అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో.. | kale yadaiah visit as sakshi vip reporter to gajula guda | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో..

Published Sun, Dec 28 2014 11:41 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో.. - Sakshi

అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో..

గాజులగూడ.. శంకర్‌పల్లి మండలంలోని ఓ కుగ్రామం.. హైదరాబాద్ మహానగరానికి కేవలం 50 కి.మీ. దూరంలో ఉన్నా అభివృద్ధికి మాత్రం అంతులేని దూరంలో కొట్టుమిట్టాడుతోంది. 18 ఏళ్ల క్రితమే గ్రామపంచాయతీగా ఏర్పడిన గాజులగూడకు రెవెన్యూ పరిధిని నిర్ధారించకపోవడంతో రెవెన్యూ ఆదాయమంతా పాత గ్రామపంచాయతీ అయిన మహాలింగపురంనకే వెళుతోంది. దీంతో గ్రామాన్ని నిధుల కొరత వేధిస్తోంది. తాగునీటి సమస్యతో జనం అల్లాడుతున్నారు.

డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులను తెలుసుకునేందుకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గాజులగూడలో పర్యటించారు. స్థానికులను ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు. గ్రామానికి భవిష్యత్తులో మంచిరోజులు రానున్నాయన్నారు. గ్రామాన్ని అన్ని విధాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు.  

ఎమ్మెల్యే: అమ్మా నమస్కారం. బాగున్నావా..? నీకు పింఛన్ వస్తోందా?
సంగమ్మ: గతంలో పింఛన్ వచ్చేది. ఇప్పుడు వస్తలేదు. నా భర్త నన్ను వదిలేశాడు. నాకు పింఛన్ లేకపోతే ఎట్ల బతకాలె.
ఎమ్మెల్యే: భర్త వదిలేసిన వారికి ఇప్పుడు పింఛన్ మంజూరు కాలేదు. మీలాంటి వారి గురించి ప్రభుత్వం ఆలోచిస్తున్నది. త్వరలోనే మీకు కూడా పింఛన్లు వచ్చే అవకాశం ఉంది. నీ వయసు 65 సంవత్సరాలు ఉంటే వద్ధాప్య పింఛన్ ఇప్పించే ఏర్పాటు చేస్తా.
ఎమ్మెల్యే: ఏమమ్మ నీ పేరేంది. నీకు పింఛన్ వస్తోందా?
వద్ధురాలు: నాపేరు శాంతమ్మ. నాకు పింఛన్ ఇస్తలేరు సారు.
ఎమ్మెల్యే: గతంలో పింఛన్ ఇచ్చారా?
శాంతమ్మ: గతంలో ఇచ్చారు. కానీ రెండు నెలల నుంచి రావడంలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడంలేదు.
ఎమ్మెల్యే: నీ సమస్య ఏమిటమ్మా?
సాబేరాబీ: నా భర్త వదిలేసిండు. పింఛను ఇస్తలేరు. ఇల్లు లేదు. ముగ్గురు పిల్లలు చిన్నగున్నరు. నేనెట్ల బతకాలి.
ఎమ్మెల్యే: పింఛన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక వస్తుంది. ఇళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తా. పిల్లలను హాస్టల్‌లో చదివస్తావా?
సాబెరాబీ: ఊళ్లోనే చదివిస్తాను సార్.
ఎమ్మెల్యే: సరేనమ్మ...బాగా చదివించు. నీ పేరేంటయ్య?
సత్యనారాయణ: నా పేరు సత్యనారాయణ.
ఎమ్మెల్యే: నీకు రేషన్ కార్డు ఉందా?
సత్యనారాయణ: గులాబి కార్డు ఉంది. దాన్ని మార్చి తెల్లరేషన్ కార్డు ఇవ్వాలి.
ఎమ్మెల్యే: తెల్లకార్డు ఎందుకు?
సత్యానారాయణ: నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తా. భూమిలేదు. అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తెల్లరేషన్ కార్డు ఇవ్వడంలేదు.
ఎమ్మెల్యే: తహసీల్దార్‌కు చెప్పి నీకు తెల్లరేషన్ కార్డు ఇప్పించే ఏర్పాటు చేస్తా.
ఎమ్మెల్యే: నువ్వు చెప్పన్నా ఇంకా ఊళ్లో ఏమి సమస్యలున్నాయి?
మల్లారెడ్డి: నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. చేతిపంపులే ఉన్నాయి. వాటిలో నీళ్లు ఎర్రగా వస్తున్నాయి.
ఎమ్మెల్యే: నల్లాల ద్వారా నీరు సరఫరా చేస్తలేరా?
మల్లారెడ్డి: బోర్లలో నీళ్లు ఎక్కువగా లేవు. బోర్లు వేసినా ధరి నిలబడక కూలిపోతున్నాయి. తాగునీటికైతే చాలా ఇబ్బంది పడుతున్నాం.
ఎమ్మెల్యే: కొత్తగా బోర్లు వేయించి నీటి సమస్య తీరుస్తా.
ఎమ్మెల్యే: నీవు చెప్పమ్మ సమస్యలేమున్నాయ్?
మల్లమ్మ: మురుగు కాల్వలు సరిగా లేవు. ఉన్న మురుగు కాల్వల్లో చెత్తాచెదారం నిండిపోయింది. దోమలు, దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం.
ఎమ్మెల్యే: నీ సమస్య చెప్పమ్మా?
శరీఫాబీ: రేషన్ సరుకులు సరిగా రావడంలేదు. 4 కిలోల బియ్యం ఇస్తే ఏం సరిపోతాయ్.
ఎమ్మెల్యే: ఇప్పటి వరకు ఒక్కరికి నెలకు 4 కిలోల బియ్యం వచ్చేవి. జనవరి నుంచి ప్రభుత్వం ఒక్కరికి 6 కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఇస్తుంది.
ఎమ్మెల్యే: అమ్మా.. నీకు ఇల్లు వచ్చిందా?
అంజమ్మ: ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కట్టుకున్నాం. ఇప్పటి వరకు బిల్లు ఇవ్వలేదు.
ఎమ్మెల్యే: బేస్‌మెంట్ బిల్లుకూడా ఇవ్వలేదా?
అంజమ్మ: ఒక్క బిల్లుకూడా ఇవ్వలేదు. అప్పు చేసి ఇల్లు కట్టుకొని ఇబ్బంది పడుతున్నాం.
ఎమ్మెల్యే: బిల్లులు తప్పకుండా వస్తాయమ్మా. నెల రోజుల్లో ఇళ్ల బిల్లులు వచ్చే అవకాశం ఉంది.
ఎమ్మెల్యే: తమ్మీ ఏం సమస్యలున్నాయో చెప్పుతమ్మీ?
గోవర్ధన్‌రెడ్డి: ఊళ్లో పశువైద్యశాల లేదు. పశువుల డాక్టర్ లేడు. పశువులకు ఏ రోగం వచ్చినా పక్కూరికి వెళుతున్నాం.
ఎమ్మెల్యే: ఇప్పుడు నట్టల నివారణ కార్యక్రమం నడుస్తుంది. పశువైద్యులు వచ్చి గొర్రెలు, మేకలకు మందులు ఇస్తారు. అవన్నీ ఇప్పించండి. గ్రామంలో పశువైద్య ఉపకేంద్రం ఏర్పాటు చేసి డాక్టర్‌గాని, కాంపౌండర్‌గాని అందుబాటులో ఉంచేలా చూస్తాను.
ఎమ్మెల్యే: గ్రామానికి బస్సు వస్తుందా?
విఠల్: ఉదయం ఒక్కసారి బస్సు వస్తుంది.
ఎమ్మెల్యే: ఒక్క ట్రిప్పే వస్తుందా? మరి సరిపోతుందా?
విఠల్: ఒక్క ట్రిప్పు వస్తే ఊళ్లో నుంచి వెళ్లడానికి ఉంటుంది. మళ్లీ రావాలంటే ఎలా?. అందుకు ఇంకా మూడు ట్రిప్పులు బస్సు వస్తే బాగుంటుంది.
ఎమ్మెల్యే: మరిన్ని ట్రిప్పులు బస్సు వచ్చేలా చూస్తాను.
ఎమ్మెల్యే: అమ్మా.. నీ సమస్యేంది చెప్పు?
నవీన: మా బాబు ప్రదీప్‌కు పుట్టినప్పటి నుంచే మాటలు రావడంలేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించా. ఇప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో ఇలాంటి ఆపరేషన్లు తీసేయాలని చూస్తుందంటున్నారు. వాటిని అలాగే కొనసాగిస్తే పిల్లలకు సహాయం అందుతుంది.
ఎమ్మెల్యే: మీ బాబుకిప్పుడు మాటలు వస్తున్నాయా?
నవీన: మాటలు రావడంలేదు. అందుకే పింఛన్ ఇవ్వాలని కోరుతున్నా.
ఎమ్మెల్యే: సరేనమ్మ పింఛన్ ఇప్పించేలా చూస్తా.
ఎమ్మెల్యే: ఇంకా ఏం సమస్యలున్నాయ్?
రమేష్: 18 ఏళ్ల కింద మహాలింగపురం పంచాయతీ నుంచి విడిపోయి గాజులగూడ పంచాయతీ ఏర్పడింది. కానీ గ్రామ రెవెన్యూ మాత్రం వేరు చేయలేదు. దీంతో పంచాయతీకి ఆదాయం రావడంలేదు.
ఎమ్మెల్యే: రెవెన్యూ భూములు గ్రామానికి కేటాయించే విధంగా చూస్తాను.
ఎమ్మెల్యే: అన్నా నీ సమస్య ఏంది చెప్పు?
కిష్టయ్య: నాకు ఎవరూ లేరు. ఒక్కన్నే ఉన్నాను. పింఛన్ రావడంలేదు. రేషన్ బియ్యం ఇస్తలేరు.
ఎమ్మెల్యే: నీ ఆధార్ కార్డులో వయసు ఎంతుంది చూద్దాం.
కిష్టయ్య: ఇదిగో చూడండి.
ఎమ్మెల్యే: ఆధార్ కార్డులో నీ వయసు తక్కువగా ఉంది. అందుకే పింఛన్ రావడంలేదు. రేషన్ బియ్యం ఇప్పించే ఏర్పాటు చేస్తా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement