సాక్షి, మంచిర్యాల : ఇంకా చలికాలం పూర్తిస్థాయిలో ప్రారంభం కానేలేదు. వేసవికి ఇంకా మూడు నాలుగు నెలల సమయం ఉంది. కానీ.. అప్పుడే జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి చేరుతున్నాయి. వేసవికి ముందే వేసవిని గుర్తుచేస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల బోర్లు, బావులు ఎండిపోయాయి. 16 మండలాల్లో పది మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే గతనెల అక్టోబర్ వరకు 14 మండలాల్లో భూగర్భ జలాలు లోతులోకి వెళ్లాయి. ఇది ఆందోళన కలిగించే విషయమేనని భూగర్భ జల శాఖ అధికారులే స్వయానా చెబుతున్నారు. వేసవి ప్రారంభంలోగా రెండు..మూడు మండలాలు మినహా అన్ని మండలాల్లోనూ తాగునీటి సమస్య జఠిలంగా మారే ప్రమాదం ఉందని అంచ నా వేశారు. ముందస్తు చర్యలో భాగంగా యుద్ధప్రాతిపదికన జిల్లాకు రూ.12.20 కో ట్లు అవసరమని ప్రభుత్వానికి ఇటీవల నివేదికలు పంపారు.
జిల్లాలో 52 మండలాలుం డగా.. ప్రతినెలా సుమారు 30 మండలాల్లో భూగర్భ జల శాఖ అధికారులు సర్వే చేయ గా ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బెజ్జూర్, బోథ్, దహెగాం, దిలావర్‌పూర్, కాగజ్‌నగర్, కెరమెరి, లోకేశ్వరం, ముథోల్, సారంగాపూర్, తాండూర్, తానూర్ మండలాల్లో నీటి మట్టం భూ ఉపరితలం నుంచి 10 మీటర్ల లోతుకు పడిపోయినట్లు గుర్తించారు. ఖానాపూర్, మందమర్రి, తాంసి, వాంకిడి మండలాల్లో ఎనిమిది మీటర్లకు చేరాయి. ఇప్పటికే 200లకు పైగా ఆవాసాల్లో నీటి సమస్య నెలకొంది.
రూ.12.20 కోట్ల పనులకు ప్రతిపాదనలు..
జిల్లాలో దారుణంగా పడిపోయిన భూగర్భ జల మట్టంతో రానున్న రోజుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదం ఉన్నందునా.. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో ఏర్పడనున్న నీటి ఎద్దడి నివారణకు అత్యవసరంగా రూ.12.20 కోట్లు విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందు లో బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు కా వాలని నివేదించారు. జిల్లాలో 3,490 తాగునీటి పథకాలుండగా.. అందులో 425 పథకాలు పని చేయడం లేదని వాటి మరమ్మతు, నిర్వహణ కోసం రూ.10.40 కోట్లు అవసరమని ప్రభుత్వాన్ని కోరారు.
క్షేత్రస్థాయిలో అధికారులు ఇప్పటికే బోర్‌వెల్స్ మరమ్మతు, నీటి ట్రాన్స్‌పోర్టేషన్, బావులు అద్దెకు చర్యలు ప్రారంభించారు. గ్రామాల్లో కాలిపోయిన మోటార్ల మరమ్మతు, కొత్త మోటార్లు, పైప్‌లైన్ లీకేజీ పనులపై దృష్టి సారించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21,682 బోర్‌వెల్‌లలో సుమారు తొమ్మిది వేల బోర్లు పనిచేయడం లేదు. 13వ ఫైనాన్స్ నిధులు రూ.2.50 లక్షల (మూడు నెలలకోసారి)తో వీటి మరమ్మతు చేయించుకోవాలని ఎంపీడీవోలకు ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రతిపాదనలు పంపాం..
- ఇంద్రసేన్, ఎస్‌ఈ, గ్రామీణ నీటి సరఫరా విభాగం
ఈ సారి వేసవికి ముందే నీటి సమస్య జఠిలంగా మారే పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ నెలారంభంలో భూగర్భ జల శాఖ ఇచ్చిన నివేదికలు చూసి మరింత అప్రమత్తమయ్యాం. బావుల లీజు, ట్యాంకుల నీటి సరఫరా కోసం రూ.3.80 కోట్లు, పనిచేయని 425 నీటి పథకాల నిర్వహణకు రూ.10.40 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.
జిల్లాలో భూగర్భజల్లాలు అట్టడుగు స్థాయికి ..
Published Sun, Nov 23 2014 2:45 AM | Last Updated on Sat, Sep 29 2018 5:21 PM
Advertisement