నీరే మన జీవన ఆధారం. ‘ఎడ తెగక పారే ఏరు లేని ఊరు’ని వెంటనే వదిలి పెట్టమన్నాడు వేమన మహాకవి. నీరు కాపాడుకుంటే భవిష్యత్తు ఉంటుంది. నీటి జాడను కాపాడుకోవడానికి పూర్వం నుంచి మానవుడు అనేక విధాలుగా ప్రయత్నించాడు. చెరువులు, బావులు కట్టుకున్నాడు. చెరువు ఊరి వ్యవసాయానికి ఆధారం అయితే బావి మంచినీటికి ఆధారం. బోర్లు లేని కాలంలో ఊరికి, వీధికి, ఇంటికి బావి ఉండేది. ముందు బావి తవ్వి ఆ తర్వాత ఇల్లు కట్టే వారు. ఎప్పుడూ నీళ్లుండే బావి ఉన్న ఇంటికి మర్యాద ఎక్కువ ఉండేది. ఇప్పటికీ బావులు ఉన్నాయి. వాటిని తెలుసుకోవడం, వాటిని కాపాడుకునే స్పృహ కలిగి ఉండటం అవసరం. బావికి తెలుగులో ఉన్న మరో మాట ‘నుయ్యి’.
దిగుడు బావుల నగరం
ప్రజలకు నీటి వనరులుగా ఉపయోగపడుతున్న దిగుడు బావులు, చేదుడు బావులు ఇప్పుడు కాలగర్భంలో కలిసి పోతున్నాయి. కాని కొన్ని చోట్ల దిగుడు బావులు విస్తారంగా ఉన్నాయి. ఉదాహరణకు గుజరాత్‌లోని దిగుడుబావులు. ఈ రాష్ట్రంలో దాదాపు 120 విశిష్టమైన దిగుడుబావులు ఉన్నాయి. గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్‌ను దిగుడుబావుల నగరం అనొచ్చు. అక్కడ ఉన్న ‘రుడాబాయి దిగుడుబావి’ ఐదంతస్తుల లోతు ఉండి ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కసారైనా చూడ దగ్గ పర్యాటక చోటు ఇది. ఇక్కడ లోతైన బావిలొకి చక్కని మెట్ల నిర్మాణము కనిపించి ఆనాటి వారి ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి చిహ్నంగా నిలుస్తుంది. బావి చుట్టూ చక్కని రాతినిర్మాణము ఉంటుంది. అంచెలంచెలుగా విశాలమైన వసారాలు, గదులు, స్తంభాలు , వాటి మీద లతలు, అల్లికలు, నగిషీలు చెక్కబడి దేవాలయ నిర్మాణాన్ని తలపిస్తాయి. నాటి ప్రజలు వీటిని గంగామాతగా భావించేవారు.
అందుకే ఈ జలాన్ని దేవతగా భావించి ఈ నిర్మాణం చేశారు. అష్టకోణాల నిర్మాణం ఇది. బావిలోకి ప్రవేశించేందుకు మూడువైపులనుండి ప్రవేశద్వారాలుంటాయి. వీటిలో నుండి దిగితే ఒక అంతస్తు నుండి మరో అంతస్తుకు దిగుతూ మొత్తం ఐదంతస్తుల కిందికి దిగాల్సివుంటుంది . అంత లోతునుండి నీరు పైకి చేరవేయడం చాలా శ్రమతో కూడుకున్న పనే. అందుకే ఆ శ్రమ తెలియకుండా వుండేందుకే ఇటువంటి విశాలమైన, నెమ్మదిగా ఎక్కే మెట్లు కలిగిన సుందర నిర్మాణాలు చేపట్టారు. గుజరాత్‌లోని దిగుడుబావులన్నీ 10–15 శతాబ్దాల మధ్య జరిగిన నిర్మాణాలే. దిగుడు బావులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం రాజస్థాన్. అక్కడి అభానేరి గ్రామంలోని ‘చాంద్ బౌరి’ అనే దిగుడుబావి విశేషమైన ఖ్యాతి పోందింది. ప్రపంచ పర్యాటకులందరూ దీనిని చూడటానికి వస్తారు.
హైదరాబాద్‌లో..
హైదరాబాద్‌లోని బన్సిలాల్‌పేట్‌లో అద్భుతమైన దిగుడుబావి ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలోని దిగుడుబావుల పునరుద్ధరణకు నడుము బిగించింది. అలాగే చెరువుల రక్షణకు హైడ్రాను ఏర్పాటు చేసింది. నీటిని రక్షించుకోకపోతే భవిష్యత్తు నాశనం. ఈ అవగాహన మనందరం కలిగి ఉండాలి. నీరు వృధా చేయరాదు.
బావులలో రకాలు
ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్ధంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.
దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటి లోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నవి. ఇవి భూగర్భ జాలాలలోని కింది పొరల లోనికి వేసి నీటిని మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో గిలక నిర్మించబడి ఉంటుంది. ఇవి గతంలో ఇంటింటా ఉండేవి.
Comments
Please login to add a commentAdd a comment