sunitha mahender reddy
-
కాంగ్రెస్‌లో చేరిన వెంటనే.. ఆ జెడ్పీ చైర్‌పర్సన్‌పై బీఆర్ఎస్ అవిశ్వాసం
సాక్షి,రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డిపై 12 మంది జెడ్పీటీసీ సభ్యులు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. శుక్రవారమే ఆమె కాంగ్రెస్‌లో చేరారు. ఆ మరుసటి రోజు శనివారం(ఫిబ్రవరి 17) ఆమెపై అవిశ్వాసం నోటీసు ఇవ్వడం వికారాబాద్ జిల్లా రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ మేరకు అవిశ్వాసం నోటీసును 12 మంది బీఆర్ఎస్ సభ్యులు కలిసి జెడ్పీ సీఈవోకు అందించారు. సునీతామహేందర్‌రెడ్డి బీఆర్ఎస్ నుంచే జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్పర్సన్ పదవి చేపట్టిన విషయం తెలిసిందే. ఈ అవిశ్వాసం గనుక నెగ్గితే సునీతామహేందర్‌రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ పదవి కోల్పోవాల్సి ఉంటుంది. సునీతామహేందర్‌రెడ్డితో పాటు ఆమె భర్త మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌కు రేవంత్ బర్త్ డే విషెస్ -
నా భర్త సహకారంతో ముందుకెళ్తుంటా..
2013 జనవరిలో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాలి. పిల్లల్ని పాఠశాలకు పంపించిన అనంతరం ఇద్దరం కలిసి వెళ్దామనుకున్నాం. కొంచెం అలసటగా ఉంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటానని నా భర్త మహేందర్‌రెడ్డికి చెప్పి బెడ్రూంలోకి వెళ్లి కింద పడ్డాను. తర్వాత చూస్తే హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రిలో ఉన్నా. బ్రెయిన్ ట్యూమర్‌గా తేల్చారు. మూడు రోజులకు తలకు శస్త్ర చికిత్స చేశారు. కుటుంబ సభ్యుల సహకారం, నా విల్‌పవర్ నన్ను తిరిగి ఆరోగ్యవంతురాలిగా చేసింది. ‘ఇద్దరం ప్రజా జీవితంలో ఉన్నాం.. నేను ఒక మండలానికి వెళ్తే.. నా భర్త మరో మండలం చూసుకుంటారు.. ప్రతి విషయంలో ఆయన నాకు దిక్సూచిలా ఉంటారు. ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినా.. కూర్చొని చర్చించుకుంటాం.. ఇద్దరం ఒకేమాట అనుకుంటాం.. దీంతో ఆ సమస్యకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది.. ఇక.. నేను ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది.. అది నా భర్త సహకారం వల్లే. మాకు ఇద్దరు ఆడపిల్లలు. వారి చిన్న వయస్సులో వారితో ఎక్కువ గడపలేకపోయామన్న బాధ ఇప్పటికీ ఉంది. మళ్లీ ఆ జీవితం రాదు. ఇప్పుడు వాళ్లు పెద్దవాళ్లు అయ్యారు. ఆడపిల్లంటే ఇంటి మహాలక్ష్మి అంటారు. వారు మా ఇంటి మహాలక్ష్మీలే’. అని అంటున్నారు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి. ప్రజా జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబ వ్యవహారాల్లో తన భర్త సహకారం, కుటుంబ విషయాలను ‘సాక్షి పర్సనల్టైమ్’తో పంచుకున్నారు. సాక్షి, యాదాద్రి : ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్న సమయంలో నాకు ఊహించని విధంగా ప్రజాసేవ చేసే అవకాశం లభించింది. మా వారు క్రియాశీలక రాజకీయాల్లో ఉండే వారు. నేను ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో ప్రత్యేక పరిస్థితిలో ఉద్యోగాన్ని వీడి ప్రజా జీవితంలోకి వచ్చాను. భర్త మహేందర్‌రెడ్డి ప్రోత్సాహం, ఆయన నింపిన స్ఫూర్తి వెన్ను దన్నుగా నిలుస్తోంది. బీజీ పనుల్లో అయినా కుటుంబ పరంగా చాలా జీవితాన్ని కోల్పోతున్నాం. పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయాం. ఆ జీవితం మళ్లీ రాదు. అయినా వారిని ప్రయోజకులను చేయాలన్నదే మా అభిమతం. అయితే కుటుంబ సభ్యుల వంటి ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి సాక్షిపర్సనల్ టైమ్‌లో పలు విషయాలు వెల్లడించారు. మాకు ఇద్దరు ఆడిపిల్లలు. వారు చిన్నతనంలో పాఠశాలకు వెళ్లగానే మేమిద్దరం నియోజకవర్గానికి వచ్చే వాళ్లం. నేను రాజకీయాల్లోకి వచ్చిన నాడు నా చిన్న కూతురు వయసు 8 నెలలు. పాపను మా అమ్మకు అప్పగిస్తే ఆమె ఆలనాపాలనా చూసింది. పిల్లలు పెద్దవుతుంటే వారితో కొద్దిసేపు గడపడానికి సమయం చిక్కేది కాదు. కేసీఆర్ ఉద్యమ సమయంలో రోజూ కార్యక్రమాలు ఉండేవి. దీంతో నియోజకవర్గంలో తిరగడానికి ఎక్కువ సమయం ఇచ్చేవాళ్లం. పిల్లలతో గడపలేకపోయిన జీవితం మళ్లీ రాదు. పిల్లల చదువు కోసం 2006నుంచి 2013 వరకు ఉప్పల్‌లో ఓ అద్దె ఇంట్లో ఉన్నాం. వాళ్లు పాఠశాలకు వెళ్లగానే ఆర్టీసీ బస్‌లో ఆలేరు నియోజకవర్గానికి వచ్చి ఉద్యమంలో పాల్గొన్నాం. పెద్దకూతురు అంజనీ యూఎస్‌లో ఎంఎస్ పూర్తి చేసింది. వివాహం చేశాం. రెండో కూతురు హర్షిత ప్రస్తుతం యూఎస్‌లో డిగ్రీ చదువుతోంది. వ్యక్తిగత జీవితం.. మా తల్లిదండ్రులు సరళ నర్సింహారెడ్డి, తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఉండేవాళ్లం. ప్రా«థమిక విద్య వెస్లీ బాలికల పాఠశాలలో కొనసాగింది. 10వ తరగతి తర్వాత వరంగల్‌లో పాలిటెక్నిక్ చేశా. అనంతరం బీడీఎల్ అప్రెంటీస్ చేసి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. నా మొదటి జీతం రూ. 1800. ఉద్యోగం చేస్తూనే బీకాం ఉస్మానియాలో పూర్తి చేశా. 1990లో యాదగిరిగుట్ట మండలం వంగపల్లికి చెందిన గొంగిడి మహేందర్‌రెడ్డితో వివాహం జరిగింది. 1991 వరకు ప్రైవేట్ ఉద్యోగం చేశా. ప్రైవేట్ ఉద్యోగం వదిలిపెట్టేనాటికి నా జీతం రూ.7.500. ప్రత్యేక పరిస్థితిలో రాజకీయాల్లోకి వచ్చా. పేదలకు సేవ చేయడంలోనే ఆనందం పేదలకు సేవ చేయడంలోనే ఆనందం చూసుకుంటున్నాం. ప్రధానంగా నియోజకవర్గంలోని పేదల వైద్యం కోసం ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం అర్థించి రావడం, వారికి సహాయం చేయడం జరుగుతోంది. తాము చేసిన సహాయం వల్ల బతికాం అంటూవచ్చి చెప్పినప్పుడు ఎంతో సంతృప్తి కరంగా ఉంటుంది. కొన్ని సార్లు ప్రభుత్వ సహాయం పొందినప్పటికీ ప్రాణాలు దక్కని వారు గుర్తువచ్చినప్పుడు బాధగా ఉంటుంది. నా భార్య బాధ్యతలను పంచుకుంటున్నా.. నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు మర్రిచెన్నారెడ్డితో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా. ఆయన వ్యక్తిగత సహాయకులలో ఒకరిగా పనిచేశా. ఆయన వల్లే ప్రజాజీవితం అంటే నాకు అలవాటు అయింది. ప్రస్తుతం నా భార్య సునీత ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. నియోజకవర్గం చాలా పెద్దది కాబట్టి ఆమె బాధ్యతలను నేనూ పంచుకుంటున్నా. ఒక్కోసారి ఇద్దరం రెండు మూడు రోజులు ఎదురుపడనంత బిజీగా ఉంటాం. ఒకే రోజు నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ఉన్నప్పుడు చేరో వైపు వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకుంటాం. అలా ప్రజల్లో ఉండడానికి ప్రయత్నిస్తాం. – గొంగిడి మహేందర్‌రెడ్డి జీవితంలో ఈ ఘటన నాకే ఎదురవుతుందని ఊహించుకోలేదు. తీవ్రంగా అలసిపోయి రెస్ట్ తీసుకోవడానికి బెడ్‌పై పడుకున్న నేను కళ్లు తెరిచి చూసే సరికి ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్నాను. ఏం జరిగిందో తెలియదు. ఒళ్లంతా నీరసంగా ఉంది. డాక్టర్లు పరీక్షలు చేస్తున్నారు. మూడు రోజుల తర్వాత ఆపరేషన్ చేశారు. మూడు నెలల తర్వాత కోలుకున్న నేను మళ్లీ ప్రజల్లోకి రావడం అంటే ఆ లక్ష్మీనర్సింహస్వామి దయగానే భావిస్తా. 2013 జనవరిలో కేసీఆర్ చేపట్టిన పల్లెబాట కార్యక్రమాన్ని ముగించుకుని దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొనడానికి నాభర్త మహేందర్‌రెడ్డితో కలిసి సిద్ధం అయ్యా. పిల్లల్ని పాఠశాలకు పంపించిన అనంతరం బయటకు వెళ్దామనుకున్నాం. కాని కొంచెం అలసటగా ఉంది కొద్ది సేపు విశ్రాంతి తీసుకుంటానని నాభర్తకు చెప్పి బెడ్రూంలోకి వెళ్లా. అరగంట తర్వాత మావారు వచ్చి చూస్తే నేను బెడ్‌మీద కన్పించలేదు. కింద పడి కోమాలోకి వెళ్లిన నన్ను హుటాహుటిన హైదరాబాద్‌లోని మలక్‌పేట యశోద ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్ ట్యూమర్‌గా తేల్చారు. 40 రోజుల పాటు విశ్రాంతి, సరైన తిండి లేకుండా తిరగడంతో ఒత్తిడి వల్ల మెదడుపై ప్రభావం పడిందని డాక్టర్లు చెప్పారు. ఆస్పత్రిలో చేర్పించిన మూడు రోజులకు తలకు శస్త్రచికిత్స చేశారు. భగవంతుని దయతోనే నాకు పునర్జన్మ కలిగింది. కుటుంబ సభ్యుల సహకారం, నావిల్ పవర్ నన్ను తిరిగి ఆరోగ్యవంతురాలిగా చేసింది. మా ఆయన మహేందర్‌రెడ్డి నాకు దిక్సూచి. ప్రతికూలతలను అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అన్నది నాకు వివరిస్తుంటారు. నేను ప్రజాజీవితంలో ఎలా ముందుకు సాగాలి, ప్రజలతో ఎలా మెలగాలి, వారి సమస్యల పట్ల ఎలా స్పందించాలి. విమర్శలు ఎలా ఎదుర్కోవాలి వంటి పలు అంశాలపై నాకు ఇంట్లో గైడ్ చేస్తారు. మాకు ఇంట్లో ఉన్నంత సేపు పలు అంశాలమీదనే వాదోపవాదాలు, చర్చలు. చివరగా పరిష్కారం కనుక్కుంటాం. ఎక్కువగా ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులు వాటిని పరిష్కరించడం కోసం ఏమి చేయాలి. ఇంకా ప్రజలు తమ నుంచి ఏం కోరుకుంటున్నారు వంటి అంశాలపై మా చర్చలు ఉంటాయి. -
గ్రామాల్లో అభివృద్ధి వేగవంతం
అనంతగిరి: తమ ప్రభుత్వ పాలనలో గ్రామగ్రామాన అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. వికారాబాద్ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే సంజీవరావుతో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించారు. రూ.90 లక్షలకు పైగా నిధులతో పలు పనులు, శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. అభివృద్ధి దశల వారీగా జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. బిల్లులు తప్పకుండా వస్తాయన్నారు. గ్రామాల్లో స్వచ్ఛ్ భారత్ కోసం పాటుపడాలన్నారు. ప్రభుత్వం రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వబోతోందని, వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొస్తోందని అన్నారు. గిరిగేట్‌పల్లిలో మహిళా సంఘ భవన నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు క ల్పించడానికి ప్రభుత్వం పాటుపడుతుందన్నారు. మద్గుల్ చిట్టంపల్లిలో ఎన్నో ఏళ్లుగా ఇబ్బందిగా ఉన్న పాఠశాల నూతన భవన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పదో తరగతిలో గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంటే ఎక్కువ టీచర్లున్న పాఠ«శాలల నుంచి డిప్యూటేషన్ చేస్తామన్నారు. ఇందుకు త్వరలో ఎంఈఓలతో మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనవసరంగా విమర్శించొద్దు: ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంజీవరావు మాట్లాడుతూ మాజీమంత్రి ప్రసాద్‌కుమార్ మా సీఎం, మంత్రులను అనవసరంగా విమర్శించడం మానుకోవాలన్నారు. ఆయనది కర్నాటక ప్రాంతమని, తాండూర్‌లో వచ్చి స్థిరపడ్డారని అన్నారు. ఈ ప్రాంతప్రజలు మంచోళ్లు కనుక గెలిపించారన్నారు. ఇకముందు చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. మాజీమంత్రికి అభివృద్ధి కంటే ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. వికారాబాద్ అభివృద్ధికి తాను శాయశక్తులా కృషి చేస్తున్నానన్నారు. తాను ఈ ప్రాంతంలో 30 ఏళ్ల నుంచి ప్రజలకు సేవలు చేస్తున్నాన్నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు ముత్తాహార్ షరీఫ్, ఎంపీపీ భాగ్యలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి, ఎంపీడీఓ సత్తయ్య, పీఆర్ డీఈ రాజమోహన్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, డీటీ కృష్ణయ్య, ఏఓ ప్రసన్నలక్ష్మి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నర్సింలు, ప్రభావతిరెడ్డి, మాణెమ్మ, శమంతాపాండు, అరుణ, లక్ష్మయ్య, ఎంపీటీసీ సాయన్న, నాయకులు, నర్సింహరెడ్డి, గోపాల్, వేణుగోపాల్‌రెడ్డి, సురేష్, చందర్‌నాయక్, ప్రభాకర్‌రెడ్డి, రాజమల్లయ్య, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు వరం.. జాబ్‌మేళా
యాదగిరిగుట్ట (ఆలేరు) : నిరుద్యోగ సమస్యను అధిగమించే దిశగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అడుగులు వేస్తున్నారు. ఉన్నత చదువులు చదువుకొని వ్యవసాయం, ఇతర పనులు చేస్తూ, ఇంట్లోనే ఖాళీగా గడుపుతున్న నిరుద్యోగుల కోసం ఉపాధి కల్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో వివిధ పరిశ్రమలతో జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు చర్చలు జరిపి, నిరుద్యోగులకు ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి ఆలేరులో జాబ్‌మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక తిప్పలుండవ్.. ఆలేరు, యాదగిరిగుట్ట, రాజపేట, మోటకొండూర్, తుర్కపల్లి, ఆత్మకూర్(ఎం), బొమ్మలరామారం మండలాల్లో ఉన్నత చదువులు అభ్యసించిన నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రతి రోజు హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆయా ప్రాంతాల్లో ఉద్యోగ వేట చేసి ఎలాంటి అవకాశాలు లేకపోవడంతో నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. దీంతో ఇంటి వద్దనే ఉంటూ వ్యవసాయం, ఉపాధి కూలీ, తదితర పనులు చేసుకుంటున్నారు. గమనించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సహకారంతో డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అధికారులతో కలిసి ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో జాబ్‌మేళ నిర్వహించడానికి సిద్దమయ్యారు. ఈనెల 25న జాబ్ మేళా... నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 25వ తేదీన ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 9.30గంటల నుంచి మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు. సుమారు 30 ప్రైవేట్ పరిశ్రమలతో అగ్రిమెంట్ చేసుకొని, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా ఈ జాబ్‌మేళా చేపడుతున్నారు. ఈ మెగా జాబ్‌మేళాకు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించనున్నారు. విద్యార్హత ఇదే.. 8, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ, పీజీ, నర్సింగ్, ఐటిఐ తదితర అర్హతలతో కూడిన నిరుద్యోగులు జాబ్‌మేళాలో పాల్గొనేందుకు అర్హులు. www. employment.telangana.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. జాబ్‌మేళాకు వచ్చే వారు 3 సెట్లు విద్యార్హత జిరాక్స్ పత్రులు, సర్టిఫికెట్లు తీసుకురావాలి. సద్వినియోగం చేసుకోవాలి ఈనెల25వ తేదీన ఆలేరు పట్టణంలో నిర్వహించే మెగా జాబ్‌మేళాను నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలి. నియోజకవర్గంలోని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని 30 ప్రైవేట్ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి, 3వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ జాబ్‌మేళాకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. -గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే ఉద్యోగం సంపాదిస్తా ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకొని, ఉద్యోగం సంపాదిస్తాను. అంతే కాకుండా ఇతర నిరుద్యోగులను సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కృషి చేస్తాను. -శ్రీకాంత్, నిరుద్యోగి, యాదగిరిగుట్ట -
తిమ్మాయిపల్లిని దత్తత తీసుకున్న జడ్పీ చైర్పర్సన్
యాలాల (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లా యాలాల మండలం తిమ్మాయిపల్లి గ్రామాన్ని జడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి దత్తత తీసుకున్నారు. సోమవారం గ్రామంలో జరుగుతున్న గ్రామజ్యోతి కార్యక్రమానికి హజరైన జడ్పీ చైర్పర్సన్ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో మొక్కలు నాటి పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. -
పింఛన్ వస్తుందా?
‘హైదరాబాద్ నగరానికి సురంగల్ సమీపంలో ఉన్నప్పటికీ ఆశించినంతగా అభివృద్ధి చెందలేదనేది వాస్తవం. ఉపాధ్యాయుడి నియామకం, రైతుల పొలాల వద్దకు ఫార్మేషన్ రోడ్లు, జిల్లా పరిషత్ నిధుల నుంచి గ్రామాలను కలిపే అప్రోచ్ రోడ్లు, అంగన్వాడీ భవనం, విద్యార్థుల సమయానికి అనుగుణంగా అదనంగా బస్సులను వేయించడం, రోడ్ల రీ బీటీకి నిధులు కేటాయిస్తా. అర్హులందరికీ పింఛన్లు, రేషన్‌కార్డులు ఇప్పించడానికి ప్రయత్నిస్తా. ఇళ్లులేని వారికి కొత్త ఇళ్లను మంజూరు చేయిస్తా. త్వరలోనే అంగన్వాడీ భవనాన్ని మంజూరు చేయిస్తా. నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యనూ అధికారులతో మాట్లాడి పరిష్కరించడానికి కృషిచేస్తా.’ అవ్వా.. బాగున్నావా.. తాతా పింఛన్ వస్తోందా.. అంటూ పలకరింపులు. పిల్లలూ.. మధ్యాహ్నం భోజనం సరిగా పెడుతున్నారా.. అంటూ వాకబు. గ్రామమంతా కలియతిరుగుతూ సమస్యలన్నీ నోట్ చేసుకుంటూ జెడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి మొయినాబాద్ మండలం సురంగల్ గ్రామవాసులతో మమేకమయ్యారు. ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా గ్రామంలో అడుగుపెట్టిన ఆమెకు అడుగడుగునా సమస్యలే స్వాగతం పలికాయి. ప్రజల నుంచి ఆమె పలు వినతులు స్వీకరించారు. గ్రామంలోని పాఠశాల నుంచి మొదలుకుని వృద్ధుల పింఛన్ల వరకు.. అన్ని సమస్యలనూ సావధానంగా విన్న ఆమె.. వాటన్నింటి పరిష్కారానికి కృషి చేస్తానని మాటిచ్చారు. చైర్పర్సన్: అవ్వా నీ పేరేంది.. పింఛన్ వస్తుందా? వృద్ధురాలు: నా పేరు పోచమ్మ. ఇంతకుముందు పింఛన్ వచ్చేది. మధ్యలో ఆగిపోయింది. చైర్పర్సన్: ఎందుకు ఆగిపోయింది.. అధికారులను అడిగావా? పోచమ్మ: చాలాసార్లు అడిగానమ్మా.. ఎందుకు ఇస్తలేరో వాళ్లేం చెప్తలేరు. నువ్వయినా చెప్పి పింఛన్ ఇప్పించమా.. చైర్పర్సన్: అమ్మా బాగున్నవా.. ఏం సమస్యలున్నాయి? విజయలక్ష్మి: బాగున్న మేడమ్. గ్రామానికి కొంత దూరంలో ఉన్న కాలనీలో నీటి సమస్య ఉంది. పైపులైన్లు సరిగాలేవు. వాటర్‌ట్యాంకు లేదు. కాలనీలో రోడ్డు కూడా సరిగా లేదే. చైర్పర్సన్: నువ్వు చెప్పమ్మా. రేషన్ సరిగా ఇస్తున్నారా? రాములమ్మ: నాకు రెండు కాళ్లు నడవడానికి రావు. అంబాడుతూ నడుస్తా. మూడు నెలల నుంచి రేషన్ బియ్యం ఇస్తలేరు. ఆధార్ కార్డు లింకు కాలేదంటున్నరు. ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చిన. అయినా రేషన్ బియ్యం ఇస్తలేరు. చైర్పర్సన్: అధికారులకు చెప్పి రేషన్ బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తా. మరి నీకు పింఛన్ వస్తుందా? రాములమ్మ:ఐదు వందలు వస్తుందమ్మా. ఇప్పుడింకా రాలేదు. చైర్పర్సన్: ఇప్పటినుంచి ఎక్కువొస్తుంది. అధైర్యపడకు. ఆ.. పెద్దాయనా.. నీపేరేంది? పెద్దాయన: వెంకట్‌రెడ్డి చైర్పర్సన్: వ్యవసాయానికి కరెంటు ఎలా వస్తోంది? వెంకట్‌రెడ్డి: అమ్మా రోజుకు ఆరు గంటలు ఇస్తున్నామంటున్నరు. కాని అది రాత్రి సగం, పగలు సగం ఇవ్వడంతో పంటలకు నీళ్లు పారపెట్టలేకపోతున్నం. చైర్పర్సన్: పంటలు ఎండుతున్నాయా? వెంకట్‌రెడ్డి: వర్షాలు సరిగా పల్లేదు. ఇప్పుడు కరెంటు సరిగా లేక పంటలు ఎండుతున్నయి. చైర్పర్సన్: మరి కరెంటు బిల్లులు సరిగా కడుతున్నారా? వెంకట్‌రెడ్డి: వ్యవసాయ బోర్ల సర్వీస్ చార్జీలను ఇంటి బిల్లులతో కలిపే వేస్తున్నారు. ఆ బిల్లులు చెల్లిస్తున్నాం. కానీ ఇచ్చే ఆరు గంటల కరెంటు ఒకే సమయంలో నిరంతరాయంగా ఇస్తే మంచిది. చైర్పర్సన్: అన్నా.. నువ్వుజెప్పు ఏం సమస్యలున్నయ్? నర్సింహ: గ్రామంలో చాలా సమస్యలున్నాయమ్మా. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సరిగాలేదు. మొయినాబాద్- సురంగల్ రోడ్డు పూర్తిగా గుంతలు పడింది. రోడ్డుపై వాహనాలు నడపలేని పరిస్థితి ఉంది. చైర్పర్సన్: చెప్పండి ఇంకా ఏమి సమస్యలున్నాయి? జైపాల్‌రెడ్డి: మా ప్రాంతంలో రైతులకు ప్రధాన సమస్య 111 జీఓ. ఈ జీఓ వల్ల మా భూములకు విలువ లేకుండా పోయింది. పక్కనే ఉన్న రాజేంద్రనగర్ మండలంలో భూములు కోట్ల విలువ చేస్తుంటే. ఇక్కడ మాత్రం కనీసం 5 లక్షలు కూడా ధరలేదు. చైర్పర్సన్: ఈ సమస్యను చాలా రోజులుగా ఎదుర్కొంటున్నట్టున్నారు? జైపాల్‌రెడ్డి: ఇంచుమించు ఇరవై ఏళ్లుగా ఈ జీఓ సమస్య ఉంది. చైర్పర్సన్: ఏం పాపా నీ కళ్లు కనిపించవా? సువర్ణ: మేడమ్ నా కళ్లు కనిపించవు. నాకు పింఛన్ సరిగా ఇస్తలేరు. ఒక నెల ఇస్తే రెండు మూడు నెలలు ఆపేస్తున్నారు. చైర్పర్సన్: కళ్లు ఎప్పుడు, ఎలా పోయాయి.. చదువుకున్నావా? సువర్ణ: 9వ తరగతి వరకు చదివాను. 9వ తరగతిలోనే బెంచీ తగిలి కన్నుపోయింది. ఆపరేషన్ చేశారు. అయినా చూపురాలేదు. చైర్పర్సన్: ఆస్పత్రిలో ఇచ్చిన రిపోర్టులున్నాయా.. పింఛన్‌కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నావా? సువర్ణ: ఆస్పత్రిలో రిపోర్టులు ఏమీ ఇవ్వలేదు. పింఛన్‌కోసం దరఖాస్తు చేసుకున్నా. ఇప్పుడైనా వస్తుందా? చైర్పర్సన్: తప్పకుండా నీకు పింఛన్ వచ్చే విధంగా చూస్తానమ్మా. బాబు నీవు చెప్పు సమస్యలేమున్నయ్? ఎండీ.షఫీ: ఆఫీసుల్లో లీడర్లు చెబితేనే పనులవుతున్నాయి. ప్రజలు స్వయంగా వెళ్లి అడిగితే అధికారులు పనులు చేయడంలేదు. మొన్ననే బాలల దినోత్సవం జరుపుకొన్నాం. పాఠశాలల్లో చదివే పిల్లలకే బాలల దినోత్సవమా? హోటళ్లు, కిరాణ షాపులు, మెకానిక్ షాపులు, రోడ్లపై చెత్త కాగితాలేరుకునే పిల్లలకు బాలల దినోత్సవం లేదా? ఈ పిల్లలందర్నీ అధికారులు పట్టించుకోకపోవడంతో వాళ్లు బాల కార్మికులుగానే మిగులుతున్నారు. చైర్పర్సన్: అలాంటి వారిని హాస్టళ్లలో చేర్పించి చదివిం చేలా అధికారులకు చెప్తాను. ఇంకా ఏం సమస్య ఉంది? ఎండీ.షఫీ: మైనార్టీలకు శ్మశానవాటిక లేదు. చైర్పర్సన్: మైనార్టీ వె ల్ఫేర్ నుంచి ఏర్పాటు చేయిస్తాం. నువ్వు చెప్పమ్మ.. అందరూ మరుగుదొడ్లు నిర్మించుకున్నారా? మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం రూ.9 వేలు ఇస్తుంది. సునీత: కొంతమంది కట్టుకున్నారు. రెండు గుంతలు తీసి మరుగుదొడ్డి కడితేనే పైసలు వస్తయంటున్నారు. జాగలు లేక శానమంది ఒక గుంతనే తీస్తున్నారు. చైర్పర్సన్: తమ్ముడూ ఇంక ఏమి సమస్యలున్నాయో నువ్వు చెప్పు? రాజు: ఎస్సీ శ్మశానవాటిక వద్ద బోరు, ట్యాంకు లేదు. సు రం గల్- అమ్డాపూర్, సురంగల్- నజీబ్‌నగర్ గ్రామాలకు లింకురోడ్డు వేస్తే రైతులకు అందరికీ ఉపయోగంగా ఉంటుంది. చైర్పర్సన్: జిల్లా పరిషత్ నిధుల నుంచి రెండు లింకురోడ్డులకు ఐదు లక్షల చొప్పున ఇస్తాం. అదే విధంగా శ్మశానవాటిక వద్ద బోరు, వాటర్‌ట్యాంక్ ఏర్పాటు చేయిస్తాం.చెప్పమ్మా నీవేం చేస్తున్నావ్? శోభ: 9నెలల క్రితం నా భర్త చనిపోయాడు మేడమ్. చిన్న పిల్లలున్నారు. నాకు ఏదైనా పని ఇప్పించండి మేడమ్. చైర్పర్సన్: ఏం పనిచేస్తావ్? శోభ: ఏ పనైనా చేస్తాను మేడమ్. చైర్పర్సన్: హౌస్‌కీపింగ్ పని చేస్తావా? శోభ: చేస్తాను మేడమ్. చైర్పర్సన్: పాప నువ్వుచెప్పు మీ స్కూల్లో ఏం సమస్యలున్నాయి? లావణ్య: ఒక్క సారే ఉన్నడు. ఇంక ఇద్దరు టీచర్లు కావాలి. స్కూల్లో తాగడానికి నీళ్లులేవు. బాత్రూంలు లేవు. ప్రహరీ కూలిపోయింది. చైర్పర్సన్: పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.2 లక్షలు ఇస్తాం. టీచర్లను ఏర్పాటు చేస్తాం. నువ్వు ఏం చదువుతున్నావు పాపా? అఖిల: ఐదో తరగతి చదువుతున్నా మేడమ్. చైర్పర్సన్: మధ్యాహ్న భోజనం బాగుందా? ఏమేం వడ్డిస్తున్నారు? అఖిల: అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు మేడమ్. చైర్పర్సన్: అందరు ఇక్కడే తింటున్నారా.. కొంత మంది ఇంటికెళ్లి తింటున్నారా? అఖిల: అందరం ఇక్కడే తింటున్నాం మేడమ్. చైర్పర్సన్: మీరు అంగన్వాడీ టీచరా.. పిల్లలకు ఏమేం పౌష్టికాహారం ఇస్తున్నారు? అంగన్వాడీ టీచర్: పప్పు, రవ్వ, గుడ్లు ఇస్తున్నాం మేడమ్. అన్నం వండి పెడుతున్నాం. చైర్పర్సన్: ఇక్కడే వండుతున్నారా.. పొయ్యిని రోజూ క్లీన్ చేసుకోరా? అంగన్వాడీ టీచర్: రోజు క్లీన్ చేస్తున్నాం మేడమ్. అన్నం, పప్పు పొంగినప్పుడు పొయ్యిపైన పడుతుంది. చైర్పర్సన్: సురంగల్ గ్రామం హైదరాబాద్‌కు చాలా దగ్గరున్నా సమస్యలు చాలా ఉన్నాయి. ఈ రోజు చాలా సమస్యలు తెలుసుకున్నాను. ఈ సమస్యలన్నీ తీర్చేందుకు కృషి చేస్తాను. ప్రజల సమస్యలు పూర్తిగా తెలిశాయి.. ప్రజా సమస్యలను ఎవరి ద్వారానో తెలుసుకుంటే పూర్తి సమాచారం లభించదు. సాక్షి విలేకరిగా వచ్చి గ్రామస్తులతో నేరుగా మాట్లాడడంతో సమస్యలు పూర్తిగా తెలిశాయి. రిపోర్టర్‌గా నిజాలను నిర్భయంగా రాసి ప్రజా సమస్యల పరిష్కారానికి పత్రికలు ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తాయి. విలేకరులపై సామాజిక బాధ్యత కూడా ఎంతో ఉంది. మాకంటే ఎక్కువగా ఫీల్డ్‌లో తిరిగే విలేకరులకే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల విషయాల్లోని మంచీ చెడులు తెలుస్తాయి. సురంగల్ గ్రామంలో సాక్షి విలేకరిగా సమస్యలను తెలుసుకోవడం గొప్ప అనుభూతినిచ్చింది. - సునీతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ -
సీనరేజీ ఎగనామం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆయా మండలాల పరిధుల్లో ఇసుక, మట్టి, తదితర ఖనిజ నిక్షేపాల తవ్వకాలపై వసూలు చేస్తున్న రాయల్టీలోంచి మండల, జిల్లా పరిషత్‌లకు చెల్లించాల్సిన 25శాతం సీనరేజీపై ప్రభుత్వం దాగుడుమూతలాడుతోంది. గత ఐదేళ్లలో జిల్లాకు సీనరేజీ రూపంలో రూ.51.10 కోట్లు ఇవ్వాల్సివుండగా, ఇప్పటివరకు కేవలం రూ.16.30 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంట్లో జిల్లా పరిషత్‌కు రూ.5.68 కోట్లు, మండల పరిషత్‌లకు 10.62 కోట్లు మాత్రమే మంజూరు చేసింది. స్థానిక సంస్థల పరిపుష్టికి దోహదపడే ఈ నిధులను విడుదల చేసే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అట్టిపెట్టుకున్న నిధులను విడుదల చేయాలని కోరుతూ జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడే సీనరేజీని బదలాయించాలని ఆమె కోరారు. రూ.200 కోట్లు.. నగర శివార్లను కలుపుతూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) 162 కిలోమీటర్ల పొడవునా ఔటర్‌రింగ్ రోడ్డును నిర్మించింది. ప్రతిష్టాత్మకంగా అత్యున్నత ప్రమాణాలతో రూపకల్పన చేసిన ఈ మార్గం నిర్మాణానికి మట్టి, ఇసుక, కంకరను జిల్లా నుంచి వినియోగించుకున్నారు. దీంతో ఈ క్రమంలోనే దాదాపు రూ.255 కోట్ల మేర సీనరేజీని కాంట్రాక్టు సంస్థల నుంచి హెచ్ఎండీఏ వ సూలు చేసింది. అయితే, ఈ నిధులను స్థానిక సంస్థలకు బదలాయించకుండా మొండికేసింది. రింగ్‌రోడ్డు పక్క ప్రాంతాల్లో అడ్డగోలుగా మట్టిని తీయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై జిల్లా ప్రణాళిక సంఘం కమిటీ సమావేశంలో నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఆందోళన ప్రకటించడంతో దిగివచ్చిన సర్కా రు.. రూ.55 కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్మును మాత్రం ఇప్పటి కీ మంజూరు చేయకపోవడం గమనార్హం. రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు రాయల్టీని కట్టినా.. ప్రభుత్వం మాత్రం సీనరేజీ రూపంలో స్థానిక సంస్థలకు బదలాయించాల్సిన నిధుల విషయంలో దిగిరాకపోవడం గమనార్హం. -
బీఆర్జీఎఫ్@ రూ.28.66 కోట్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్)కి జిల్లా ప్రణాళిక కమిటీ (డీపీసీ) ఆమోదముద్ర వేసింది. 2014-15 వార్షిక సంవత్సరానికి వెనుకబడిన ప్రాంత అభివృద్ధి నిధి కింద రూ.28.66 కోట్లతో ప్రతిపాదించిన 1,592 పనులకు పచ్చజెండా ఊపింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం జరిగిన డీపీసీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన ఈ నిధుల్లో గ్రామీణ రోడ్ల నిర్మాణానికే పెద్దపీట వేశారు. రూ.11.89కోట్లతో 559 కొత్త రోడ్ల నిర్మాణాలకు ప్రతిపాదించగా, ఆ తర్వాత పల్లెల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు రూ.8.72కోట్లు, గ్రామీణ నీటి సరఫరాను ఆధునీకరించేందుకు రూ.5.70 కోట్లు నిర్దేశించారు. జాయింట్ కలెక్టర్ ఎంవీ రెడ్డి, జెడ్పీ సీఈఓ చక్రధర్‌రావు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, ఆయా పురపాలక సంఘాల అధ్యక్షులు, డీపీసీ సభ్యులు ఈసీ శేఖర్‌గౌడ్, బొక్క జంగారెడ్డి హాజరైన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. హాస్టళ్లను విస్మరించడం అన్యాయం : మంచిరెడ్డి బీఆర్జీఎఫ్ నిధుల కేటాయింపుల్లో సంక్షేమ హాస్టళ్లను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రస్తావించారు. ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలకు రూ.కోటిన్నర కేటాయించిన జిల్లా యంత్రాంగం.. బీసీ హాస్టళ్లను విస్మరించడం దా రుణమన్నారు. పదేళ్ల నుంచి కనీసం రంగులు వేసేం దుకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయించలేద ని, శిథిలావస్థకు చేరిన భవనాల్లో కనీస సౌకర్యాలు కల్పిం చేందుకు సరిపడా నిధులు కేటాయించాలని కోరారు. వైద్యో నారాయణ.. : తీగల జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు అధ్వానంగా తయారైందని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. పీహెచ్సీలో వైద్యులు ఉండడంలేదని, ఖాళీలను భర్తీ చేసే విషయంలో కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్నారు. మహేశ్వరంలో 100 పడకల ఆస్పత్రి మంజూరైనా పనులు ఇంకా మొదలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతపనులను ప్రతిపాదించడం సరికాదు: మలిపెద్ది బీఆర్జీఎఫ్ కింద చేపట్టే పనుల్లో డుప్లికేషన్ జరుగకుండా చూడాలని మేడ్చల్ శాసనసభ్యుడు మలిపెద్ధి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు. పాత పనులనే మళ్లీ ప్రతిపాదించినట్లు తన దృష్టికి వచ్చిందని, వాటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త వాహనాలివ్వండి: యాదయ్య ప్రభుత్వ అధికారులను వాహనాల కొరత పట్టిపీడిస్తోందని, కాలంచెల్లిన వాహనాల స్థానంలో కొత్త వాటిని కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కోరారు. బీఆర్జీఎఫ్ కింద సాగునీటి పారుదలకు కూడా నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. తన నియోజకవర్గంలోని చాలా పీహెచ్సీలలో వైద్యుల్లేరని, ఖాళీలను భర్తీ చేసేందుకు చొరవ చూపాలని అన్నారు. ఆంగ్లమాధ్యమంలో బోధన: చామకూర సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియంలో విద్యాబోధన వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే విద్యాబోధనను ఆంగ్లంలో చేయాలని మల్కాజిగిరి ఎంపీ చామకూర మల్లారెడ్డి సూచిం చారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. పాత పనులకే దిక్కులేదు: సంజీవరావు గత ఏడాది బీఆర్జీఎఫ్ పనులే ఇంకా మొదలు కాలేదని వికారాబాద్ శాసనసభ్యుడు సంజీవరావు అన్నారు. నిధుల లేమితో అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మర్పల్లిలో కస్తుర్బా స్కూల్ నిర్మాణాన్ని మధ్యలోనే వదిలి కాంట్రాక్టర్ ఉడాయించారని, ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్జీఎఫ్ పనులు నత్తనడకన సాగుతున్నాయని అన్నారు. బంట్వారం మండలంలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందని, 15 ఏకోపాధ్యాయ పాఠశాలలకు కూడా టీచర్లు రాకపోవడంతో మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరు అందించండి: ప్రకాశ్‌గౌడ్ చెడిపోయిన బోర్లను బాగు చేయకుండా కొత్త వాటిని వేయాలడాన్ని రాజేంద్రనగ ర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ తప్పుబట్టారు. చెడినవాటికి మరమ్మతులు చేస్తే నీటి సమస్యను అధిగమించవచ్చని అన్నారు. శంషాబాద్‌కు ఇప్పటివరకు తాగునీటి సరఫరా చేయడంలేదని, మణికొండలో వాటర్‌వర్క్స్, ఆర్అండ్బీ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగా రోడ్డు నిర్మాణ పనులు ఆగిపోయానని డీపీసీ దృష్టికి తెచ్చారు. నిధుల వాటా పెంచండి: వివేక్ కుత్బుల్లాపూర్‌లోని ప్రగతినగర్, బాచుపల్లి, దూలపల్లి, నిజాంపేట్ తదితర గ్రామాల్లో జనాభా భారీగా పెరిగిందని, వారి అవసరాలు తీర్చే విధంగా నిధులు కేటాయింపులు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేఎం వివేక్ స్పష్టం చేశారు. చాలా గ్రామాలకు రోడ్డు మార్గాలు వేసేందుకు కూడా నిధుల కొరత ఏర్పడిందని, ఈ అంశంపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఫిరంగినాలాను శుద్ధి చేయండి: ఈసీ శేఖర్‌గౌడ్ చారిత్రిక ఫిరంగి నాలా కుచించుకుపోతుందని, దీనిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని డీపీసీ సభ్యుడు ఈసీ శేఖర్‌గౌడ్ అన్నారు. ఆదిబట్ల గ్రామంలో ఈ నాలా మురికి కాల్వగా మారిందని, దీన్ని శుద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారు. సమృద్ధిగా నిధులు: మహేందర్‌రెడ్డి, మంత్రి బీఆర్జీఎఫ్ నిధులేకాకుండా వివిధ పద్దుల కింద ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురానున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ఏడాది చేపట్టిన 839 పనుల్లో 644 పనులు అసంపూర్తిగా ఉన్నాయని, 23 పనులు ఇప్పటికీ ప్రారంభంకాలేదని, ఈసారి పనుల నిర్వహణ లో నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని చెప్పారు. గ్రామీణ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉన్న అంశం తన దృష్టికి వచ్చిందని, త్వరలోనే దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి టీచర్ల ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపా రు. సంక్షేమ హాస్టళ్లు, ఇరిగేషన్ శాఖకు బీఆర్జీఎఫ్ నిధు లు కేటాయించాలనే సభ్యుల అభిప్రాయం ఆహ్వానించదగ్గదని, ఆ మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ నెల 17వ తేదీ తర్వాత శాఖలవారీగా సమీక్షలు జరపాలని నిర్ణయం తీసుకున్నామని, ఈ సమావేశానికి ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. అభివృద్ధికి సహకరించండి: సునీత రాజధానికి చేరువలోనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఇంకా అభివృద్ధి చెందని పల్లెలు ఉన్నాయని, వీటిన్నింటిలో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు బీఆర్జీఎఫ్ నిధులను వినియోగించనున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ.28.66 కోట్లు ఖర్చు చేస్తున్నామని, మరిన్ని నిధులు రాబట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు ప్రజాప్రతినిధులు సహకార ం తప్పనిసరని, టీచర్ల కొరతను అధిగమించేందుకు తమ వద్ద పీఏలుగా నియమించుకున్న ఉపాధ్యాయులను వెనక్కి పంపాలని ఆమె ఎమ్మెల్యేలకు సూచించారు.