bura narsaiah
-
భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తా : బూర నర్సయ్య
-
హాజరు అంతంతే..
సాక్షి, వరంగల్ రూరల్ : లోక్‌సభ సమావేశాల్లో మన ఎంపీల హాజరు శాతం అంతంతమాత్రంగానే ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం 2014 మే 26న కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టగా.. 16వ లోక్‌సభ మొదటి సమావేశం జూన్ నాలుగో తేదీన జరిగింది. అప్పటినుంచి 17 సెషన్లలో 331 రోజుల పాటు సమావేశాలు జరిగాయి. ఉమ్మడి వరంగల్ నుంచి ముగ్గురు ఎంపీలు పసునూరి దయాకర్ (వరంగల్), అజ్మీర సీతారాం నాయక్ (మహబూబాబాద్), డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి) ప్రాతినిథ్యం వహిస్తుండగా.. ఈ ఐదేళ్లలో వారు పలు సమస్యలపై గళమెత్తారు. అయితే కొన్ని సమస్యలు పరిష్కారం కాగా.. మరి కొన్ని అలానే ఉన్నాయి. మొత్తానికీ లోక్‌సభ సమావేశాలకు మన ప్రజాప్రతినిధులు కనీసం 80 శాతం హాజరుకాకపోవడం గమనార్హం. 16వ లోక్‌సభ సమావేశాలు బుధవారంతో ముగిసిన నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. వరంగల్ : ‘పసునూరి’ ఇలా.. 2015 నవంబర్ 24న వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచిన పసునూరి దయాకర్ గెలుపొందారు. అంతకంటే ముందు 2014లో వరంగల్ ఎంపీగా కడియం శ్రీహరి గెలుపొందారు. ఆ తర్వాత కాలంలో సీఎం కేసీఆర్ ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలను అప్పగించడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గడిచిన నాలుగేళ్లలో దయాకర్ 112 రోజులు లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. ఎంపీగా ఎన్నికైన నాటి నుంచి చివరి సమావేశం వరకు ఐదు ప్రశ్నలు మాత్రమే లేవనెత్తారు. బాలికల అక్రమ రవాణా, పసుపు బోర్డు ఏర్పాటు, వాటర్ పొల్యూషన్, ట్రేడ్ ఇన్ బిట్కాన్, రూరల్ డెవలప్మెంట్ల్పై ప్రశ్నలు సంధించారు. 2015 డిసెంబర్ 18, నుంచి లెబర్ డిపార్ట్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పసునూరి కొనసాగారు. మహబూబాబాద్ : సీతారాంనాయక్.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎంపీగా డాక్టర్ అజ్మీరా సీతారాంనాయక్ గెలుపొందారు. ఐదేళ్లలో 331 రోజులు సభ జరుగగా.. 227 రోజులు హాజరయ్యారు. 44 డిపార్ట్మెంట్లపై 118 ప్రశ్నలు అడిగారు. 2014 సెప్టెంబర్ ఒకటి నుంచి ఇప్పటివరకు పార్లమెంట్ నిబద్ధత కమిటీ సభ్యుడు, కమ్యూనికేషన్ ఇన్ఫర్మమేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా.. 2017 నవంబర్ 3 నుంచి కెమికల్ ఫర్టిలైజర్స్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2017 సెప్టెంబర్ ఒకటి నుంచి నవంబర్ 2 వరకు సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ సభ్యుడిగా కొనసాగారు. భువనగిరి : బూర నర్సయ్యగౌడ్.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ సభ్యుడిగా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్గెలుపొందారు. 16వ లోక్‌సభ సమావేశాలు ముగిసేసరికి ఆయన 184 రోజులు హాజరయ్యారు. సమావేశాల్లో 59 డిపార్ట్మెంట్లపై 216 ప్రశ్నలు సంధించారు. 2014 సెప్టెంబర్ ఒకటి నుంచి లేబర్ డిపార్ట్మెంట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా కొనసాగారు. 2014 సెప్టెంబర్ 12 నుంచి 2018 జనవరి 8 వరకు పార్లమెంటరీ వెనుకబడిన తరగతుల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, స్కిల్ డెవలప్మెంట్ సభ్యుడిగా కొనసాగారు. పాస్‌పోర్ట్ కార్యాలయం తెచ్చా.. వరంగల్‌కు పాస్‌పోర్ట్ కేంద్రాన్ని మంజూరు చేయించి తీసుకొచ్చాను. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేశాను. నా వంతు అభివృద్ధికి పాటుపడ్డా. తక్కువ సమయంలో సీనియర్ల దగ్గర చాలా నేర్చుకున్నా. వరంగల్‌లో నేషనల్ హైవేలు తీసుకొచ్చాను. కొడకండ్లకు ఏకలవ్య స్కూల్ మంజూరు చేయించాను. దీనికి దాదాపు రూ.200 కోట్ల వ్యయమవుతోంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ద్వారా రోడ్లు, కమ్యూనిటీహాళ్లు తదితర అభివృద్ధి పనులకు కేటాయించాను. – పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ గొప్ప అనుభూతి.. మారుమూల గ్రామం నుంచి వచ్చి ప్రొఫెసర్‌గా, సోషల్ వర్కర్‌గా కొనసాగుతూనే సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమంలో పాల్గొన్నాను. కేసీఆర్ నన్ను గుర్తించి లోక్‌సభ టికెట్ ఇచ్చి గెలిపించి పార్లమెంట్‌కు పంపించారు. గిరిజన బిడ్డగా అదృష్టంగా భావిస్తున్నా. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి, దేశ గిరిజన సమస్యలపై పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లా. కొన్నింటిని సాధించాను. జిల్లాకు పాస్‌పోర్ట్, నేషనల్ హైవేలు, రెండు ఆర్వోబీలు, కొత్త రైళ్లను మంజూరు చేయించాను. – డాక్టర్ అజ్మీర సీతారాంనాయక్, మానుకోట ఎంపీ -
బూర నర్సయ్య హామీలు..
ఇంద్రానగర్.. యాచారం మండలంలోని గునుగల్ గ్రామానికి అనుబంధ నివాస ప్రాంతం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఈ పల్లె అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండలం భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. స్థానిక ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ‘సాక్షి వీఐపీ రిపోర్టర్’గా గ్రామానికి వచ్చి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. పెద్దాయనా.. పెద్దమ్మా.. చెల్లీ.. అంటూ ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ గ్రామమంతా కలియతిరిగారు. అడుగడుగునా ఆయనకు సమస్యలే ఎదురయ్యాయి. పింఛన్లు, ఆహార భద్రతా కార్డుల గురించి అనేకమంది మొరపెట్టుకున్నారు. అందరి సమస్యలనూ సావధానంగా విన్న ఆయన ఇంద్రానగర్‌లోని ప్రతి సమస్యనూ తెలుసుకున్నానని, వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపుతానని మాటిచ్చారు. బూర నర్సయ్య హామీలు.. మహానగరానికి యాచారం మండలం దగ్గర్లోనే ఉంది. కానీ ఎక్కడా అభివృద్ధి జాడ కన్పించడం లేదు. ఇక్కడి కాలనీలో పాఠశాల ఏర్పాటు చేయిస్తా. సీసీ రోడ్డు, డ్రైనేజీ కాల్వల నిర్మాణానికి నిధులు కేటాయిస్తా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహారభద్రతా కార్డులు అందిస్తాం. రేషన్ కార్డుల్లో వయసు తక్కువగా రావడం వల్ల కొందరికి పింఛన్లు రావడం లేదని తెలిసింది. వారందరికీ పింఛన్లు అందేలా చూస్తా. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. అందరికీ సంక్షేమ పథకాలు అందుతాయి. ఎంపీ: పెద్దాయనా నీ పేరేంటి..పింఛన్ మంజూరైందా? వికలాంగుడు: నా పేరు రాంచంద్రయ్య. ప్రమాదంలో కాళ్లు దెబ్బతిన్నాయి. నాకు పింఛన్ రాదంటున్నారు. ఎంపీ: నీవు నడవలేకున్నావు గదా .. ఎందుకు పింఛన్ రాదంటున్నారు. కచ్చితంగా వచ్చేలా చూస్తా.. ముందు అర్జీ పెట్టుకో. ఎంపీ: నీ సమస్య ఏమిటో చెప్పు? శంకరయ్య: సర్ .. నేను గడ్డమల్లయ్యగూడలో స్థలం కొనుగోలు చేశాను. అక్కడి పంచాయతీ వారు ఇంటి అనుమతులు ఇవ్వడం లేదు. ఎంపీ: అలా ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తా. ఎంపీ: తమ్ముడూ ఏంపని చేస్తున్నావ్? రాజు: కూలీ పనులు చేసుకొని జీవనోపాధి పొందుతున్నాం. మా కాలనీలో కరెంట్ తీగలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఎంపీ: సర్పంచ్ మల్లికార్జున్‌ను పిలిచి .. విద్యుత్ అధికారులకు నేను చెప్పినట్లు చెప్పి వెంటనే తీయించు. ఎంపీ: ఏం పెద్దమ్మ బాగున్నావా? లక్ష్మమ్మ: ఏం బాగున్నాం సార్.. పింఛన్ పెంచినట్లు చెప్పిన్రు గానీ ఇంత వరకూ ఇయ్యలే. ఎంపీ: వస్తది పెద్దమ్మ ఆందోళన వద్దు. రూ. 1000 వస్తుంది. ఇబ్బంది ఉండదు. ఎంపీ: ఏమ్మా ఏం పేర్లు మీవి, ఏం చదువుతున్నారు? విద్యార్థినులు: సార్ మా పేర్లు జ్యోతి, అరుంధతి. డిగ్రీ, ఇంటర్ చదువుతున్నాం. ఎంపీ: ఉన్నత చదువులు చదవండి. చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. రిజర్వేషన్లు ఉపయోగించుకొని ఉద్యోగాలు పొందండి. విద్యార్థినులు: సరే సార్. ఎంపీ: చెల్లి నీ కష్టమేంటి? మైసమ్మ: నా భర్త కొన్ని నెలల క్రితం ప్రమాదంలో మరణించాడు. ఇంత వరకు పరిహారం రాలేదు. పిల్లల పోషణ కష్టంగా మారింది. ఎంపీ: సర్పంచ్‌ను పిలిచి .. పేరు నమోదు చేసుకొని, వివరాలు తెలుసుకో .. న్యాయం జరిగేలా చూద్దాం. ఎంపీ: ఏం తమ్ముడు ఏం పేరు? మల్లేష్ : నా పేరు మల్లేష్. ఈ కాలనీలో 30 మంది చిన్నారులు ఉన్నారు. పాఠశాల లేకపోవడంతో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గునుగల్‌కు వెళ్లి చదువుకుంటున్నారు. ఎంపీ: అదేంటి పాఠశాల లేదా..! వెంటనే నిర్మాణానికి ఉన్నతాధికారులతో మాట్లాడతా. ఎంపీ: వికలాంగ పింఛన్ వస్తుందా? వికలాంగుడు: సార్ నా పేరు అంజయ్య. నాకు పింఛన్ మంజూరైంది. నాలాంటి వాళ్లు మండలంలో వందలాది మంది ఉన్నారు. వికలత్వ పరీక్షల కోసం నగరానికి వెళ్లాల్సి వస్తోంది. దగ్గరలోనే శిబిరం ఏర్పాటయ్యేలా చూడండి. ఎంపీ: వైద్యాధికారులతో మాట్లాడి, ఇబ్రహీంపట్నంలో శిబిరం ఏర్పాటయ్యేలా చూస్తా. ఎంపీ: ఏం పెద్దమ్మ నీ సమస్య ఏమిటి? పెంటమ్మ: నాకు 80 ఏళ్లకు పైనే ఉన్నాయి. నా కొడుకు కళ్లులేని వాడు. ఇద్దరికీ పింఛన్ మంజూరు కాలేదు. కష్టంగా ఉంది.. ఒక్కోసారి చచ్చిపోవాలి అనిపిస్తోంది. ఎంపీ: అలా వద్దు.. కచ్చితంగా ఇద్దరికీ పింఛన్ వచ్చేలా చేస్తా. ఎంపీ: ఏమ్మా మీ బాధలేంటి? శాంత : ఇక్కడ పాఠశాల లేదు. కానీ ఇంద్రానగర్ పాఠశాల పేరు మీద టీచర్ ఉంది. మా చిన్నారుల ఇబ్బందులను పట్టించుకోండి. ఎంపీ: పిల్లల ద్వారా కూడా తెలుసుకున్నా. కచ్చితంగా చర్యలు తీసుకుంటా. ఎంపీ: తాగునీరు వస్తోందా? చైతన్య: మూడురోజులకోసారి వస్తున్నాయి సార్. కాలనీలో డ్రైనేజీ సమస్య, దోమలతో ఇబ్బందులు పడుతున్నాం. ఎంపీ: స్వయంగా చూశా.. సమస్యలు పరిష్కరిస్తా. ఎంపీ: ఏమ్మా నీకొచ్చిన కష్టం? ప్రేమలత: నాపేరు ప్రేమలత. అంగన్వాడీ ఉద్యోగిని. మాకు జీతాలు సరిపోవడం లేదు సార్. ఎంపీ: ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించేలా కృషి చేస్తోంది. అప్పుడు మీలాంటి ఉద్యోగులకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎంపీ: ఏం రైతన్న వ్యవసాయం ఎలా సాగుతోంది? రాజేందర్‌రెడ్డి: ఏం వ్యవసాయం సార్. వర్షాల్లేక బోరుబావుల్లో భూగర్భ జలాలు లేవు. కొద్దిపాటి నీళ్లతో ఒకటి, రెండు మడులు పండిస్తున్నాం. ఎంపీ: ఆందోళన వద్దు రాబోయే రోజుల్లో ఇబ్రహీం పట్నంకు సాగునీరు వచ్చే అవకాశం ఉంది. ఎంపీ: మీకేం సమస్యలున్నాయి? రవీందర్: 15 ఏళ్ల క్రితం గ్రామంలో ఉన్న కృష్ణాజలాల రిజర్వాయర్‌కు మా భూములిచ్చాం. అప్పట్లో అందులో పని కల్పిస్తామన్నారు. కొంతమంది పనిచేస్తున్న కార్మికుల ఉద్యోగాలకు కూడా భరోసా లేకుండా పోయింది. ఎంపీ: నష్టపరిహారం ఇచ్చారు గదా.. వాటర్‌వర్క్స్ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తా. ఎంపీ: తమ్ముడూ నీది ఇదే ఊరా? నర్సింహ: అవును సార్.. ఎస్సీ ప్రణాళిక కింద దళితవాడలు అన్ని విధాలా అభివృద్ధి చెందుతాయన్నారు. పైసా నిధులు మంజూరు కావడం లేదు. ఎంపీ: దళితవాడల్లో అన్ని విధాలా అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తోంంది. బడ్జెట్లో రూ.50 వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం. నర్సింహ: సార్.. మా గ్రామంలో నాటుసారా విక్రయాలు జరుపుతున్నారు. తాగి రోగాల బారిన పడుతున్నారు? ఎంపీ: మీరే చైతన్యం కావాలి. నష్టపోతున్న కుటుంబాల ఇబ్బందులు తెలుసుకొని, నివారణ చర్యలు తీసుకోవాలి. కృష్ణ:సార్.. వచ్చే రేషన్ బియ్యం సరిపోవడం లేదు? ఎంపీ: బియ్యం పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి మనిషికి ఆరు కిలోల చొప్పున ఇచ్చే అవకాశం ఉంది. కుంటి మల్లేష్: విద్యార్థులు చాలా దూరం నడిచి వెళ్తున్నారు. సైకిళ్లు పంపిణీ చేస్తే బాగుంటుంది? ఎంపీ: సైకిళ్లు కాదు.. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు కాగానే మినీ బస్సుల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రామకృష్ణ యాదవ్: ఇక్కడి ఎంపీటీసీ సభ్యుడ్ని. గ్రామంలో డ్రైనేజీ కాల్వల కోసం నిధులు మంజూరయ్యేలా చూడండి. ఎంపీ: గ్రామం పరిస్థితులు చూస్తున్నా.. తప్పకుండా నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తా. రాజు: మాది గునుగల్ ఎస్సీ కాలనీ. మాకు ఇంతవరకూ కృష్ణా జలాలు రావడం లేదు. గ్రామంలో రిజర్వాయర్ ఉన్నా దాహార్తి తీరడం లేదు. ఎంపీ: వెంటనే సర్పంచ్‌ను పిలిచి .. తాగునీటి సమస్య లేకుండా చూడు. పైపులైన్ అవసరమైతే ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడుతా. ఎంపీ: సర్పంచ్ చూశారుగా.. దళిత కాలనీలో ఎన్ని సమస్యలున్నాయో. ఓ రోజు నా వద్దకు రండి.. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా కృషి చేస్తా. సర్పంచ్: సరే సార్.. మీరు మా గ్రామానికి వచ్చినందుకు కృతజ్ఞతలు.