర్ నుంచి ఏర్పాటు చేయిస్తాం. నువ్వు చెప్పమ్మ.. అందరూ మరుగుదొడ్లు నిర్మించుకున్నారా? మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.9 వేలు ఇస్తుంది.
సునీత: కొంతమంది కట్టుకున్నారు. రెండు గుంతలు తీసి మరుగుదొడ్డి కడితేనే పైసలు వస్తయంటున్నారు. జాగలు లేక శానమంది ఒక గుంతనే తీస్తున్నారు.
చైర్‌పర్సన్: తమ్ముడూ ఇంక ఏమి సమస్యలున్నాయో నువ్వు చెప్పు?
రాజు: ఎస్సీ శ్మశానవాటిక వద్ద బోరు, ట్యాంకు లేదు. సు రం గల్- అమ్డాపూర్, సురంగల్- నజీబ్‌నగర్ గ్రామాలకు లింకురోడ్డు వేస్తే రైతులకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది.
చైర్‌పర్సన్: జిల్లా పరిషత్ నిధుల నుంచి రెండు లింకురోడ్డులకు ఐదు లక్షల చొప్పున ఇస్తాం. అదే విధంగా శ్మశానవాటిక వద్ద బోరు, వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేయిస్తాం.చెప్పమ్మా నీవేం చేస్తున్నావ్?
శోభ: 9నెలల క్రితం నా భర్త చనిపోయాడు మేడమ్. చిన్న పిల్లలున్నారు. నాకు ఏదైనా పని ఇప్పించండి మేడమ్.
చైర్‌పర్సన్: ఏం పనిచేస్తావ్?
శోభ: ఏ పనైనా చేస్తాను మేడమ్.
చైర్‌పర్సన్: హౌస్‌కీపింగ్ పని చేస్తావా?
శోభ: చేస్తాను మేడమ్.
చైర్‌పర్సన్: పాప నువ్వుచెప్పు మీ స్కూల్‌లో ఏం సమస్యలున్నాయి?
లావణ్య: ఒక్క సారే ఉన్నడు. ఇంక ఇద్దరు టీచర్లు కావాలి. స్కూల్లో తాగడానికి నీళ్లులేవు. బాత్‌రూంలు లేవు. ప్రహరీ  కూలిపోయింది.
చైర్‌పర్సన్: పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.2 లక్షలు ఇస్తాం. టీచర్లను ఏర్పాటు చేస్తాం. నువ్వు ఏం చదువుతున్నావు పాపా?
అఖిల: ఐదో తరగతి చదువుతున్నా మేడమ్.
చైర్‌పర్సన్: మధ్యాహ్న భోజనం బాగుందా? ఏమేం వడ్డిస్తున్నారు?
అఖిల: అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు,
పండ్లు, గుడ్లు మేడమ్.
చైర్‌పర్సన్: అందరు ఇక్కడే తింటున్నారా.. కొంత మంది ఇంటికెళ్లి తింటున్నారా?
అఖిల: అందరం ఇక్కడే తింటున్నాం మేడమ్.
చైర్‌పర్సన్: మీరు అంగన్‌వాడీ టీచరా.. పిల్లలకు ఏమేం పౌష్టికాహారం ఇస్తున్నారు?
అంగన్‌వాడీ టీచర్: పప్పు, రవ్వ, గుడ్లు ఇస్తున్నాం మేడమ్. అన్నం వండి పెడుతున్నాం. చైర్‌పర్సన్: ఇక్కడే వండుతున్నారా..
పొయ్యిని రోజూ క్లీన్ చేసుకోరా?
అంగన్‌వాడీ టీచర్: రోజు క్లీన్ చేస్తున్నాం మేడమ్. అన్నం, పప్పు పొంగినప్పుడు పొయ్యిపైన పడుతుంది.
చైర్‌పర్సన్: సురంగల్ గ్రామం హైదరాబాద్‌కు చాలా దగ్గరున్నా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రోజు చాలా సమస్యలు తెలుసుకున్నాను. ఈ సమస్యలన్నీ తీర్చేందుకు కృషి చేస్తాను.
 
ప్రజల సమస్యలు పూర్తిగా తెలిశాయి..
ప్రజా సమస్యలను ఎవరి ద్వారానో తెలుసుకుంటే పూర్తి సమాచారం లభించదు. సాక్షి విలేకరిగా వచ్చి గ్రామస్తులతో నేరుగా మాట్లాడడంతో సమస్యలు పూర్తిగా తెలిశాయి. రిపోర్టర్‌గా నిజాలను నిర్భయంగా రాసి ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రికలు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తాయి. విలేకరులపై సామాజిక బాధ్యత కూడా ఎంతో ఉంది. మాకంటే ఎక్కువగా ఫీల్డ్‌లో తిరిగే విలేకరులకే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లోని మంచీ చెడులు తెలుస్తాయి. సురంగల్ గ్రామంలో సాక్షి విలేకరిగా సమస్యలను తెలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది.  
 - సునీతారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement