సాక్షి, హైదరాబాద్ : ఎంతటి కరువు కాటకాల్లోనూ ఎండిపోని ఘనత నాటి తెలంగాణ మెట్లబావుల సొంతం. ఊటల్ని పునరుద్ధరిస్తే చాలు, నిత్యం నీటితో కళకళలాడటం వీటి ప్రత్యేకత. పునరుద్ధరిస్తే ఒక్కో బావి ఒక్కో ఊరి దాహం తీర్చగలదంటున్నారు నిపుణులు. అలాంటి మెట్ల బావులు తెలంగాణలో ఎన్నున్నాయనే లెక్క ప్రభుత్వం వద్ద కూడా లేదు. ఎప్పుడో గుర్తించిన 35 బావుల పేర్లే పురావస్తు శాఖ వద్ద ఉన్నాయి. కానీ నిజానికి అవి 200కు పైగా ఉంటాయని స్పష్టమవుతోంది. ఓ ఆర్కిటెక్ట్ విశేష కృషి ఫలితంగా రాష్ట్రంలో ఇప్పటికే 140 మెట్ల బావులు వెలుగులోకి వచ్చాయి. ఈ బావులు ఎన్నో ఊళ్ల తాగు నీటి కష్టాలను తీర్చగలవు. కాబట్టి వీటిని మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం పునరుద్ధరించాల్సిన అవసరముంది.
ఈ మెట్లబావులను వెలికితీస్తున్న ‘హైదరాబాద్ డిజైన్ ఫోరం’ సంస్థ, తాను గుర్తించిన బావుల ఫొటోలతో వారం రోజుల ప్రద ర్శన ఏర్పాటు చేసింది. ‘హెరిటేజ్ తెలంగాణ’ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి స్టేట్ మ్యూజియంలో జూన్ 1 నుంచి 6 దాకా ఇది కొనసాగుతుందని సంస్థ నిర్వాహకుడు, ఆర్కిటెక్ట్ యశ్వంత్ రామమూర్తి చెప్పారు. రాష్ట్రంలోని మెట్ల బావులు గుజరాత్, రాజస్తాన్లలోని అద్భుత నిర్మాణాలకు ఏమీ తీసిపోవని పురావస్తు శాఖ విశ్రాంత అధికారి రంగాచార్యులు చెబుతున్నారు. వీటిని పునరుద్ధరిస్తే భావి తరాలకు మంచినీటి వనరులనే గాక అద్భుత నిర్మాణాలను కూడా అందించినట్టు అవుతుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మెట్ల బావులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఓ సామాజిక కార్యకర్త ఇటీవల ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రాష్ట్రంలో ఎన్ని బావులున్నాయి, వాటి పరిస్థితేమిటంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని పీఎంవో ప్రశ్నించింది. దాంతో హైదరాబాద్ ఫోరం సేకరించిన వివరాలనే పీఎంవోకు పంపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment