Cocoponics- Soilless Cultivation: వేగంగా విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో సాగు భూమి తరిగిపోతోంది. నగరాలు, పట్టణాల్లో జనాభా సాంద్రత పెరుగుతున్నకొద్దీ స్థానికంగా నాణ్యమైన తాజా కూరగాయలు, ఆకుకూరల లభ్యతతో పాటు తలసరి వినియోగం కూడా తగ్గిపోతోంది.
మరోవైపు.. 40% సాగు భూమి అస్థిర సాగు పద్ధతుల వల్ల ఇప్పటికే సాగు యోగ్యం కాకుండా పోయింది. సాగు పద్ధతులు మార్చుకోకపోతే మిగతా భూములూ నిస్సారమైవడానికి మరో 60 పంట కాలాలే మిగిలి ఉన్నాయని అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
సారం తక్కువగా ఉన్న తేలిక భూములు, చౌడు భూములు, రాళ్ల భూములు, ఎడారి నేలలు విస్తరించిన ప్రాంతాలతో పాటు కిక్కిరిస్తున్న నగరాలు, పట్టణాలు, పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలందరికీ ఎక్కడో దూరంలో పండించి తగినన్ని కూరగాయలు, ఆకుకూరలు అందుబాటులోకి తేవటం పాలకులకు సవాలుగా మారింది.
రోజుకు మనిషి 400 గ్రాముల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు చెబుతున్నా.. ఆచరణలో ఇందులో సగం తినలేని స్థితిలో జనం మిగిలిపోతున్నారు.
ఇటువంటి సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు ‘కోకోపోనిక్స్ / మట్టి లేని సేద్యం’ అన్ని విధాలా ఉపకరిస్తుందని, భవిష్యత్తు ఆహారోత్పత్తిలో ఈ పద్ధతే ప్రధాన పాత్ర పోషిస్తుందనేది భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఏఆర్) అంచనా.
ఈ ఆలోచనతోనే ఐసిఏఆర్ అనుబంధ సంస్థ అయిన బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) శాస్త్రవేత్తలు ఏడేళ్ల క్రితం మట్టి లేని సేద్యంపై పరిశోధనలకు శ్రీకారం చుట్టారు.
నగర పరిమితులకు లోబడి తక్కువ స్థలంలో, తక్కువ నీటితో కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను ఆరోగ్యదాయకంగా ఇంటి స్థాయిలోనే కాకుండా, వాణిజ్య స్థాయిలోనూ పండించే సమగ్ర పద్ధతులపై ప్రయోగాలు చేసిన ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు ప్రమాణాలను రూపొందించి ప్రజలకు అందిస్తున్నారు.
కోకోపిట్, పోషక ద్రావణం
ఈ సాగుకు మట్టి అవసరం లేదు. సిల్పాలిన్ బ్యాగ్‌లలో శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎరువును నింపి, నిర్థారిత పరిమాణాల్లో 12 రకాల సూక్ష్మ, స్థూల పోషకాలతో కూడిన ద్రావణాన్ని డ్రిప్ ద్వారా అందించడమే ఈ పద్ధతిలో ప్రత్యేకత.
వాణిజ్య స్థాయిలో నాణ్యమైన, ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను సులువుగా పండించేందుకు అవసరమైన శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువు(అర్కా ఫెర్మెంటెడ్ కోకోపిట్)ను, పోషకాలతో కూడిన ద్రావణా(అర్కా సస్య పోషక్ రస్)న్ని ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చారు. సాయిల్ సైన్స్ శాస్త్రవేత్త డా. డి. కలైవనన్ నేతృత్వంలో ఈ పరిశోధనలు సాగాయి.
ఆరు బయటైనా పాలీహౌస్‌లో అయినా కూరగాయల సాగు గ్రో బాగ్స్‌లోనే
సాధారణంగా ఎక్కువ మంది వినియోగించే ఆకుకూరలు, కూరగాయలను ఆరు బయట నేల మీద, గచ్చు మీద, మేడ మీద లేదా గ్రీన్/ పాలీహౌస్‌లలో గ్రోబాగ్స్‌లలో పెంచే సాయిల్ లెస్ సాగు పద్ధతులపై ఐఐహెచ్‌ఆర్ నెలకో రోజు శిక్షణ ఇస్తోంది.
ఆకు కూరలు, టమాటా, మిరప కాయలు, క్యాబేజీ, దోసకాయలు, ఫ్రెంచ్ బీన్స్, బఠానీలు, పొట్లకాయలు, గుమ్మడికాయలతో పాటు విదేశీ రకాలైన రంగు క్యాబేజీ, జుకిని వంటి రకాలపై ఐఐహెచ్‌ఆర్‌లో మట్టి రహిత సేద్య పద్ధతిలో గ్రోబాగ్స్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేసి సత్ఫలితాలు సాధించారు.
మట్టి లేని సాగు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగరాలు, పట్టణ, పరిసర ప్రాంత ప్రజల రోజువారీ అవసరాలను పూర్తిగా తీర్చేలా కూరగాయలను పండించవచ్చని డా. డి. కలైవనన్ ‘సాక్షి’తో ఫోన్ ఇంటర్యూలో చెప్పారు.
కూరగాయ మొక్కల పెరుగుదలకు అవసరమైన అన్ని పోషక ద్రావణాలను సమతులంగా, సకాలంలో అందించడం వల్ల పోషక లోపం లేని కూరగాయలను, ఆకుకూరలను పిండించగలుగుతున్నామని ఆయన అన్నారు.
12 రకాల స్థూల, సూక్ష్మ పోషకాలను ద్రావణం ద్వారా అందిస్తుండగా, మరికొన్ని పోషకాలు కొబ్బరి పొట్టు ఎరువు ద్వారా, మరికొన్ని నీటి ద్వారా అందుతాయన్నారు.
కోకోపిట్ ఎంత వాడాలి?
గ్రో బ్యాగ్‌లో శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును నింపి.. విత్తనాలు లేదా మొక్కలు నాటి పోషకాలతో కూడిన ద్రవాన్ని డ్రిప్ ద్వారా అందించాలి. 12“12 అంగుళాలు లేదా 15“15 అంగుళాల సైజు గ్రో బ్యాగ్‌లో 8 నుంచి 10 కిలోల వరకు శుద్ధి చేసిన కోకోపిట్ ఎరువును వాడాల్సి ఉంటుంది.
వంగ, టమాటో, మిరప, చిక్కుడు, బఠాణీ, బెండ మొక్కలతోపాటు.. సొర, బీర, ఆనప, గుమ్మడి వంటి తీగ జాతి మొక్కల్ని సైతం ఈ సైజు గ్రోబాగ్‌లో ఒక్కొక్కటి పెంచి, వాణిజ్య స్థాయిలోనూ మంచి దిగుబడులు పొందవచ్చని డా. కలై వనన్ తెలిపారు.
అదే విధంగా, ఒక అడుగు ఎత్తు, అడుగు వెడల్పు, 4 అడుగుల పొడవు ఉండే సిల్పాలిన్ గ్రో బెడ్‌లో అయితే 45 కిలోల శుద్ధి చేసిన కొబ్బరి పొట్టు ఎరువు పోసి కూరగాయలు పెంచుకోవచ్చన్నారు.
కొబ్బరి పొట్టు ఎరువు ఒక్కసారి కొని వేసుకుంటే చాలు. ప్రతి పంట పూర్తయ్యాక 5–10 శాతం కొబ్బరి పొట్టు ఎరువు వేసి, కలియదిప్పి, కొత్త పంటను వేసుకోవచ్చు. కొబ్బరి పొట్టు కొన్ని పంటల తర్వాత పూర్తిగా చివికి చక్కని ఎరువుగా మారుతుంది. పాతదాన్ని మార్చాల్సిన అవసరం ఉండదని డా. కలైవనన్ స్పష్టం చేశారు.
రూపాయికి 2–11 రూపాయలు
వాణిజ్య స్థాయిలో మట్టి లేని సేద్యంలో కూరగాయలు, ఆకుకూరలను నేల మీద గానీ, మేడ/గచ్చు మీద గానీ గ్రోబాగ్స్‌లో సాగులో మంచి దిగుబడులు తీయవచ్చని డా. కలైవనన్ తెలిపారు. జుకిని, ఆకుకూరలు, గ్రీన్ క్యాబేజి, కీరదోస, బఠాణీ వంటివి మట్టిలో కన్నా కోకోపిట్‌లోనే ఎక్కువ దిగుబడి వచ్చింది.
బీన్స్, చిక్కుడు, మిరప, కలర్ క్యాబేజీ వంటి పంటల్లో మట్టిలో సాగుతో సమానంగా దిగుబడులు వచ్చాయన్నారు. అన్ని పంటల్లోనూ పది రోజులు ముందే పూత, కాత రావటం గమనించామన్నారు.
కూరగాయల రకాన్ని బట్టి రూపాయి పెట్టుబడికి రూ. 2.2 నుంచి రూ. 11 వరకు ఆదాయం వస్తుందన్నారు. ఇందులో కలుపు సమస్య అసలు ఉండదని, భూమిని దుక్కి చేసే ఖర్చు కూడా ఉండదన్నారు. నీటిలో కలిపే పోషకాలు అత్యంత శుద్ధమైనవి. ఇవి నూటికి నూరు శాతం నీట కరిగి మొక్కల వేర్లకు చప్పున అందుతాయి.
మట్టిలో వేసిన రసాయనిక ఎరువుల మాదిరి 50–75% వరకు ఏదో ఒక రకంగా వృథా కావటం.. భూమిని, నీటిని కలుషితం చేయటం అనే సమస్యలు ఇందులో ఉండవని ఆయన అన్నారు. మట్టి లేని సేద్యంలో పండిన కూరగాయలు, ఆకుకూరలు రుచిగా, ఎక్కువ కాలం తాజాగా ఉంటాయన్నారు.
సారవంతమైన భూమి అందుబాటులో లేని చోట్లలో, నగరాలు, పట్టణాల్లో మిద్దెలపైన, గేటెడ్ కమ్యూనిటీల్లో ఐఐహెచ్‌ఆర్ సూచిస్తున్నట్లు మట్టి లేని సేద్యం ఎంతో ఉపయోగకరం.
ఒక్క రోజు శిక్షణ!
మట్టి లేని సేద్యాన్ని బెంగళూరులోని ఐఐహెచ్‌ఆర్ ద్వారా ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక్క రోజు శిక్షణ చాలు. రైతులు, వ్యవసాయం అసలు తెలియని గృహిణులు, గ్రామీణులు సైతం ఐఐహెచ్‌ఆర్ శిక్షణ పొందవచ్చు. ఉన్నత చదువులు చదివిన యువతీ యువకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.
శిక్షణ పొందిన తర్వాత ఇంటి పట్టున కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కలను పండించుకొంటున్నారు. కొందరు అమ్మటం కోసం భారీ స్థాయిలో కూడా పండిస్తున్నారు. ప్రత్యక్షంగా, దూర ప్రాంతాల్లో ఉన్న వారి సౌలభ్యం కోసం ఆన్‌లైన్‌లో హైబ్రిడ్ మోడ్‌లో నెలకో రోజు శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ తేదీల కోసం ఐఐహెచ్‌ఆర్ వెబ్‌సైట్ చూడవచ్చు లేదా నాకు మెయిల్ పంపవచ్చు. – డా. డి. కలైవనన్, కోకోపోనిక్స్ నిపుణులు, భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ.
-– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
చదవండి: Sagubadi: కూరగాయల్లోనూ ‘డ్యూయల్ గ్రాఫ్టింగ్’! ఒకే మొక్కకు రెండు అంట్లు!
Comments
Please login to add a commentAdd a comment