ప్రతికూల వాతావరణ పరిస్థితులను, చీడపీడలను తట్టుకొని, మంచి దిగుబడులనివ్వటం అంటు మొక్కల ప్రత్యేకత. అడవి వంగ వేరు మొక్కపై ఏదో ఒక హైబ్రిడ్ కూరగాయ మొక్కను అంటుకట్టిన మొక్కలు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే, రెండు అంతకంటే ఎక్కువ రకాల కూరగాయ మొక్కలతో అంటుకట్టిన మొక్కలపై శాస్త్రవేత్తల పరిశోధనలు ఇప్పుడిప్పుడే ఫలిస్తున్నాయి.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ మొక్కల్ని అంటుకట్టే పద్ధతిని డ్యూయల్ లేదా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ పద్ధతి అంటారు. పూలు, పండ్ల మొక్కల ఉత్పత్తిలో ఇంతకు ముందే ఈ పద్ధతి ఆచరణలో ఉంది. కూరగాయ పంటల్లోనూ ‘బ్రిమాటో’ వంటి డ్యూయల్ గ్రాఫ్టింగ్ మొక్కలు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్ వారణాసిలోని భారతీయ కూరగాయల పరిశోధనా సంస్థ (ఐఐవిఆర్– ఐసీఏఆర్ అనుబంధ సంస్థ) ఈ దిశగా చురుగ్గా పరిశోధనలు చేస్తోంది. బంగాళదుంప, టొమాటో మొక్కలతో గ్రాఫ్టింగ్ చేసి గతంలో ‘పొమాటో’ మొక్కల్ని రూపొందించిన ఈ సంస్థే.. ఇటీవల వంగ, టొమాటో మొక్కలతో గ్రాఫ్టింగ్ చేసి ‘బ్రిమాటో’ మొక్కల్ని రూపొందించింది.
ఒకే కుటుంబానికి చెందిన రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల కూరగాయ మొక్కలను అంటుగట్టి.. ఆ అంటు మొక్క ద్వారా అనేక రకాల కూరగాయలను పండించటం ఈ ఆధునిక డ్యూయల్ లేదా మల్టిపుల్ గ్రాఫ్టింగ్ పద్ధతి ప్రత్యేకత. ఐఐవిఆర్‌లో గత కొన్నేళ్లుగా జరుగుతున్న పరిశోధనల ఫలితాలు ఇటు గ్రామీణ రైతులతో పాటు, అటు నగరాలు, పట్టణాల్లో సేంద్రియ ఇంటిపంటలు / మిద్దె తోటలు సాగు చేసే అర్బన్ ఫార్మర్స్‌లోనూ అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఒకే మొక్కకు రెండు అంట్లు
బంగాళదుంప+టొమాటో మొక్కలకు అంటుకట్టి ఈ రెండు కూరగాయలను ఉత్పత్తి చేసే ‘పొమాటో’ అంటు మొక్కల్ని రూపొందించారు. ‘పొమాటో’ అంటు మొక్కను పెంచితే భూమిలో బంగాళదుంపలు, చెట్టు మీద టొమాటోల దిగుబడి పొందవచ్చు.
అదేవిధంగా, వంగ + టొమాటో మొక్కలను అంటుకట్టి ‘బ్రిమాటో’ అంటు మొక్కల్ని రూపొందించారు. బ్రిమాటో మొక్క ద్వారానే వంకాయలు, టొమాటోలు కూడా పండించవచ్చు. డ్యూయల్ గ్రాఫ్టింగ్ ద్వారా మంచి దిగుబడులు సాధించినట్లు ఐఐవిఆర్ ప్రకటించింది.
‘బ్రిమాటో’ గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు?
అడవి వంగ మొక్కను వేరు మొక్క(రూట్‌స్టాక్)గా తీసుకొని.. దానిపైన ‘కాశీ సందేశ్’ హైబ్రిడ్ వంగ, ‘కాశీ అమన్’ హైబ్రిడ్ టొమాటో మొక్కలను డా. అనంత్ బహదూర్ గ్రాఫ్టింగ్ చేశారు.
25–30 రోజుల వంగ, 22–25 రోజుల టొమాటో మొక్కలను సైడ్ / స్లైస్ పద్ధతిలో గ్రాఫ్టింగ్ చేసి ‘బ్రిమాటో’ అంటుమొక్కలను సిద్ధం చేశారు. వేరు మొక్క, పైమొక్క కాండాలను 5–7 ఎం.ఎం.ల మేరకు ఏటవాలుగా కత్తిరించి అంటు కడతారు.
అంటుకట్టిన వెంటనే మొక్కలను పాలీహౌస్‌లో పెట్టి తగినంత ఉష్ణోగ్రత, తేమ, వెలుతురు ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. 5–7 రోజుల తర్వాత మొక్కల్ని బయటకు తెచ్చి, మరో 5–7 రోజులు నీడలో ఉంచుతారు. ఆ విధంగా గ్రాఫ్టింగ్ చేసిన మొక్కల్ని 15–18 రోజుల తర్వాత మడుల్లో నాటుతారు. అంటే.. ఇదంతా కలిపి నెల రోజుల పని. తొలి దశలో వంగ, టొమాటో అంట్లు సమానంగా పెరిగేలా జాగ్రత్త తీసుకుంటారు. కాండానికి అంటుకట్టిన చోటుకు కింద వైపు పిలకలు పెరగనివ్వరు. వస్తే వెంటనే తీసివేస్తారు.
మొక్కకు 5 కిలోల దిగుబడి
హెక్టారుకు 150: 60: 100 మోతాదులో ఎన్‌పికె ఎరువులతో పాటు 25 టన్నుల పశువుల ఎరువు వేసుకున్న తర్వాత అంటు మొక్కలు నాటుకోవాలని ఐఐవిఆర్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నాటిన 60–70 రోజులకు వంగ, టొమాటో మొక్కలకు కాపు ప్రారంభమవుతుంది. ఐఐవిఆర్ ప్రదర్శన క్షేత్రంలో ప్రయోగాత్మకంగా సాగు చేసినప్పుడు.. ఒక ‘బ్రిమాటో’ మొక్క నుంచి 36 టొమాటోలు (2.38 కిలోలు), 9 వంకాయల (2.7 కిలోలు) వరకు.. మొత్తం కలిపి 5 కిలోల దిగుబడి వచ్చింది.
నగరాలు, పట్టణాల్లో మిద్దెల పైన, పెరట్లో స్థలం తక్కువగా ఉండే ఇళ్ల దగ్గర మడులు, కంటెయినర్లలో పెంచుకోవడానికి, వాణిజ్యపరంగా ఆరుబయట పొలాల్లో పెంచుకోవడానికి కూడా డ్యూయల్ గ్రాఫ్టెడ్ బ్రిమాటో మొక్కలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఐఐవిఆర్ తెలిపింది.
‘పూలు, పండ్ల మొక్కలకే గతంలో పరిమితమైన డ్యూయల్ గ్రాఫ్టింగ్ పద్ధతిలోనే కూరగాయ మొక్కలకు అంటుకట్టి ‘బ్రిమటో’ మొక్కల్ని తయారు చేశాం. పౌష్టికాహార భద్రతకు ఈ ఆవిష్కరణ దోహదపడుతుంద’ని ఐఐవిఆర్ సంచాలకులు డా. టి.కె.బెహర అన్నారు. గ్రాఫ్టింగ్‌కు నెల రోజుల సమయం పడుతుంది. మొక్కను రూ. 10–11కు
అందుబాటులోకి తేవచ్చు. భారీగా ఈ అంటు మొక్కల్ని వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేస్తే ధర ఇంకా తగ్గొచ్చు. ఇంకా ఇతర కూరగాయ పంటలకు సంబంధించి కూడా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నాం అన్నారాయన.
ప్రకృతి సాగుకూ అనువైనవే!
డ్యూయల్ గ్రాఫ్టెడ్ ‘బ్రిమాటో’ అంటు మొక్కల ద్వారా ఒకేసారి వంకాయలు, టొమాటోలను పండించుకోవచ్చు. సేంద్రియ / ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూడా సాధారణ సాగు పద్ధతిలో మాదిరిగానే మంచి దిగుబడులు పొందవచ్చని ఐఐవిఆర్ ప్రధాన శాస్త్రవేత్త డా. అనంత్ బహదూర్ ‘సాక్షి’కి తెలిపారు.
ఎక్కువ దూరం రవాణా చేస్తే అంటు మొక్కలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, స్థానికంగానే ఔత్సాహికులకు అంటుకట్టే నైపుణ్యాన్ని నేర్పిస్తే మేలని ఈ–మెయిల్ ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. వేరు మొక్కపై రెండు కూరగాయ మొక్కల్ని అంటుకట్టే పద్ధతిని ఒక్క రోజులోనే ఔత్సాహికులకు సులభంగా నేర్పవచ్చని డా. అనంత్ బహదూర్ అన్నారు.
-పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
చదవండి: Organic Farming: 34 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...!
Comments
Please login to add a commentAdd a comment