
మెయినాబాద్(చేవెళ్ల): 111 జీవో, ఎల్‌ఆర్‌ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై మంగళవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మంగళవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు, నిరసనకారులు చెప్పిన వివరాల ప్రకారం.. ఎమ్మెల్యే కాలె యాదయ్య కారులో రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ చౌరస్తా మీదుగా వెళుతుండ గా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. 84 గ్రామాలకు గుదిబండగా మారిన 111 జీవోతోపాటు, ఎల్‌ఆర్‌ఎస్, రిజిస్ట్రేషన్ సమస్యలపై సమాధానం చెప్పాలంటూ ఆయన్ని నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే కారు దిగి వారిని పరుష పదజాలంతో దూషించారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు కొందరు నిరసనకారులను అడ్డుకుని ఎమ్మెల్యేను అక్కడి నుంచి మండల పరిష త్ కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి.