vegitables farming
-
Sagubadi: కోకోపోనిక్స్.. మట్టి లేని సేద్యం.. కూరగాయలు పుష్కలం!
Cocoponics- Soilless Cultivation: వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో సాగు భూమి తరిగిపోతోంది. నగరాలు, పట్టణాల్లో జనాభా సాంద్రత పెరుగుతున్నకొద్దీ స్థానికంగా నాణ్యమైన తాజా కూరగాయలు, ఆకుకూరల లభ్యతతో పాటు తలసరి వినియోగం కూడా తగ్గిపోతోంది. మరోవైపు.. 40% సాగు భూమి అస్థిర సాగు పద్ధతుల వల్ల ఇప్పటికే సాగు యోగ్యం కాకుండా పోయింది. సాగు పద్ధతులు మార్చుకోకపోతే మిగతా భూములూ నిస్సారమైవడానికి మరో 60 పంట కాలాలే మిగిలి ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. సారం తక్కువగా ఉన్న తేలిక భూములు, చౌడు భూములు, రాళ్ల భూములు, ఎడారి నేలలు విస్తరించిన ప్రాంతాలతో పాటు కిక్కిరిస్తున్న నగరాలు, పట్టణాలు, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలందరికీ ఎక్కడో దూరంలో పండించి తగినన్ని కూరగాయలు, ఆకుకూరలు అందుబాటులోకి తేవటం పాలకులకు సవాలుగా మారింది. రోజుకు మనిషి 400 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నా.. ఆచరణలో ఇందులో సగం తినలేని స్థితిలో జనం మిగిలిపోతున్నారు. ఇటువంటి సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ‘కోకోపోనిక్స్ / మట్టి లేని సేద్యం’ అన్ని విధాలా ఉపకరిస్తుందని, భవిష్యత్తు ఆహారోత్పత్తిలో ఈ పద్ధతే ప్రధాన పాత్ర పోషిస్తుందనేది భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) అంచనా. ఈ ఆలోచనతోనే ఐసిఏఆర్ అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు ఏడేళ్ల క్రితం మట్టి లేని సేద్యంపై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. నగర పరిమితులకు లోబడి తక్కువ స్థలంలో, తక్కువ నీటితో కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను ఆరోగ్యదాయకంగా ఇంటి స్థాయిలోనే కాకుండా, వాణిజ్య స్థాయిలోనూ పండించే సమగ్ర పద్ధతులపై ప్రయోగాలు చేసిన ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు ప్రమాణాలను రూపొందించి ప్రజలకు అందిస్తున్నారు. కోకోపిట్, పోషక ద్రావణం ఈ సాగుకు మట్టి అవసరం లేదు. సిల్పాలిన్ బ్యాగ్‌లలో శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎరువును నింపి, నిర్థారిత పరిమాణాల్లో 12 రకాల సూక్ష్మ, స్థూల పోషకాలతో కూడిన ద్రావణాన్ని డ్రిప్ ద్వారా అందించడమే ఈ పద్ధతిలో ప్రత్యేకత. వాణిజ్య స్థాయిలో నాణ్యమైన, ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సులువుగా పండించేందుకు అవసరమైన శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువు(అర్కా ఫెర్మెంటెడ్ కోకోపిట్)ను, పోషకాలతో కూడిన ద్రావణా(అర్కా సస్య పోషక్ రస్)న్ని ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డా. డి. కలైవనన్ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగాయి. ఆరు బయటైనా పాలీహౌస్లో అయినా కూరగాయల సాగు గ్రో బాగ్స్లోనే సాధారణంగా ఎక్కువ మంది వినియోగించే ఆకుకూరలు, కూరగాయలను ఆరు బయట నేల మీద, గచ్చు మీద, మేడ మీద లేదా గ్రీన్/ పాలీహౌస్‌లలో గ్రోబాగ్స్లలో పెంచే సాయిల్ లెస్ సాగు పద్ధతులపై ఐఐహెచ్ఆర్ నెలకో రోజు శిక్షణ ఇస్తోంది. ఆకు కూరలు, టమాటా, మిరప కాయలు, క్యాబేజీ, దోసకాయలు, ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు, పొట్లకాయలు, గుమ్మడికాయలతో పాటు విదేశీ రకాలైన రంగు క్యాబేజీ, జుకిని వంటి రకాలపై ఐఐహెచ్‌ఆర్‌లో మట్టి రహిత సేద్య పద్ధతిలో గ్రోబాగ్స్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు సాధించారు. మట్టి లేని సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగరాలు, పట్టణ, పరిసర ప్రాంత ప్రజల రోజువారీ అవసరాలను పూర్తిగా తీర్చేలా కూరగాయలను పండించవచ్చని డా. డి. కలైవనన్ ‘సాక్షి’తో ఫోన్ ఇంటర్యూలో చెప్పారు. కూరగాయ మొక్కల పెరుగుదలకు అవసరమైన అన్ని పోషక ద్రావణాలను సమతులంగా, సకాలంలో అందించడం వల్ల పోషక లోపం లేని కూరగాయలను, ఆకుకూరలను పిండించగలుగుతున్నామని ఆయన అన్నారు. 12 రకాల స్థూల, సూక్ష్మ పోషకాలను ద్రావణం ద్వారా అందిస్తుండగా, మరికొన్ని పోషకాలు కొబ్బరి పొట్టు ఎరువు ద్వారా, మరికొన్ని నీటి ద్వారా అందుతాయన్నారు. కోకోపిట్ ఎంత వాడాలి? గ్రో బ్యాగ్‌లో శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును నింపి.. విత్తనాలు లేదా మొక్కలు నాటి పోషకాలతో కూడిన ద్రవాన్ని డ్రిప్ ద్వారా అందించాలి. 12“12 అంగుళాలు లేదా 15“15 అంగుళాల సైజు గ్రో బ్యాగ్‌లో 8 నుంచి 10 కిలోల వరకు శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును వాడాల్సి ఉంటుంది. వంగ, టమాటో, మిరప, చిక్కుడు, బఠాణీ, బెండ మొక్కలతోపాటు.. సొర, బీర, ఆనప, గుమ్మడి వంటి తీగ జాతి మొక్కల్ని సైతం ఈ సైజు గ్రోబాగ్‌లో ఒక్కొక్కటి పెంచి, వాణిజ్య స్థాయిలోనూ మంచి దిగుబడులు పొందవచ్చని డా. కలై వనన్ తెలిపారు. అదే విధంగా, ఒక అడుగు ఎత్తు, అడుగు వెడల్పు, 4 అడుగుల పొడవు ఉండే సిల్పాలిన్ గ్రో బెడ్లో అయితే 45 కిలోల శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎరువు పోసి కూరగాయలు పెంచుకోవచ్చన్నారు. కొబ్బరి పొట్టు ఎరువు ఒక్కసారి కొని వేసుకుంటే చాలు. ప్రతి పంట పూర్తయ్యాక 5–10 శాతం కొబ్బరి పొట్టు ఎరువు వేసి, కలియదిప్పి, కొత్త పంటను వేసుకోవచ్చు. కొబ్బరి పొట్టు కొన్ని పంటల తర్వాత పూర్తిగా చివికి చక్కని ఎరువుగా మారుతుంది. పాతదాన్ని మార్చాల్సిన అవసరం ఉండదని డా. కలైవనన్ స్పష్టం చేశారు. రూపాయికి 2–11 రూపాయలు వాణిజ్య స్థాయిలో మట్టి లేని సేద్యంలో కూరగాయలు, ఆకుకూరలను నేల మీద గానీ, మేడ/గచ్చు మీద గానీ గ్రోబాగ్స్‌లో సాగులో మంచి దిగుబడులు తీయవచ్చని డా. కలైవనన్ తెలిపారు. జుకిని, ఆకుకూరలు, గ్రీన్ క్యాబేజి, కీరదోస, బఠాణీ వంటివి మట్టిలో కన్నా కోకోపిట్లోనే ఎక్కువ దిగుబడి వచ్చింది. బీన్స్, చిక్కుడు, మిరప, కలర్ క్యాబేజీ వంటి పంటల్లో మట్టిలో సాగుతో సమానంగా దిగుబడులు వచ్చాయన్నారు. అన్ని పంటల్లోనూ పది రోజులు ముందే పూత, కాత రావటం గమనించామన్నారు. కూరగాయల రకాన్ని బట్టి రూపాయి పెట్టుబడికి రూ. 2.2 నుంచి రూ. 11 వరకు ఆదాయం వస్తుందన్నారు. ఇందులో కలుపు సమస్య అసలు ఉండదని, భూమిని దుక్కి చేసే ఖర్చు కూడా ఉండదన్నారు. నీటిలో కలిపే పోషకాలు అత్యంత శుద్ధమైనవి. ఇవి నూటికి నూరు శాతం నీట కరిగి మొక్కల వేర్లకు చప్పున అందుతాయి. మట్టిలో వేసిన రసాయనిక ఎరువుల మాదిరి 50–75% వరకు ఏదో ఒక రకంగా వృథా కావటం.. భూమిని, నీటిని కలుషితం చేయటం అనే సమస్యలు ఇందులో ఉండవని ఆయన అన్నారు. మట్టి లేని సేద్యంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు రుచిగా, ఎక్కువ కాలం తాజాగా ఉంటాయన్నారు. సారవంతమైన భూమి అందుబాటులో లేని చోట్లలో, నగరాలు, పట్టణాల్లో మిద్దెలపైన, గేటెడ్ కమ్యూనిటీల్లో ఐఐహెచ్ఆర్ సూచిస్తున్నట్లు మట్టి లేని సేద్యం ఎంతో ఉపయోగకరం. ఒక్క రోజు శిక్షణ! మట్టి లేని సేద్యాన్ని బెంగళూరులోని ఐఐహెచ్ఆర్ ద్వారా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక్క రోజు శిక్షణ చాలు. రైతులు, వ్యవసాయం అసలు తెలియని గృహిణులు, గ్రామీణులు సైతం ఐఐహెచ్ఆర్ శిక్షణ పొందవచ్చు. ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. శిక్షణ పొందిన తర్వాత ఇంటి పట్టున కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పండించుకొంటున్నారు. కొందరు అమ్మటం కోసం భారీ స్థాయిలో కూడా పండిస్తున్నారు. ప్రత్యక్షంగా, దూర ప్రాంతాల్లో ఉన్న వారి సౌలభ్యం కోసం ఆన్లైన్లో హైబ్రిడ్ మోడ్‌లో నెలకో రోజు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తేదీల కోసం ఐఐహెచ్ఆర్ వెబ్సైట్ చూడవచ్చు లేదా నాకు మెయిల్ పంపవచ్చు. – డా. డి. కలైవనన్, కోకోపోనిక్స్ నిపుణులు, భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ. -– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: Sagubadi: కూరగాయల్లోనూ ‘డ్యూయల్ గ్రాఫ్టింగ్’! ఒకే మొక్కకు రెండు అంట్లు! -
కూరగాయల్లోనూ ‘డ్యూయల్ గ్రాఫ్టింగ్’! ఒకే మొక్కకు రెండు అంట్లు!
ప్రతికూల వాతావరణ పరిస్థితులను, చీడపీడలను తట్టుకొని, మంచి దిగుబడులనివ్వటం అంటు మొక్కల ప్రత్యేకత. అడవి వంగ వేరు మొక్కపై ఏదో ఒక హైబ్రిడ్ కూరగాయ మొక్కను అంటుకట్టిన మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే, రెండు అంతకంటే ఎక్కువ రకాల కూరగాయ మొక్కలతో అంటుకట్టిన మొక్కలపై శాస్త్రవేత్తల పరిశోధనలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి. రెండు లేదా అంతకన్నా ఎక్కువ మొక్కల్ని అంటుకట్టే పద్ధతిని డ్యూయల్ లేదా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ పద్ధతి అంటారు. పూలు, పండ్ల మొక్కల ఉత్పత్తిలో ఇంతకు ముందే ఈ పద్ధతి ఆచరణలో ఉంది. కూరగాయ పంటల్లోనూ ‘బ్రిమాటో’ వంటి డ్యూయల్ గ్రాఫ్టింగ్ మొక్కలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ (ఐఐవిఆర్– ఐసీఏఆర్ అనుబంధ సంస్థ) ఈ దిశగా చురుగ్గా పరిశోధనలు చేస్తోంది. బంగాళదుంప, టొమాటో మొక్కలతో గ్రాఫ్టింగ్ చేసి గతంలో ‘పొమాటో’ మొక్కల్ని రూపొందించిన ఈ సంస్థే.. ఇటీవల వంగ, టొమాటో మొక్కలతో గ్రాఫ్టింగ్ చేసి ‘బ్రిమాటో’ మొక్కల్ని రూపొందించింది. ఒకే కుటుంబానికి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల కూరగాయ మొక్కలను అంటుగట్టి.. ఆ అంటు మొక్క ద్వారా అనేక రకాల కూరగాయలను పండించటం ఈ ఆధునిక డ్యూయల్ లేదా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ పద్ధతి ప్రత్యేకత. ఐఐవిఆర్లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిశోధనల ఫలితాలు ఇటు గ్రామీణ రైతులతో పాటు, అటు నగరాలు, పట్టణాల్లో సేంద్రియ ఇంటిపంటలు / మిద్దె తోటలు సాగు చేసే అర్బన్ ఫార్మర్స్లోనూ అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకే మొక్కకు రెండు అంట్లు బంగాళదుంప+టొమాటో మొక్కలకు అంటుకట్టి ఈ రెండు కూరగాయలను ఉత్పత్తి చేసే ‘పొమాటో’ అంటు మొక్కల్ని రూపొందించారు. ‘పొమాటో’ అంటు మొక్కను పెంచితే భూమిలో బంగాళదుంపలు, చెట్టు మీద టొమాటోల దిగుబడి పొందవచ్చు. అదేవిధంగా, వంగ + టొమాటో మొక్కలను అంటుకట్టి ‘బ్రిమాటో’ అంటు మొక్కల్ని రూపొందించారు. బ్రిమాటో మొక్క ద్వారానే వంకాయలు, టొమాటోలు కూడా పండించవచ్చు. డ్యూయల్ గ్రాఫ్టింగ్ ద్వారా మంచి దిగుబడులు సాధించినట్లు ఐఐవిఆర్ ప్రకటించింది. ‘బ్రిమాటో’ గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు? అడవి వంగ మొక్కను వేరు మొక్క(రూట్స్టాక్)గా తీసుకొని.. దానిపైన ‘కాశీ సందేశ్’ హైబ్రిడ్ వంగ, ‘కాశీ అమన్’ హైబ్రిడ్ టొమాటో మొక్కలను డా. అనంత్ బహదూర్ గ్రాఫ్టింగ్ చేశారు. 25–30 రోజుల వంగ, 22–25 రోజుల టొమాటో మొక్కలను సైడ్ / స్లైస్ పద్ధతిలో గ్రాఫ్టింగ్ చేసి ‘బ్రిమాటో’ అంటుమొక్కలను సిద్ధం చేశారు. వేరు మొక్క, పైమొక్క కాండాలను 5–7 ఎం.ఎం.ల మేరకు ఏటవాలుగా కత్తిరించి అంటు కడతారు. అంటుకట్టిన వెంటనే మొక్కలను పాలీహౌస్లో పెట్టి తగినంత ఉష్ణోగ్రత, తేమ, వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. 5–7 రోజుల తర్వాత మొక్కల్ని బయటకు తెచ్చి, మరో 5–7 రోజులు నీడలో ఉంచుతారు. ఆ విధంగా గ్రాఫ్టింగ్ చేసిన మొక్కల్ని 15–18 రోజుల తర్వాత మడుల్లో నాటుతారు. అంటే.. ఇదంతా కలిపి నెల రోజుల పని. తొలి దశలో వంగ, టొమాటో అంట్లు సమానంగా పెరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. కాండానికి అంటుకట్టిన చోటుకు కింద వైపు పిలకలు పెరగనివ్వరు. వస్తే వెంటనే తీసివేస్తారు. మొక్కకు 5 కిలోల దిగుబడి హెక్టారుకు 150: 60: 100 మోతాదులో ఎన్‌పికె ఎరువులతో పాటు 25 టన్నుల పశువుల ఎరువు వేసుకున్న తర్వాత అంటు మొక్కలు నాటుకోవాలని ఐఐవిఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నాటిన 60–70 రోజులకు వంగ, టొమాటో మొక్కలకు కాపు ప్రారంభమవుతుంది. ఐఐవిఆర్ ప్రదర్శన క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగు చేసినప్పుడు.. ఒక ‘బ్రిమాటో’ మొక్క నుంచి 36 టొమాటోలు (2.38 కిలోలు), 9 వంకాయల (2.7 కిలోలు) వరకు.. మొత్తం కలిపి 5 కిలోల దిగుబడి వచ్చింది. నగరాలు, పట్టణాల్లో మిద్దెల పైన, పెరట్లో స్థలం తక్కువగా ఉండే ఇళ్ల దగ్గర మడులు, కంటెయినర్లలో పెంచుకోవడానికి, వాణిజ్యపరంగా ఆరుబయట పొలాల్లో పెంచుకోవడానికి కూడా డ్యూయల్ గ్రాఫ్టెడ్ బ్రిమాటో మొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఐఐవిఆర్ తెలిపింది. ‘పూలు, పండ్ల మొక్కలకే గతంలో పరిమితమైన డ్యూయల్ గ్రాఫ్టింగ్ పద్ధతిలోనే కూరగాయ మొక్కలకు అంటుకట్టి ‘బ్రిమటో’ మొక్కల్ని తయారు చేశాం. పౌష్టికాహార భద్రతకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుంద’ని ఐఐవిఆర్ సంచాలకులు డా. టి.కె.బెహర అన్నారు. గ్రాఫ్టింగ్‌కు నెల రోజుల సమయం పడుతుంది. మొక్కను రూ. 10–11కు అందుబాటులోకి తేవచ్చు. భారీగా ఈ అంటు మొక్కల్ని వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తే ధర ఇంకా తగ్గొచ్చు. ఇంకా ఇతర కూరగాయ పంటలకు సంబంధించి కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాం అన్నారాయన. ప్రకృతి సాగుకూ అనువైనవే! డ్యూయల్ గ్రాఫ్టెడ్ ‘బ్రిమాటో’ అంటు మొక్కల ద్వారా ఒకేసారి వంకాయలు, టొమాటోలను పండించుకోవచ్చు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూడా సాధారణ సాగు పద్ధతిలో మాదిరిగానే మంచి దిగుబడులు పొందవచ్చని ఐఐవిఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. అనంత్ బహదూర్ ‘సాక్షి’కి తెలిపారు. ఎక్కువ దూరం రవాణా చేస్తే అంటు మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, స్థానికంగానే ఔత్సాహికులకు అంటుకట్టే నైపుణ్యాన్ని నేర్పిస్తే మేలని ఈ–మెయిల్ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. వేరు మొక్కపై రెండు కూరగాయ మొక్కల్ని అంటుకట్టే పద్ధతిని ఒక్క రోజులోనే ఔత్సాహికులకు సులభంగా నేర్పవచ్చని డా. అనంత్ బహదూర్ అన్నారు. -పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: Organic Farming: 34 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...! -
మల్టి ‘ఫుల్’ జోష్
సాక్షి, మంచిర్యాల: వరి వేస్తే కొంటారో కొనరో తెలియదు. కొన్నా పెట్టుబడి కూడా వస్తుందో లేదోనని భయం. పత్తి పండిస్తే తెగుళ్ల బెడద. సమయానికి కూలీలు ఉంటారో లేరోనని ఆందోళన. ఈ కష్టాల నుంచి గట్టేక్కేందుకని ఉమ్మడి ఆదిలాబాద్ రైతులు ఒకసారి ప్రత్యామ్నాయ పంటలు వేసి చూశారు. అంతే.. మునుపటి పంటలతో పోలిస్తే మంచి లాభాలు రావడంతో వెనక్కి చూడలేదు. మిశ్రమ పంటలు వేస్తూ ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి కూరగాయలు, పండ్లు, పూలు కూడా పండిస్తున్నారు. ప్రభుత్వ విధానాలెలా ఉన్నా మార్కెట్‌ను తట్టుకొని నిలబడుతున్నారు. కొందరైతే డ్రాగన్ ఫ్రూట్, ఆయిల్ పామ్ లాంటి పంటలూ పండించడం మొదలుపెట్టారు. కూరగాయలతో రోజూ ఆదాయం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల తాటిగూడెంకు చెందిన శ్రీనివాస్ తన రెండెకరాల భూమిలో వానాకాలంలో వరి పంట సాగు చేస్తున్నాడు. యాసంగిలో వరి కాకుండా రకరకాల ఆహార పంటలేస్తున్నాడు. ఎకరా భూమిలో పాలిహౌస్‌ను ఏర్పాటు చేశాడు. అంతర పంటల సాగు , పంట మార్పిడి పద్ధతితో రోజువారీగా ఆదాయాన్నీ పొందుతున్నాడు. ప్రతి ఏడాది యాసంగిలో సుమారు రూ. 2.55 లక్షలకు పైబడి సంపాదిస్తున్నాడు. టమాట సాగు ద్వారా రూ.18,500, మిరప నుంచి రూ.14,500, క్యాబేజీతో రూ.14,000 కాకర, బీరతో రూ.53,000, దోసతో రూ.15,000 వరకు ఆర్జిస్తున్నాడు. వీటితోపాటు పాలు, గుడ్లు, పశుపోషణతో మరో రూ.1.36,000 పొందుతున్నాడు. ఖాళీ ఉంటే పంట వేయడమే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారంకు చెందిన తాళ్లపల్లి శ్రీనివాస్ తన పదెకరాల భూమిలో విభిన్న పంటలు వేస్తున్నాడు. ఐదెకరాల్లో మామిడి, నాలుగెకరాల్లో వరి, ఎకరంలో కంది, మిర్చి, వంకాయ, టమాటతో పాటు మొత్తం 25 రకాల మిశ్రమ కూరగాయాలు పండిస్తున్నాడు. పొలం గట్టుల చుట్టూ, ఖాళీ ప్రదేశాల్లో జామ, అరటి, బొప్పాయి, దానిమ్మ, బత్తాయి, పనాస, అల్లనేరేడు, ఆపిల్ బేర్, చింతతో పాటు అనేక రకాలు మొక్కలు నాటాడు. బంతి పూలూ సాగు చేస్తున్నాడు. ఇంటి అవసరాలకు పోను మార్కెట్లోను సేంద్రియ పండ్లను అమ్ముతున్నాడు. ఈ యాసంగిలో కొత్తగా కుసుమ సాగుకు సిద్ధమయ్యాడు. సేంద్రియ సాగు కాబట్టి కూరగాయాలకు, పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటోంది. డిమాండ్‌ను బట్టి పంటలను మార్చుతున్నాడు. డ్రాగన్ ఫ్రూట్.. 30 ఏళ్లదాకా పండ్లే పండ్లు మంచిర్యాల జిల్లా కన్నెపల్లికి చెందిన జాడి సాయితేజ, విశ్వతేజ ఓవైపు చదువుకుంటూనే వాణిజ్య పంటలు సాగు చేస్తున్నారు. తండ్రి రాజలింగు అకాల మరణంతో డ్రాగన్ ఫ్రూట్ పండించాలనే ఆయన కలను కొడుకులు సాకారం చేస్తున్నారు. వారికున్న భూమిలో రెండెకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు మొదలుపెట్టారు. ప్రత్యేకంగా అధ్యయనం చేసి మరీ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ కిలో రూ.150 నుంచి 200 పలుకుతోంది. సేంద్రియ పద్ధతిలో పండిస్తే నగరాల్లో మరింత డిమాండ్ ఉంటుంది. ఒకేసారి పెట్టుబడి పెట్టి ఎక్కువకాలం సాగు చేసుకోవచ్చు. ఒకసారి విత్తుకుంటే 30 ఏళ్ల పాటు ఫలాలనిస్తాయి. సంప్రదాయ పంటలకు పూర్తిగా భిన్నమైన పంట డ్రాగన్ ప్రూట్. వరికి మించి లాభం మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని రెబ్బెన గ్రా మానికి చెందిన గట్టు భీమా గౌడ్ వరి పంటకు పరిమి తం కాకుండా వాణిజ్య పం టలైన మిరప,మొక్కజొన్న, కూరగాయలు సాగు చేస్తూ లాభాలు పొందుతున్నాడు. మూడెకరాల్లో వరి, 4 ఎకరాల్లో పత్తితో పాటు ఎకరం మిరప తోట, అరెకరం మొక్కజొ న్న, మరో అరెకరంలో కూరగాయల సాగు చేస్తున్నాడు. మిర్చి, మొక్కజొన్న, కూరగాయల సాగు లో ఎకరాకు వరి కన్నా రూ.20 వేలు పైనే లాభం వస్తోందని చెబుతున్నాడు. సొంతూరితో పాటు చుట్టుపక్కల ప్రజలూ మిర్చి, కూరగాయలు, మొక్కజొన్న కంకులు కొనుగోలు చేస్తుండటంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. చుట్టూ సోయా.. మధ్యలో కంది పత్తి సాగు చేస్తే గులాబీ పు రుగు ఉధృతి, తెగుళ్లతో ది గుబడి రావట్లేదు. పైగా కూలీల కొరత. అందుకే సో యా, కంది పంటలను సా గు చేస్తూ లాభాలు పొందు తున్నాడు ఆదిలాబాద్ జిల్లా తాంసికి చెందిన యువ రైతు సామ రాహు ల్ రెడ్డి. తనకున్న 8 ఎకరాల్లో సోయా, అందులో అంతర పంటగా కందిని సాగు చేస్తున్నాడు. సోయా సాగుకు ఖర్చు ఎక్కువేం లేదు. యాసంగిలో సాగు చేసిన సోయా, కంది పూర్తయ్యాక రబీలో జొన్న, పెసర పంటలనూ సాగుచేస్తున్నాడు. ప్రస్తుత యాసంగిలో సోయా 65 క్వింటాళ్లు వచ్చిందని రాహుల్ రెడ్డి చెప్పాడు. -
ఆ.. ఇల్లే ఒక ‘బృందా’వనం
మిర్యాలగూడ టౌన్: ఇంట్లో కొద్దిపాటి స్థలం ఉంటే చాలు..ఓ గది కట్టేద్దాం అనుకుంటాం. కానీ ఆ మహిళ తన ఇంటినే ఓ ఉద్యానవనంగా మార్చేసింది. తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి స్థలంలో పలు ఉద్యాన పంటలు వేశారు. పూల కుండీల్లో వివిధ రకాల మొక్కలు, కూరగాయాల మొక్కలను సాగు చేస్తూ అందరికి ఎంతో ఆదర్శంగా నిలుస్తుంది. తన ఇంటిపైన వివిధ రకాల పూలు, కురగాయాలు, ఆకు కూరలు, పండ్లు పండిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాది ఓ మహిళ. ఎప్పుడు వంటింటిలో బీజీబీజీగా ఉండే ఈ మహిళకు మొక్కలు అంటే ఎంతో ప్రాణం. ఒక వైపు కుటుంబం కోసం మరో రెండు గంటల పాటు తన ఇంటిపై ఏర్పాటు చేపిన వనంపై సమయం కేటాయిస్తుంది పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి. మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేటలో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ గోవర్ధనాచారి సతీమణి పద్మాగోవర్ధనాచారి గత కొంత కాలంగా సాంప్రదాయ ఎరువులను ఉపయోగించి మంచిదిగు సాగును చేస్తుంది. బృందావనంలా మారిన ఇల్లు: హనుమాన్‌పేటలో నివాసం ఉండే పయిడిమర్రి పద్మాగోవర్ధనాచారి ఇంటిపై అడుగుపెడితే చాలు అది ఒక బృందావనవనంగా ఉంటుంది. పచ్చదనం అంటే ఆమెకు ఎనలేని ప్రేమ. తన ఇంటి స్లాబ్‌పై వివిధ రకాల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయాలు, పండ్ల మొక్కలు, రసాయన రహితంగా సహాసిద్దమైన పద్దతిలో పెంచుతుంది. అయితే ఏ జాతి మొక్కలకు ఎంత నీరు అవసరం, ఎంత వరకు సూర్యరష్మిపెరుగుతుంది. ఏ మొక్కకు ఎంత ఉష్ణోగ్రత ఉంటే తట్టుకుంది. ఎలా పండిస్తే భూసారం పెరుగుతుందనే విషయంపై తన భర్త సలహాలు, సూచనలు తీసుకుంటుంది. తన ఇంటి మూడవ ఆంతస్తుపై పర్మినెంట్‌గా గ్రీన్ సేట్‌ను ఇనుప సువ్వలతో తయారు చేసి పర్మినెంట్‌గా ఏర్పాటు చేసింది. కాగా ఐదారు డ్రమ్‌లు, 15 వరకు కుండీలు, బకెట్లలో రెండు ట్రాక్టర్ల ఎర్రమట్టితో స్లాబ్ మీమ్‌లపై డ్రమ్ములు పెట్టి వివిధ రకాల మొక్కలతో పాటు ఆకుకూరలను వేసింది. వివిధ రకాల పంటలు: పగిడిమర్రి పద్మాగోవర్ధనాచారి తన ఇంటిపైన పందిరి వేయడంతో పాటు వివిధ కుండీలలో పూల మొక్కలు గులాబి, మల్లే, చామంతి, మందారం, లిల్లి, పారిజాతం, నూరు వరాల చెట్టులతో పాటు పలు రకాల పూల మొక్కలను పెంచుతున్నారు. అదే విధంగా ఆకు కూరలు అయిన పాలకూర, బచ్చలకూర, మోంతుకూరలను పెంచుతున్నారు. తీగ పాదులకు పందిరి వేసి బీర, సోర, కాకర, దొండ, చిక్కుడు, దోసకాయలను పందిరిపైకి ఎక్కించాడు. అదే విధంగా కూండీలలో వంగ, టమాట, మిర్చి, బెండ, కోతిమీర, పూదీనా, కరివేపాక, మిర్చి వంటివి పండిస్తున్నాడు. అదే విధంగా జామ, ద్రాక్షతో పాటు మరిన్ని పంటలను ఇంటిపై పెంచుతూ పలువురిని ఆకట్టుకుంటున్నారు. వీటికి డ్రిఫ్తో ఖాళీ బాటిళ్లు, క్యాన్ల ద్వారా నీటి పోస్తున్నారు. మొక్కలతో ఎంతో ఆరోగ్యం తన ఇంటిపై ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో గ్రీన్ సెట్‌ను ఏర్పాటు చేసి ఈ మొక్కలకు ఎంత సూర్యరశ్మి అవసరం ఉంటుంది అనే దానిపై ఏర్పాటు చేశాం. ఇంటి మేడపై పూల మొక్కలు, కూరగాయాలతో పాటు వివిధ రకాల పండ్లను పెంచుతున్నాం. గత రెండేళ్లుగా తన ఇంటిపై పండిన కూరగాయాలు, పువ్వులను కూడా వాడుతున్నాం. అదే విధంగా పండ్లు కూడా మేము వేసిన చెట్టు ద్వారా వచ్చే పండ్లు, కూరగాయాలు తీనడంతో ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఆరోగ్యకరమైన కూరగాయాలను తీçనవచ్చు. దీని వలన ఒక వైపు పచ్చదనం, మరో వైపు మన ఇంటి అవసరాలు కూడా వెళ్లుతున్నాయి. – పగిడిమర్రి పద్మగోవర్ధనాచారి, మిర్యాలగూడ -
సేంద్రియ కూరగాయల సాగుకు ‘కదిలే పై కప్పు’ పాలిహౌస్! ప్రయోజనాలెన్నో..
కూరగాయ పంటలను సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడానికి అనువైన ప్రత్యేకమైన కదిలే పై కప్పు కలిగిన పాలిహౌస్‌లు త్వరలోనే మన రైతులకు అందుబాటులోకి రానున్నాయి. సాధారణ పాలిహౌస్ పైకప్పు స్థిరంగా ఉంటుంది. దీని వల్ల పాలిహౌస్‌లో సాగవుతున్న పంట (ఎన్ని జాగ్రత్తలు పాటించినప్పటికీ) అనివార్యంగా కొన్ని ప్రతికూలతలను ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొంటున్నాయి. వేడి వాతావరణంలో పంటలుతీవ్ర వత్తిడికి గురై నష్టపోయే సందర్భాలుంటున్నాయి. అయితే, పాలీహౌస్ పై కప్పు కదిలే వెసులుబాటు ఉండి, అవసరమైతే నిమిషాల్లో పై కప్పును తాత్కాలికంగా పక్కకు జరపడానికి లేదా నిమిషాల్లో మూసేయడానికి వీలుంటే? ఈ వెసులుబాటు ఉంటే పంటల సాగుకు మరింత అనువుగా ఉంటుందని, ముఖ్యంగా సేంద్రియ కూరగాయ పంటలను ఏడాది పొడవునా సాగు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్‌లోని కేంద్రీయ మెకానికల్ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ (సి.ఎం.ఇ.ఆర్.ఐ.), హిమాచల్‌ప్రదేశ్ పాలంపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థలు) శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ వినూత్న పాలీహౌస్‌లను రూపొందించారు. ‘అధిక వేడి, చలి, వర్షం.. వంటి తీవ్రమైన వాతావరణ సంబంధమైన ఇబ్బందులతో సాధారణ పాలిహౌస్ రైతులు బాధలు పడుతూ ఉంటారు. ఈ సమస్యల నుంచి రక్షణ పొందడానికి పై కప్పు కదిలే పాలిహౌస్‌లు ఉపయోగపడతాయి. ముఖ్యంగా సేంద్రియ సాగుకు కూడా ఇవి అనువైనవి..’ అంటున్నారు సి.ఎం.ఇ.ఆర్.ఐ. సంచాలకులు డా. హరీష్ హిరాని. ఆయన ఆధ్వర్యంలో సీనియర్ శాస్త్రవేత్త జగదీశ్ మానిక్‌రావు ఈ కదిలే పై కప్పు పాలిహౌస్లపై పరిశోధనా ప్రాజెక్టుకు సారధ్యం వహిస్తున్నారు. పంజాబ్ రాష్ట్రం లూధియానాలోని సి.ఎం.ఇ.ఆర్.ఐ. విస్తరణ కేంద్రం ఆవరణలో ప్రయోగాత్మకంగా ఈ పాలిహౌస్‌లను నిర్మిస్తున్నారు. ‘పంటలకు తగినంత గాలిలో తేమ, ఉష్ణోగ్రత వంటి వాతావరణ స్థితిగతులను ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇచ్చే సాంకేతిక వ్యవస్థ ఈ పాలిహౌస్‌లలో ఉంటుంది. అందువల్ల సీజనల్, అన్‌సీజనల్ పంటలను కూడా సాగు చేయడానికి వీలవుతుంది’ అని డా. హిరాని వివరించారు. మరో ఆరు నెలల్లోనే ఈ సరికొత్త పాలిహౌస్ టెక్నాలజీలను రైతులకు అందించనున్నామన్నారు. ఏయే పంటలు సాగు చేయొచ్చు? ►పైకప్పు కదిలే పాలిహౌస్‌లలో కీరదోస, చెర్ర టమాటో, క్యాబేజి, కూరమిరప, బ్రకోలి, లెట్యూస్, కాకర, కాళిఫ్లవర్, కొత్తిమీర, పాలకూర వంటి కూరగాయలు, ఆకుకూరలతోపాటు కార్నేషన్, జెర్బర, ఆర్కిడ్స్ వంటి పూలను కూడా సాగు చేయవచ్చని సి.ఎం.ఇ.ఆర్.ఐ. చెబుతోంది. ►పాలిహౌస్‌లో పంట ఎదుగుదల అవసరాలను బట్టి రైతు స్వయంగా మీట నొక్కితే పనిచేసే రకం పాలిహౌస్ ఒకటి ఉంది. కృత్రిమ మేథ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్ల వ్యవస్థ ఆధారంగా దానంతట అదే తెరచుకునే లేదా ముడుచుకునే మరో రకం పాలిహౌస్ కూడా ఉంది. ►మొదటి రకం కన్నా రెండో రకం ఖర్చుతో కూడిన పని. పైకప్పు కదిలే సదుపాయం ఉండే ఈ పాలిహౌస్ నిర్మాణానికి ఖర్చు చదరపు మీటరుకు ఆటోమేషన్ స్థాయిని బట్టి రూ. 1,500 నుంచి 3,000 వరకు ఉంటుందని సిఎంఇఆర్ఐ ప్రతినిధి అజయ్ రాయ్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. సాధారణ పాలిహౌస్ కన్నా ఏ విధంగా మెరుగైనది? సాధారణ పాలిహౌస్తో పోల్చితే పై కప్పు కదిలే సదుపాయం ఉన్న పాలిహౌస్ ప్రయోజనాలు ఇవి.. ►ఆరుబయట పొలాలు, నేచురల్లీ వెంటిలేటెడ్ పాలిహౌస్‌లతో పోల్చితే ఈ పాలిహౌస్ ద్వారా అధిక దిగుబడి వస్తుంది. పంట దిగుబడుల నిల్వ సామర్ధ్యం ఇనుమడిస్తుంది. ►ఇన్ఫ్రారెడ్ రేడియేషన్‌ను తగ్గించడం ద్వారా పంటను అధిక వేడి నుంచి కాపాడుతుంది. సాధారణ సాగు పద్ధతుల్లో కన్నా ఇందులో పండించే పంటలు ‘ఫొటోసింథటికల్లీ యాక్టివ్’గా ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి మెరుగైన నాణ్యతతో అధిక దిగుబడిని పొందవచ్చువెంటిలేటర్లను సరిచేయడం ద్వారా పాలిహౌస్ లోపల గాలిలో తేమ పాలిహౌస్ అన్ని వైపులా ఒకేలా ఉండే విధంగా నియంత్రించవచ్చు ►వాతావరణం నుంచి గాలి, కార్బన్ డయాక్సయిడ్ల మార్పిడి పాలిహౌస్ అంతటా సరిసమానంగా ఉంటుంది ►గాలిలో తేమ, కాంతి బాగా అందుతుంది కాబట్టి పంటల ఎదుగుదల బాగుంటుంది ►సేంద్రియ వ్యవసాయానికి బాగా అనువైన సాంకేతికత ఇది సాధారణ పాలిహౌస్‌లలో మాదిరిగా కాకుండా అవసరం మేరకు నేరుగా ఎండ తగలటం వల్ల మొక్కలు దట్టంగా పెరుగుతాయి సాధారణ పాలిహౌస్ వల్ల ఎదురవుతున్న సమస్యలు సాధారణ పాలిహౌస్ పైకప్పు కదల్చడానికి వీల్లేకుండా, ఎప్పుడూ బలంగా బిగించి ఉంటుంది. శాశ్వత పైకప్పు వల్ల ఉన్న సమస్యలు.. ►పాలీహౌస్లో ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. ►ఉదయం, సాయంత్రపు వేళల్లో సూర్యకాంతి పంటలకు సరిపడినంత అందదు. ►పంటలకు తగినంత కార్బన్ డయాక్సయిడ్ అందదు. పంట మొక్కల నుంచి తగినంతగా నీటి ఆవిరి విడుదల కాదు. నీటి వత్తిడి ఉంటుంది. అందువల్ల సాధారణ పాలిహౌస్‌లలో పెరిగే పంటలు మెతకబారి చీడపీడలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ‘కదిలే పై కప్పు పాలిహౌస్’ వల్ల రైతులకు ప్రయోజనాలు ►ఆయా కాలాల్లో సాగు చేయదగిన, సాధారణంగా ఆ కాలంలో సాగు చేయని పంటలను సైతం ఈ పాలిహౌస్‌లో సాగు చేసుకోవచ్చు ►పంటలకు తెగుళ్లు, పురుగుల బెడద తక్కువగా ఉంటుంది ►పంట కోత కాలం పెరుగుతుంది ►సాగు ఖర్చు తగ్గుతుంది ►ఏడాది పొడవునా రైతులు నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు పొందవచ్చు ►అర్బన్ అగ్రికల్చర్‌కు అనువైనది ఇతర వివరాలకు.. అజయ్ రాయ్, హెడ్, ఎంఎస్ఎంఇ గ్రూప్, సిఎస్ఐఆర్ – సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్. ఫోన్ నంబర్లు: 094746 40064, 087590 39523 ajoy.roy@cmeri.res.in kumarajoy1962@gmail.com www.cmeri.res.in ఏపీ, తెలంగాణలో ప్రయోగాత్మక సాగు చేపడతాం.. కదిలే పై కప్పు గల పాలిహౌస్ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది. పాలిహౌస్‌లో పెరుగుతున్న పంటకు వర్షం/ఎండ ఎంతసేపు అవసరమో అంతసేపు తెరచి ఉంచుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు మూసేయవచ్చు. చలి/కొండ ప్రాంతాల కోసం దీన్ని తొలుత డిజైన్ చేశాం. వర్షాధార వ్యవసాయానికి కూడా ఇది పనికొస్తుంది. దక్షిణాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి ఇవి సరిపోతాయా? లేదా? అనే విషయం ఇంకా అధ్యయనం చేయలేదు. త్వరలో ప్రయోగాత్మకంగా సాగు చేసి చూడాలనుకుంటున్నాం. – డా. జగదీష్ మానిక్‌రావు, సీనియర్ శాస్త్రవేత్త, సిఎస్ఐఆర్ – సిఎంఇఆర్ఐ – సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ ఫామ్ మెషినరీ, గిల్ రోడ్డు, లూధియానా– 141006 -
ఎడారిలో పచ్చదనం
కరోనా ప్రపంచాన్ని నాలుగ్గోడలకు పరిమితం చేసింది. చదువు, ఆట, పాట అన్నీ ఆ గోడల మధ్యనే. కంప్యూటర్ స్క్రీన్ మీద పాఠాలు నేర్చుకోవడంతో సరిపెట్టడం కాదు. ఇంకేదో చేయాలి. ఏదైనా చేయడానికి కావల్సినంత ఖాళీ సమయం కూడా ఇదే అనుకుంది పదిహేడేళ్ల నిషా పాఠక్. పాఠక్ ఏం చేసిందంటే... నిషా పాఠక్‌ది రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్‌నగరం, ప్లస్‌టూ చదువుతోంది. ఆన్లైన్ క్లాసుల తర్వాత మిగిలిన సమయం మొత్తం చెట్ల మధ్య గడపడం అలవాటు చేసుకుంది. టొమాటో, ఉల్లిపాయ, బంగాళదుంప పండించి ఇంటి దగ్గరలో నివసించే పేదవాళ్లకు పంచింది. ఆ తర్వాత వాళ్లకు కూడా పండించడం నేర్పించింది. వాళ్ల కోసం ఇంటి ఆవరణలో ఉచితంగా వర్క్‌షాపు నిర్వహిస్తోంది. ఎక్కువ ఖర్చు లేకుండా వారం– పది రోజుల్లో పంటకొచ్చే పాలకూర, మెంతికూర, ఆవ ఆకు వంటివి పండించడంలో శిక్షణనిస్తోంది. ఎండాకాలంలో జైపూర్ నేలలో పండించడానికి సాధ్యంకాని ఆకు కూరలను ఆమె పాలప్యాకెట్లలో తక్కువ నీటితో పండిస్తోంది. ఆమె ప్రయత్నం సక్సెస్ అయింది. ఇలా పెంచుతోంది! పాలపాకెట్‌ను శుభ్రం చేసి ఆరబెట్టి, అడుగున చిన్న రంధ్రాలు ముప్పావు వంతు ప్యాకెట్‌ను ఆర్గానిక్ పాట్ మిక్చర్ (సేంద్రియ ఎరువుతో కూడిన మట్టి)తో నింపుతోంది. మెంతులు, ఆవాలను రాత్రంతా నానబెట్టి ఒక్కో ప్యాకెట్లో ఒక టీ స్పూన్ గింజలను పలుచగా చల్లుతోంది. గింజల మీద గుప్పెడు మట్టిని ఒక పొరలాగ పరిచి నీటిని చిలకరిస్తోంది. వారం రోజులకు ఆకు కూరలు కోతకు వస్తాయి. పై పొర మట్టిని తొలగించి మళ్లీ గింజలను చల్లుకోవడమే. తాజా ఆకుకూరల రుచి ఎరుగని ఎడారి ప్రాంతంలో నిషా పాఠక్ అనుసరించిన మైక్రోగ్రీన్ ఫార్మింగ్‌కి అభిమానులు, అనుచరులు పెరిగిపోతున్నారు. ఆమె పేదవాళ్ల కోసం నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను బంధువులు, స్నేహితులు ఆన్లైన్లో ఫాలో అవుతున్నారు. -
ఎవర్గ్రీన్ ఫార్మర్!
ప్రకృతి వ్యవసాయం వైపు పయనించేలా యువ రైతులను ఒప్పించడమే సులువు, పెద్దలకు నచ్చజెప్పటం కష్టం అనే అభిప్రాయం ఒకటుంది. అయితే, ఒంటరి మహిళా రైతు తిరుపతమ్మ అనుభవం అందుకు భిన్నమైనది. అలవాటు లేని ప్రకృతి వ్యవసాయాన్ని ముదిమి వయసులో కూడా శ్రద్ధగా నేర్చుకొని, అనుసరిస్తున్నారు. స్వతంత్రంగా జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారామె. మానికల తిరుపతమ్మ వయస్సు 75 ఏళ్లు. కృష్ణా జిల్లా నూజివీడు మండలంలోని ముసునూరు ఆమె ఊరు. ఇంటికి దగ్గరల్లోనే తనకున్న 20 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారామె. గతంలో భర్తతో కలిసి రసాయనిక వ్యవసాయం చేసుకుంటూ, తీరిక రోజుల్లో కూలి పనులకు వెళ్లేవారు. ముగ్గురు అబ్బాయిలకు పెళ్లిళ్లయ్యాయి. ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. మూడేళ్ల క్రితం భర్త కూడా చనిపోవడంతో ఆమె ఒంటరిగా తమ సొంత పూరింటిలో నివాసం ఉంటోంది. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఎవరిపైనా ఆధారపడకూడదని, తనను తాను పోషించుకోవాలన్నది ఆమె పట్టుదల. ఆ పట్టుదలే పెట్టుబడిగా ప్రకృతి వ్యవసాయం వైపు ఆర్నెల్ల క్రితం అడుగులేసింది. ప్రకృతి సాగు దిశగా.. రైతుగా ఆమె ఉత్సుకతను గుర్తించిన ప్రకృతి వ్యవసాయ విభాగంలో సిబ్బంది సాగులో మెలకువలను చెప్పడమే కాదు.. ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. వంగ, బెండ, చిక్కుడు, గోరుచిక్కుడు, బీర, టమోటా, మునగ, పచ్చి మిర్చి, తోటకూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, పాలకూర, తోటకూర విత్తనాలను కూడా ఆమెకు ఉచితంగా ఇచ్చారు. ఘన, జీవామృతాలు ఎలా తయారు చేయాలో శిక్షణనిచ్చారు. ఈ కూరగాయ విత్తనాలతో పాటు బొప్పాయి, జామ, మామిడి, అరటి మొక్కలను కూడా నాటింది. ఆర్నెల్ల క్రితం సాగులో మెలకువలను అంది పుచ్చుకొని ప్రకృతి సాగు చేస్తోంది. కోడి కూయక ముందే నిద్ర లేస్తుంది తిరుపతమ్మ. అప్పటి నుంచి రాత్రి వరకు ఆ తోటే ఆమె లోకం. అన్ని పనులూ తానే చేసుకుంటుంది. ఆవు మూత్రాన్ని లీటరు రూ. 5కు కొనుకొని పొరుగు రైతుల దగ్గరి ఆవుల నుంచి పేడ తెచ్చుకొని జీవామృతం, ఘనజీవామృతం తానే తయారు చేసుకొని వాడుకుంటుంది. పంచాయితీ వారి కుళాయి నీటినే తొట్టెలోకి పట్టి పెట్టుకొని పంటలకు పోస్తుంది. వృద్ధాప్యంలో కూడా మనోనిబ్బరంతో ఒంటరిగా ప్రకృతి వ్యవసాయం చేయడమే కాదు పంటను మారు బేరానికి అమ్మకుండా నేరుగా తానే వినియోగదారులకు అమ్ముకొని జీవిస్తుండటం తిరుపతమ్మ ప్రత్యేకత. కూరగాయలు, ఆకుకూరలను కోసి గంపకెత్తుకొని సాయంత్రం 4 గంటలకల్లా కాలినడకన ఊళ్లోకి బయల్దేరుతుంది. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట కావటంతో తిరుపతమ్మ కూరగాయల కోసం గృహిణులు ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఆకుకూరల పెద్ద కట్ట రూ. 10. బీర, మిరప కిలో రూ. 40. వంగ, టమాటో, కాకర కిలో రూ. 30. ఇతర కూరగాయలు రూ. 20. సరసమైన ధరలకే అమ్ముతుండటంతో గంటలోనే గంప ఖాళీ అవుతుంటుంది. ఇలా రోజూ దాదాపు రూ.250ల వరకు ఆదాయం ఆర్జిస్తుండటం విశేషం. అమృతాహారాన్ని ప్రజలకందిస్తూ వృద్ధాప్యంలోనూ ఆదర్శప్రాయంగా స్వతంత్ర జీవనం సాగిస్తున్న మహిళా రైతు తిరుపతమ్మకు జేజేలు! – పంపాన వరప్రసాద్, సాక్షి, అమరావతి ఎవరిమీదా ఆధారపడకూడదనే.. భర్త చనిపోయాడు. కొడుకుల దగ్గరకు వెళ్లడానికి మనసు రాలేదు. ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు చేతనైన ఏదో ఒక పని చేయాలనిపించింది. ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని కూరగాయలు పండిస్తున్నా. అధికారులు చెప్పినట్టు ఎప్పటికప్పుడు పనులు చేస్తున్నా. అంతే.. మంచి పంట పండుతోంది.. లాభం వస్తోంది. – మనికల తిరుపతమ్మ, ముసునూరు, నూజివీడు ఆమె ఉత్సుకత చూసి ప్రోత్సహించాం 75 ఏళ్ల వయస్సులో ఆమెలో ఉత్సుకతను చూసి ప్రకృతి సాగు వైపు ప్రోత్సహించాం. సాగులో మెలకువలను అందిపుచ్చుకొని.. సుదీర్ఘ అనుభవం కలిగిన రైతులను తలదన్నేలా శ్రద్ధగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. – విజయకుమారి, డీపీఎం, ఏపీసీఎన్ఎఫ్, కృష్ణా జిల్లా -
వాటర్ క్యాన్ డ్రిప్!
సేంద్రియ ఇంటిపంటల సాగులో ద్రవ జీవామృతం, ఆవుమూత్రం, జీవన ఎరువులను కూరగాయ మొక్కలకు సులభంగా అందించడానికి ఉపయోగపడే అతి తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి ఇది. పుల్లయ్యగారి బ్రహ్మానందరెడ్డి, అనిత దంపతులు వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో తమ ఇంటి వద్ద పెరట్లో కొన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయడం రెండు నెలల క్రితం ప్రారంభించారు. తాము నివాసం ఉండే భవనం పక్కనే 40 అడుగుల వెడల్పు, 70 అడుగుల పొడవున ఖాళీ స్థలం(ఎర్ర నేల)లో సేంద్రియ పెరటి తోట సాగు చేస్తున్నారు. ఈ పెరటి తోటకు రోజువారీగా నీటిని, జీవామృతం, జీవన ఎరువులు వంటి ద్రవ రూప ఎరువులను తక్కువ సమయంలో, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో అందించడానికి ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఇంటిపైన నిర్మించిన వాటర్ ట్యాంకు నుంచి నీటిని సరఫరా చేసే పైపునకు గేట్ వాల్ సిస్ఠం ఏర్పాటు చేసుకొని.. ఇన్లైన్ డ్రిప్పర్ లైన్ల ద్వారా నీటిని కూరగాయ మొక్కలకు అందిస్తున్నారు. రోజువారీగా నీటిని అందించడానికి ఇది పనికొచ్చింది. అయితే, ద్రవ రూప ఎరువులను కూడా నీటితోపాటే అందించేదెలా? అని ఆలోచించారు. తాగునీటి సరఫరా కోసం ఉపయోగించే 20 లీటర్ల వాటర్ క్యాన్‌ను ఏర్పాటు చేసి, దీని ద్వారా డ్రిప్ లైన్‌ను అనుసంధానం చేస్తూ సునాయాసంగా ద్రవ రూప ఎరువులను సైతం ఇంటిపంటలకు ఇవ్వగలుగుతున్నారు. తొలుత నీరు.. తర్వాత ద్రవ రూప ఎరువులు.. మిత్రుడు ప్రకృతి వ్యవసాయదారుడు ప్రవీణ్‌కుమార్ రెడ్డి తోడ్పాటుతో అనేక రకాల ప్రయోగాలు చేసే క్రమంలో ఈ ‘లో కాస్ట్ ఫర్టిగేషన్ సిస్టమ్ ఫర్ కిచెన్/టెర్రస్/అర్బన్ గార్డెనింగ్’ను రూపొందించామని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. వడకట్టిన ద్రవజీవామృతం లేదా ఆవు మూత్రం లేదా అజోస్పిరిల్లమ్, ఫాస్పోబాక్టీరియా వంటి జీవన ఎరువుల ద్రావణాలను 3 రోజులకు ఒక్కో రకాన్ని ఇంటిపంటలకు అందిస్తున్నారు. 20 లీటర్ల వాటర్ క్యాన్‌లో 2 నుంచి 4 లీటర్ల ద్రవ జీవామృతం లేదా ఆవు మూత్రం లేదా జీవన ఎరువుల ద్రావణాన్ని కలుపుతారు. పెరటి తోటలో బ్రహ్మానందరెడ్డి, అనిత ద్రవ రూప ఎరువుల సరఫరా ఇలా.. వాటర్ క్యాన్‌కు పైన ఎయిర్ వాల్వ్ బిగించారు. ఎయిర్ వాల్వ్ మూతను విప్పి.. అందులో నుంచి వాటర్ క్యాన్లోపలికి ద్రవ రూప ఎరువులను వడకట్టి పోస్తారు. ఆ తర్వాత డ్రిప్ ద్వారా నీటిని వదులుతారు. వాటర్ క్యాన్ లోపలకు నీరు వెళ్లేందుకు కింది భాగం నుంచి ఒక ఇన్లెట్, బయటకు నీరు పోవడానికి పై భాగంలో ఒకటి, కింది భాగంలో మరొకటి అవుట్ లెట్లను బిగించారు. ద్రవ రూప ఎరువులను వాటర్ క్యాన్ ద్వారా నీటితో కలిపి వెళ్లేలా చేయాలనుకున్నప్పుడు.. క్యాన్ పై భాగంలోని అవుట్ లెట్ ద్వారా నీటిని బయటకు వెళ్లేలా చేస్తారు. అలా చేయడం ద్వారా 10–15 నిమిషాల పాటు ద్రవరూప ఎరువులు నీటితో కొద్దికొద్ది కలిసి ఇంటిపంటలకు సరఫరా అవుతున్నదని బ్రహ్మానందరెడ్డి తెలిపారు. అవుట్ లెట్ మొదట కింది భాగంలో మాత్రమే ఏర్పాటు చేశానని, అప్పుడు 5 నిమిషాల్లోనే ద్రవ రూప ఎరువు పూర్తిగా వెళ్లిపోయేదన్నారు. క్యాన్‌కు పై భాగంలో అవుట్ లెట్ ఏర్పాటు చేయడం వల్ల 10–15 నిమిషాల పాటు ద్రవ రూప ఎరువుతో కూడిన నీటిని 70 అడుగుల పొడవు డ్రిప్ వరుసలో ఉన్న చివరి మొక్కలకు కూడా అందించగలుగుతున్నామని ఆయన వివరించారు. రసాయనిక అవశేషాల్లేని మిర్చి, వంగ, బీర, సొర, టమాటాలతోపాటు గోంగూర, చుక్క, పాల కూరలను పండించి, బంధుమిత్రులకు కూడా రుచి చూపిస్తున్నామని బ్రహ్మానందరెడ్డి(94411 85563), అనిత సంతోషంగా తెలిపారు. -
సంతృప్తి.. సంతోషం..!
తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మార్కెట్లలో కొత్తిమీర, పుదీన, ఆకుకూరలు, కూరగాయల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. అంతేకాదు.. నగరాలు, పట్టణాల పరిసర ప్రాంతాల్లో గతంలో కూరగాయలు సాగయ్యే భూములు చాలావరకు రియల్ ఎస్టేట్లుగా మారడంతో కూరగాయల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల్లో దూరప్రాంతాల నుంచి కూరగాయలు రవాణా అవుతున్నందున ఈ సీజన్లో ఎన్నడూ ఎరుగనంత ధరలు పలుకుతున్నాయి. ఈ సమస్య కొంత వరకైనా తీరాలంటే నగరాలు, పట్టణాల్లో సొంత ఇళ్లలో నివాసం ఉంటున్న వారు తమ ఇళ్ల పైన కూరగాయలు, ఆకుకూరల సాగుకు ఉపక్రమించడం అవసరం. కేవలం కూరగాయలు, ఆకుకూరల లభ్యత దృష్ట్యానే కాకుండా.. రసాయనిక అవశేషాల్లేని సూక్ష్మపోషకాలతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తులను ఎవరికి వారు ఇంటిపంటల్లో పండించుకోవడం ఆరోగ్యానికి, పర్యావరణానికి కూడా అవసరమే అంటున్నారు హన్మకొండ పట్టణానికి చెందిన విశ్రాంత ఉద్యోగి గుండ్రెడ్డి సుధాకర్‌రెడ్డి. గత ఏడాది కాలంగా ఆయన తన ఇంటిపైన సేంద్రియ పద్ధతుల్లో తమకు ఇష్టమైన సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటూ సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తున్నారు. హన్మకొండ పట్టణంలోని రెడ్డి కాలనీ రోడ్ నెంబర్–2లో నివాసం ఉంటున్న సుధాకర్‌రెడ్డి సింగరేణి కాలరీస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేసి ఆరేళ్ల క్రితం గోదావరిఖనిలో పదవీ విరమణ పొందారు. అనంతరం హన్మకొండలోని సొంత ఇంటికి సుధాకర్‌రెడ్డి మాకం మార్చారు. ప్రతి రోజు ఉదయమే గ్రౌండ్‌కు వెల్లి నడిచిన తర్వాత.. మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు కొని తీసుకొచ్చేవాడు. గత ఏడాది ఇంటిపంటల సాగుపై హనుమకొండలో జరిగిన అవగాహన సదస్సు ప్రేరణ కలిగించి కార్యాచరణకు దారి చూపింది. అనుకున్నదే తడువుగా (20 కిలోల) ఖాళీ పెరుగు డబ్బాలు 50, పాడయిన ఎయిర్ కూలర్ల కింది బాగాలు 20 వరకు సేకరించారు. చివికిన పశువులు ఎరువు, కొబ్బరి పొట్టు, ఎర్ర మట్టి కలిపిన మట్టిమిశ్రమంలో సుధాకర్‌రెడ్డి కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. వంగ, బెండ, టమాట, బీర, గోరుచిక్కుడు, మిర్చి, కొత్తిమీర, మెంతి ఆకు, పాలకూర, తోటకూర, చిక్కుడు విత్తనాలను తొలుత చల్లారు. కొద్ది వారాల్లోనే ఆకుకూరలు, కూరగాయలు చేతికి రావడం ప్రారంభమైంది. ఏడాది తిరిగేటప్పటికి ఇంటిపంటల సాగులో ఆయన అనుభవం గడించారు. ఈ ఏడాది ఎండాకాలంలో కూడా షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకొని వంగ, బెండ, దొండ, పాలకూర, ఎర్ర తోటకూర, పొన్నగంటి ఆకుకూరలను సాగు చేశారు. అవి ఇప్పుడు మంచి దిగుబడిని ఇస్తున్నాయని సుధాకర్‌రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. ఆకుకూరలు ఒక్కో రకాన్ని 3,4 డబ్బాల్లో విత్తానని, ఆకులు కత్తిరిస్తూ ఉంటే.. పది రోజుల్లో మళ్లీ పెరిగి కోతకు వస్తున్నాయన్నారు. ఏ రోజూ ఆకుకూరల కొరత లేకుండా ఉంటున్నదన్నారు. ఈ సంవత్సరం గోరుచిక్కుడు, చిక్కుడు, పొట్లవిత్తనాలు అదనంగా నాటుకున్నానని ఆయన తెలిపారు. వేసవిలో తన కుమారులు ఇద్దరు కుటుంబాలతో తమ ఇంటికి వచ్చినప్పుడు ఇంటిపంటల రుచి చూసి చాలా సంతోషించారన్నారు. వేసవిలో రెండు పూటలా నీరు పోయాల్సిన అవసరం రావడంతో తన కుమారుడే డ్రిప్ ఏర్పాటు చేసి వెళ్లాడని ఆయన తెలిపారు. చిక్కుడు, సొర, బీర తీగలు పాకేందుకు ఇనుప మెష్‌తో ఫెన్సింగ్, జాలీ ఏర్పాటు చేస్తున్నానని సుధాకర్‌రెడ్డి (9491473368) తెలిపారు.– గజ్జి రమేష్, సాక్షి, హన్మకొండ చౌరస్తా -
నలుగురి కుటుంబానికి 49 మీటర్ల పెరటి తోట!
జాతీయ వ్యవసాయ విస్తరణ యాజమాన్య సంస్థ (మేనేజ్) హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఉంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్తలు, అధికారులు, స్టార్టప్స్ ఏర్పాటు చేసుకునే యువతీ యువకులు.. ‘మేనేజ్’లో వివిధ అంశాలపై ఏటా వందలాది మంది శిక్షణ పొందుతూ ఉంటారు. వీరికి సేంద్రియ ఇంటిపంటలపై అవగాహన కలిగించేందుకు.. జెండర్ స్టడీస్ విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ ఇంటిపంటలపై ‘మేనేజ్’ ఆవరణలో నమూనా ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేశారు. 2016 డిసెంబర్ నుంచి మోడల్ వెజిటబుల్ గార్డెన్, మోడల్ బాల్కనీ గార్డెన్‌ను పెంచుతున్నారు. అర్బన్ అగ్రికల్చర్ విభాగంలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యాననిపుణురాలు నాగరాణి ఈ నమూనా ప్రదర్శనా క్షేత్రాలను పర్యవేక్షిస్తున్నారు. నలుగురి కుటుంబానికి (7 మీటర్ల పొడవు“7 మీటర్ల వెడల్పు) 49 చదరపు మీటర్ల పెరట్లో ఏడాది పొడవునా కుటుంబానికి సరిపోయే అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చని తమ అధ్యయనంలో నిర్థారణ అయ్యిందని నాగరాణి ‘సాక్షి’కి తెలిపారు. ఈ 49 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలు సాగు చేసుకుంటే.. రోజుకు 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు కూరగాయల దిగుబడి వస్తుందన్నారు. టమాటా, వంగ, మిరప, కాప్సికం, ఎర్రముల్లంగి, బీట్రూట్, బీన్స్, బెండ, మునగ, నేతిబీర, కాకర, క్యాబేజి తదితర 20 రకాల కూరగాయలు, 7 రకాల ఆకుకూరలతోపాటు అరటి చెట్లు వేర్వేరు మడుల్లో సాగు చేస్తున్నారు. ప్రతి మడి 2 మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. టమాటా వంటి ఎక్కువగా వాడే కూరగాయ మొక్కలు ఎక్కువ లైన్లలో నాటుతామని నాగరాణి వివరించారు. దశల వారీగా విత్తుకోవాలి.. ఇనుప మెష్‌తో కంచె వేసిన ఈ పెరటి తోట పెంచుతున్న భూమి అంతగా సారం లేని గ్రావెల్ మాదిరి భూమి కావడంతో ప్రారంభంలో 2 ట్రక్కుల ఎర్రమట్టి తోలించి, మాగిన పశువుల ఎరువు కలిపి మడులు చేశారు. ఏడాది పొడవునా నిరంతరం కూరగాయలు అందుబాటులో ఉండాలంటే దశలవారీగా పంటలు విత్తుకోవడం లేదా మొక్కలు నాటడం చేయాలని ఆమె అన్నారు. టమాటా, మిర్చి, వంగ వంటి కూరగాయ పంటలు విత్తిన 50–60 రోజుల్లో పూత, కాపు ప్రారంభమవుతుంది. 3–4 నెలలు దిగుబడి వస్తుంది. ప్రస్తుత పంట నెలన్నరలో కాపు అయిపోతుందనగా.. మరో దఫా నారు పోసుకోవాలి లేదా విత్తుకోవాలి. 25 రోజుల నారును తీసి వరుసల్లో నాటుకోవాలి. ప్రతి మడిలోనూ పంట మార్పిడి పాటించాలి. వేసిన పంటే మళ్లీ వేయకూడదు. పంట మార్చిన ప్రతి సారీ వర్మీకంపోస్టు , పశువుల ఎరువు కలగలిపిన మిశ్రమం కొంత వేస్తూ ఉంటే పంటలకు పోషకాల లోపం రాదు. పంటకు ప్రతి పది రోజులకోసారి సేంద్రియ ఎరువులు కొంచెం వేస్తే మంచి దిగుబడులు వస్తాయని నాగరాణి అంటారు. 15 రోజులకోసారి జీవామృతం.. వర్మీవాష్.. జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి 1:10 నిష్పత్తిలో నీటిలో కలిపి పొదుల్లో పోస్తామని నాగరాణి తెలిపారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకోసారి జీవామృతం లేదా వర్మీ వాష్ అదొకసారి ఇదొకసారి పిచికారీ చేస్తున్నారు. రసం పీల్చే పురుగులను అరికట్టడానికి పసుపు, నీలం రంగు జిగురు అట్టలు రెండిటిని పెరటి తోటలో పెట్టుకోవాలి. లింగాకర్షక బుట్టలను ఏర్పాటుచేసుకుంటే కూరగాయ పంటలను ఆశించే లద్దె పురుగును అరికట్టవచ్చు. వేసవిలో కన్నా వర్షాకాలంలో పురుగు ఉధృతి ఎక్కువ, వేసవిలో తక్కువగా ఉంటుందని నాగరాణి తెలిపారు. చీడపీడల నియంత్రణకు అవసరాన్ని బట్టి నాణ్యమైన వేప నూనె లీటరుకు 5–7 ఎం.ఎల్. కలిపి పిచికారీ చేస్తారు. పురుగు మరీ ఉధృతంగా ఉంటే అగ్ని అస్త్రం ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి 200 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేస్తామన్నారు. మోడల్ బాల్కనీ గార్డెన్ 6 మీటర్లు “ 4 మీటర్ల విస్తీర్ణంలో మోడల్ బాల్కనీ గార్డెన్‌ను కూడా నాగరాణి నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కుండీలు, గ్రోబాగ్స్, వర్టికల్ టవర్లలో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. 20% కొబ్బరిపొట్టు + 40% ఎర్రమట్టి + 20% మాగిన పశువుల ఎరువు కలిపి తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని వాడుతున్నట్లు నాగరాణి వివరించారు. మేకల ఎరువుకు వేడి లక్షణం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో మొక్కలకు వేయకూడదు. చలికాలంలో మాత్రమే మేకల ఎరువు వాడాలి. పశువుల ఎరువు ఎప్పుడైనా వాడొచ్చు. 8 అంగుళాల ఎత్తుండే పాలీ బ్యాగ్ ఆకుకూరల సాగుకు సరిపోతుంది. కూరగాయ మొక్కలకు 18 అంగుళాల ఎత్తు, 12 అంగుళాల వ్యాసార్థం కలిగిన పాలీ బ్యాగ్ వాడితేనే ఎక్కువ కాలం కాపు వస్తుంది. 30% షేడ్‌నెట్ హౌస్‌లో కూరగాయల ఉత్పాదకత ఆరుబయట కన్నా ఎక్కువగా వస్తుందని నాగరాణి తెలిపారు. అడుగున్నర ఎత్తు, అడుగు వ్యాసార్థం ఉన్న గ్రోబాగ్‌లో టమాటా మొక్కలు నాటి షేడ్‌నెట్ హౌస్‌లో ఉంచితే వారానికి 500–750 గ్రాముల టమాటాల దిగుబడి, 3 నెలల పాటు వస్తుందన్నారు. సాధారణ ఆకుకూరల్లో కన్నా మైక్రోగ్రీన్స్‌లో 40% అధికంగా పోషకాలు లభిస్తాయని నాగరాణి (97030 83512) అంటున్నారు. 49 చ.మీ.ల నమూనా పెరటి తోట షేడ్‌నెట్ హౌస్‌లో టమాటో మొక్కలు -
జీవ వైవిధ్యమే ప్రాణం!
‘గత డిసెంబరుతో (హైదరాబాద్ సమీపంలోని నారపల్లిలోని) మా మిద్దెతోట తొమ్మిదవ సంవత్సరంలోకి ప్రవేశించింది. గడచిన ఎనిమిది సంవత్సరాల కాలంలో మార్కెట్లో కూరగాయలు కొనలేదు – పండ్లు కొనలేదు! మిద్దెతోటలోనే ఉత్పత్తి చేశాం! ఎనిమిది సంవత్సరాల మిద్దెతోట ఉత్పత్తిని – రోజుకు కిలో చొప్పున లెక్కించినా – మూడు టన్నుల పైమాటే! ఇదంతా కేవలం 1240 స్క్వేర్ ఫీట్ల టెర్రస్ మీద మాత్రమే పండించాం. ఎనిమిది సంవత్సరాల క్రితం మిద్దెతోట నిర్మాణ వ్యయం ఇరవై వేల రూపాయలు. అయితే, ఈ ప్రత్యక్ష ఫలితాల గురించి కాదు నేను చెప్పాలనుకుంటున్నది.. అది అందరికీ కనిపించే విషయమే! ఈ ఉత్పత్తి వెనుక ఒక సహజసిద్ధమైన ‘జీవ వైవిధ్య ప్రభావం’ ప్రక్రియ ఉన్నదని తెలియ జెప్పాలన్నదే ఈ ప్రయత్నం. అదే లేకుంటే, ఈ ఉత్పత్తి వచ్చేదే కాదు! జీవ వైవిధ్యం వల్లనే ప్రకృతి కొనసాగుతున్నది. మనందరికీ తెలుసు, పరపరాగ సంపర్కం వల్లనే పువ్వులు ఫలిస్తాయని. తేనెటీగలు సీతాకోకచిలుకలు ఇతర రెక్కల పురుగులు అందుకు దోహదపడతాయి. పూలలోని తేనె కోసం తేనెటీగలు వచ్చి పువ్వుల మీద వాలినప్పుడు వాటి కాళ్ల నూగుకు పువ్వుల పుప్పొడి అంటుకుని.. అలా పరపరాగ సంపర్కం అప్రయత్నంగా జరుగుతుంది. అలా పువ్వులు ఫలదీకరణ చెందుతాయి. మనకు లభించే దాదాపుగా అన్ని రకాల ఉత్పత్తులు ఇలానే పండుతాయి. మిద్దెతోటను మనం అభివృద్ధి చేస్తున్నకొద్దీ, రావలసిన జీవజాతులు వచ్చి చేరతాయి. మిద్దెతోటల్లో పండ్ల మొక్కలను కూడా పెంచడం వల్ల పక్షులు కూడా వస్తాయి. చిన్న చిన్న పక్షులు మొక్కల మీద పురుగులను ఏరుకొని తింటాయి! మొక్కలకు హాని చేసే క్రిమికీటకాలను అలా కంట్రోల్ చేస్తాయి. కోయిలలు కూడా పండ్ల కోసం మిద్దెతోటల లోకి వస్తాయి. వాటి పాటలను వినగలగడం వల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. అది మన స్వయం కృషి ఫలమైన సహజ సంగీతం! మట్టిలో వానపాములు అభివృద్ధి అవుతాయి. వాటివలన సహజసిద్ధమైన ఎరువు తయారు అవుతుంది. మిద్దెతోటలో సంవత్సరం పొడవునా పువ్వు లుండేలా పూల మొక్కలను పెంచుతాం కనుక రంగురంగుల సీతాకోక చిలుకలు మిద్దె తోటలోకి వస్తాయి, తేనె తాగడానికి! తద్వారా పువ్వుల మధ్య పరపరాగ సంపర్కం జరిగి మనకు సంపూర్ణ ఉత్పత్తి వస్తుంది. గువ్వలు, పిచ్చుకలు వచ్చి మిద్దెతోటలో గూళ్లు కట్టుకుంటాయి. మిద్దెతోటల మొక్కలకు హాని చేసే పురుగూ పుట్రలను అవి తినేస్తూ మొక్కలకు పరోక్షంగా రక్షణ కలిగిస్తాయి. మిద్దెతోటల్లోకి ఎలుకలు కూడా వస్తాయి.. నష్టాన్ని కలిగిస్తాయి. ఎలుకల కోసం పిల్లులు వస్తాయి. ఇలా ఇప్పుడు మా మిద్దెతోటలో మూడు పిల్లులు ఉన్నాయి. ఒక పెంçపుడు శునకం ఉంది. వాటి మధ్య సఖ్యత కూడా కలిగింది! మిద్దెతోటలో నిత్యం పూసే పువ్వుల తేనె కోసం వందలాది తేనెటీగలు ఉదయం పూట వస్తాయి. మిద్దెతోటలో చిన్నచిన్న తేనెపట్టులు పెట్టుకుంటాయి. ప్రతీ చిన్న పువ్వు నుండి అవి తేనెను గ్రహిస్తాయి. కూరగాయ మొక్కల పువ్వుల నుండి కూడా తేనెను గ్రహిస్తాయి. ఆ ప్రక్రియ వల్లనే నిజానికి సమస్త రకాల పువ్వులు ఫలదీకరణం చెందుతున్నాయి. మనం నిత్యం తినే తిండి తయారీలో తేనెటీగల పాత్ర అపురూపమైనది – వెలకట్టలేనిది! మనం ప్రకృతి సమతుల్యతను కాపాడితే, అది మన ఆయురారోగ్యాలను కాపాడుతుంది! మిత్రుడు క్రాంతిరెడ్డి ఓ మాట అన్నాడు, ‘నేను మాత్రమే అనుకుంటే అహం – నేను కూడా అనుకుంటే సుఖం. మనుషులొక్కరే భూగోళం మీద మనలేరు – సమస్త జీవజాతుల మనుగడలో మనుషుల మనుగడ ముడిపడి ఉంది! పట్టణాలలో జీవ వైవిధ్యం పెరగాలంటే, మిద్దెతోటలను మించిన సాధనాలు లేవు! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు, నారపల్లి రఘోత్తమరెడ్డి మిద్దె తోటలో జీవవైవిధ్యానికి ఆనవాళ్లు.. పక్షి గూళ్లు, పక్షులు, పిల్లి, కుక్క.. -
ఆరోగ్యం.. ఆహ్లాదం..
‘సాక్షి’లో వారం వారం ‘ఇంటిపంట’ల సాగుపై ప్రచురితమవుతున్న కథనాలతో స్ఫూర్తి పొందిన దంపతులు తమ ఇంటిపైన గత 4 నెలలుగా సేంద్రియ పద్ధతుల్లో కూరగాయలు, ఆకుకూరలను సాగు చేసుకుంటున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లుకు చెందిన బిళ్లా వెంకటేశ్వరరావు, రామతులసి దంపతులు గ్రామంలోని బీసీ కాలనీలోని తమ డాబాపై ఇంటి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. డాబాపై సుమారు సెంటున్నర ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో సెంటు మేరకు ఇంటి పంటల సాగుకు కేటాయించారు. శ్లాబుపైన మూడు వరుసలుగా ఎత్తు మడులు(గాడులు) నిర్మించారు. వీటిలో తోటకూర, పాలకూర, గోంగూర, కొత్తిమీర, పొదీనా విత్తనాలు చల్లారు. వంగ, బెండ, గోరుచిక్కుడు, టమోట మొక్కలు నాటారు. అక్కడక్కడా తొట్లను ఏర్పాటుచేసి బీర, కాకర, దోస, పొట్ల, సొర విత్తనాలు నాటారు. నాలుగు నెలల క్రితం నాటిన విత్తనాలు ప్రస్తుతం కాపు నిస్తున్నాయి. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు రోజుకు గంట చాలు సాక్షిలో కథనాలు చదివిన తర్వాత మా డాబాపైనా ఖాళీ స్థలం ఉంది కదా మనమూ పండించుకుందాం అన్న ఆలోచన వచ్చింది. రసాయనిక పురుగు మందులు, ఎరువులు వాడకుండా సేంద్రియ కూరగాయలు పండించుకుంటున్నాం. మేం తినటమే కాకుండా ఇరుగు, పొరుగు వారు, బంధువులు, స్నేహితులకు కూడా కూరగాయలు ఇస్తున్నాం. ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక అర్థగంట మొక్కలతో గడిపితే ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. బడలిక, ఒత్తిడి పోతుంది. – రామతులసి, వెంకటేశ్వరరావు (93934 36555) దంపతులు -
ఆ ఇల్లు.. ఆహార పంటల పొదరిల్లు
ఆ ఇంటి మిద్దెపైకి వెళ్తే ఆకు కూరల పచ్చదనం స్వాగతం పలుకుతుంది. కాయగూరల మొక్కలు బోలెడు కబుర్లు చెబుతుంటాయి. రంగురంగుల పూలు పరిమళాలు వెదజల్లుతాయి. వెరసి ఆ ఇల్లు సేంద్రియ వనంగా, ఆహార పంటల పొదరిల్లుగా మారిపోయింది. ఆ సామ్రాజ్యానికి రారాణి.. తాడికొండ అనుపమ! విశాఖ నగరంలో శంకరమఠం ప్రాంత నివాసి అయిన అనుపమ తొలుత తన వంటగది సమీపంలో 10 కుండీల్లో ఆకుకూరలు పెంచారు. ఆ తర్వాత రెండేళ్ల నుంచి టెర్రస్‌పై కూరగాయల సాగు చేస్తున్నారు. భర్త టీవీ సుధాకర్ ప్రోత్సాహంతో ఆమె ఈ పనిని ఎంత శ్రద్ధగా చేస్తున్నారంటే ఈ రెండేళ్లుగా ఆకుకూరలు, కూరగాయలు కొనలేదట. ఆ ఇంట.. ప్రతి పంట.. అనుపమ ఇంటి టెర్రస్‌పై ప్రతి పంటా దర్శనమిస్తుంది. వంటగదిలో ఏర్పాటు చేసిన కుండీల్లో పుదీనా, కొత్తిమీర, కరివేపాకును పెంచుతున్నారు. కూరలకు అవసరమైన వాటిని ఆ కుండీల నుంచి తాజాగా తుంచి వంటలకు వినియోగిస్తున్నారు. అదే మాదిరిగా టెర్రస్‌పై తోటకూర, పాలకూర, మెంతి కూర, బచ్చలి కూర, గోంగూర, కొత్తిమీర, పుదీనా, ముల్లంగి, ఉల్లికాడలు, మెంతికూర తదితర ఆకుకూరలను సాగు చేస్తున్నారు. అదే విధంగా దొండకాయలు, బెండకాయలు, వంకాయ, టమాటా, బీర, దోస, చిక్కుడు, సొరకాయ, మిరపకాయలు, అల్లం, మామిడి అల్లం, వెల్లుల్లి, మునగకాయలు, ఫ్రెంచ్బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజీ, కాలిఫ్లవర్, చిక్కుడు, మునగ, బీట్రూట్ మొదలైన కూరగాయలు పండిస్తున్నారు. మిర్చిలో నాలుగైదు రకాలు ఉన్నాయి. జామ, నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీ మొక్కలను సైతం పెంచుతున్నారు. డ్రమ్ములు, సిమెంట్, ప్లాస్టిక్, మట్టి కుండీలతో పాటు ధర్మాకోల్ డబ్బాలు, వాటర్ క్యాన్లలోనూ మొక్కలు పెంచుతున్నారు. 10 మొక్కలతో ప్రారంభమైన ఆ ఇంటి పంట.. ఇప్పుడు 200కి పైగా మొక్కలకు చేరుకుంది.గోమూత్రం, ఆవు పేడను ఎరువుగా వినియోగిస్తున్నారు. వాడిపోయిన పూలు, రాలిన ఆకులు, కూరగాయ వ్యర్థాలను ఒక చోట చేర్చి, అందులో అప్పుడప్పుడూ మజ్జిగ చల్లుతూ 30 నుంచి 45 రోజుల్లో కంపోస్టు తయారు చేసుకొని, మొక్కలకు వాడుతున్నారు. పిల్లల కోసం లిటిల్ ఫార్మర్ కిట్ చిన్నారుల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించి లిటిల్ ఫార్మర్‌గా తీర్చిదిద్దాలని ఆమె సంకల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కిట్‌ను సిద్ధం చేశారు. ఒక గ్రోబ్యాగ్, మట్టి మిశ్రమం, విత్తనాలతోపాటు.. విత్తనాలు వేశాక దశలవారీగా మొక్కల పెరుగుదలను పిల్లలు నమోదు చేసేందుకు యాక్టివిటీ షీట్, కలరింగ్ షీట్, సలాడ్ రెసిపీతో పాటు లిటిల్ ఫార్మర్ సర్టిఫికెట్ కూడా ఆ కిట్‌లో ఉంటాయి. అనుపమ రూపకల్పన చేసిన ‘లిటిల్ ఫార్మర్ కిట్’ -
ఆ‘గట్టు’కుంటున్న సాగు
గట్లపై కూరగాయల పంట లాభాలార్జిస్తున్న యువ రైతు గొల్లపల్లి(బొబ్బిలి రూరల్): రెండెకరాల భూమిలో వరి పండుతోంది. ఆదాయం బాగానే వస్తోంది. దాంతో సంతప్తి చెందలేదా యువ రైతు. పొలం గట్టుపై పాదులు పెంచాడు. లాభాలు కళ్లజూస్తున్నాడు. వరికంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఆ యువకుడు గొల్లపల్లికి చెందిన పాలవలస చంటి. రెండెకరాల వరి పంట పొలం గట్టుపై బీర, చిక్కుడు, ఆనప పాదులు వేశాడు. వరి పంటపై ఆదాయం బాగానే వస్తున్నా.. కూరగాయల సాగుతో అధిక ఆదాయం వస్తున్నట్లు చంటి ఆనందంగా చెప్పాడు. 4.5 అడుగుల బీర.. రెండున్నర అడుగుల చిక్కుడు పొలం గట్లపై 3 నుంచి 4.5 అడుగుల పొడవైన బీరకాయలు, రెండున్నర నుంచి మూడున్నర అడుగుల పొడవువైన చిక్కుడు కాయలు కాయడం విశేషం. ఈ సీజన్లో బీర, చిక్కుడు కాయల దిగుబడి, డిమాండ్‌ను బట్టి కిలో రూ.20 నుంచి రూ.40 ధర పలుకుతోంది. వారానికి దాదాపు రూ.2 నుంచి రూ.3వేల ఆదాయం వస్తోంది. కష్టానికి ఫలితం దక్కింది – పాలవలస చంటి, గొల్లపల్లి ఏటా కూరగాయలు సాగు చేస్తున్నా. ఈ ఏడాది బాగుంది. రామభద్రపురం ప్రాంతం నుంచి తీసుకొచ్చిన ఈ విత్తనాలు బాగా దిగుబడి ఇస్తున్నాయి. వీటి ఖర్చు చాలా తక్కువ. వీటికి ఎలాంటి ఎరువు వేయలేదు. రోజూ 3 నుంచి 5గంటల పాటు పడ్డ కష్టానికి మంచి ఫలితం వచ్చింది.