
అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు
కొత్తవి దేవుడెరుగు.. ఉన్నవాటికి సరిపడా నిధులివ్వలే
ఎన్నికల హామీ 50 ఏళ్లకే పింఛను పెరుమాళ్లకే ఎరుక
ప్రస్తుతం పింఛన్ల వ్యయం ఏడాదికి రూ.32 వేల కోట్లు
బడ్జెట్‌లో కేటాయించింది మాత్రం రూ.27,518 కోట్లే
కూటమి సర్కారు 8 నెలల పాలనలో 1.90 లక్షల పింఛన్లు కట్
తాజా కేటాయింపుల ప్రకారం చూస్తే రూ.5 వేల కోట్లకు
సరిపడా కోతలు పెట్టాల్సిందేనంటున్న నిపుణులు
పేదవాడి పింఛనుపై కూటమి సర్కారు కత్తికట్టింది. ఇప్పటికే కోత కత్తెర పట్టుకుని తిరుగుతున్న ప్రభుత్వం.. బడ్జెట్‌లో దానికి మరింత పదును పెట్టింది..! చంద్రబాబు సర్కారు కేటాయింపుల ప్రకారం చూస్తే.. ఇది స్పష్టంగా తేలిపోతోంది. లక్ష రెండు లక్షలు కాదు.. ప్రతిపాదిత గణాంకాల ప్రకారం ఏకంగా పది లక్షల పింఛన్లకు కటింగ్ పెట్టే ప్రమాదం నెలకుంది. ఫిబ్రవరి 1న ప్రభుత్వం పింఛన్లు విడుదల చేసిన లబ్ధిదారుల సంఖ్య 63.59 లక్షలు.
వీరికి వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరంలో నెలకు రూ.2,719.50 కోట్ల చొప్పున పంపిణీ చేయాలి. అంటే ఏడాదికి రూ.32,634 కోట్లు. కానీ, బడ్జెట్‌లో పింఛన్లకు రూ.27,518 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది కావాల్సిన నిధుల కన్నా ఏకంగా రూ.5,116 కోట్లు తక్కువ కావడం గమనార్హం. – సాక్షి, అమరావతి
ఇప్పటికే కొనసాగుతున్న స్పెషల్ డ్రైవ్
8 నెలల క్రితం వరకు.. ఐదేళ్లు హాయిగా గుండెల మీద చేయి వేసుకొని మరీ ప్రతి నెల ఠంఛనుగా ఇంటి వద్దనే పింఛన్లు తీసుకున్న లక్షల మంది లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎప్పుడు? ఎలా? తమ పింఛనుకు ఎసరు పెడతారోనని బిక్కుబిక్కుమంటున్నారు. నిరుడు జూన్‌లో కూటమి సర్కారు కొలువుదీరాక పింఛన్ల కోతకు సిద్ధపడింది. ఇందుకుతగ్గట్లు లబ్ధిదారుల్లో అనర్హులు ఎక్కువగా ఉన్నారంటూ ప్రచారం సాగిస్తోంది.
ఏళ్ల నుంచి పింఛన్లు పొందుతున్నవారు కూడా అర్హత నిరూపించుకోవాలంటూ సర్వే, స్పెషల్ డ్రెవ్ పేరుతో రకరకాల కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ వస్తోంది. 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పింఛన్ అర్హత, అనర్హతలను మరో విడత ప్రభుత్వ వైద్యుల ద్వారా పరిశీలింపజేస్తోంది.
50 ఏళ్లకే పింఛన్ అంటూ నమ్మించి..
ప్రస్తుతం కనీసం 60 ఏళ్లున్న దాటినవారికే పింఛన్ పొందేందుకు అర్హత ఉంది. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల
ముందు.. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే రూ.4 వేల చొప్పున పింఛను ఇస్తామంటూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీ అమలు చేయలేదు. ఇంకోవైపు.. ఈ ప్రభుత్వంలో ప్రతి నెల ఇస్తున్న పింఛన్లే ఫిబ్రవరి 1 నాటికి ఏకంగా 1,89,957 తగ్గాయి.
గత ఏడాది మే నెలలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 65,49,864 మందికి పింఛను విడుదల చేయగా, కూటమి సర్కారులో ఫిబ్రవరి 1న 63,53,907 మందికే ఇచ్చింది. మరోవైపు, కూటమి ప్రభుత్వం ఏర్పాటు రోజు నుంచే రాష్ట్రంలో పింఛన్ల కోసం కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసింది. ఈ మేరకు ఆన్‌లైన్ సేవలు నిలిచిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment