సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆయా మండలాల పరిధుల్లో ఇసుక, మట్టి, తదితర ఖనిజ నిక్షేపాల తవ్వకాలపై వసూలు చేస్తున్న రాయల్టీలోంచి మండల, జిల్లా పరిషత్‌లకు చెల్లించాల్సిన 25శాతం సీనరేజీపై ప్రభుత్వం దాగుడుమూతలాడుతోంది. గత ఐదేళ్లలో జిల్లాకు సీనరేజీ రూపంలో రూ.51.10 కోట్లు ఇవ్వాల్సివుండగా, ఇప్పటివరకు కేవలం రూ.16.30 కోట్లు మాత్రమే విడుదల చేసింది. దీంట్లో జిల్లా పరిషత్‌కు రూ.5.68 కోట్లు, మండల పరిషత్‌లకు 10.62 కోట్లు మాత్రమే మంజూరు చేసింది.
స్థానిక సంస్థల పరిపుష్టికి దోహదపడే ఈ నిధులను విడుదల చేసే విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రజాప్రతినిధులు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలోనే అట్టిపెట్టుకున్న నిధులను విడుదల చేయాలని కోరుతూ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడే సీనరేజీని బదలాయించాలని ఆమె కోరారు.
రూ.200 కోట్లు..
నగర శివార్లను కలుపుతూ హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) 162 కిలోమీటర్ల పొడవునా ఔటర్‌రింగ్ రోడ్డును నిర్మించింది. ప్రతిష్టాత్మకంగా అత్యున్నత ప్రమాణాలతో రూపకల్పన చేసిన ఈ మార్గం నిర్మాణానికి మట్టి, ఇసుక, కంకరను జిల్లా నుంచి వినియోగించుకున్నారు. దీంతో ఈ క్రమంలోనే దాదాపు రూ.255 కోట్ల మేర సీనరేజీని కాంట్రాక్టు సంస్థల నుంచి హెచ్‌ఎండీఏ వ సూలు చేసింది. అయితే, ఈ నిధులను స్థానిక సంస్థలకు బదలాయించకుండా మొండికేసింది.
రింగ్‌రోడ్డు పక్క ప్రాంతాల్లో అడ్డగోలుగా మట్టిని తీయడంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై జిల్లా ప్రణాళిక సంఘం కమిటీ సమావేశంలో నిలదీశారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఈ అంశంపై ఆందోళన ప్రకటించడంతో దిగివచ్చిన సర్కా రు.. రూ.55 కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్మును మాత్రం ఇప్పటి కీ మంజూరు చేయకపోవడం గమనార్హం. రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు రాయల్టీని కట్టినా.. ప్రభుత్వం మాత్రం సీనరేజీ రూపంలో స్థానిక సంస్థలకు బదలాయించాల్సిన నిధుల విషయంలో దిగిరాకపోవడం గమనార్హం.
సీనరేజీ ఎగనామం!
Published Fri, Nov 21 2014 11:46 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement